కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
వరూధినీ ప్రవర సంవాదము
ఉ. వేలిమియున్‌ సురార్చనయు విప్రసపర్యయుఁ జిక్కె, భుక్తికి
న్వేళ యతిక్రమించె, జననీ జనకుల్‌ కడు వృద్ధు లాఁకటన్‌
సోలుచుఁ జింతతో నెదురు సూచుచునుండుదు, రాహితాగ్ని నేఁ,
దూలు సమస్తధర్మములుఁ దొయ్యలి! నేఁ డిలు సేరకుండినన్‌.
53
ఉ. నావుడు విన్నఁబాటు వదనంబున నించుక దోఁప బల్కె నో
భావజరూప! యిట్టియెలప్రాయము వైదికకర్మనిష్ఠలం
బోవఁగ, నింక భోగములఁ బొందుట యెన్నఁడు? యజ్ఞకోటులం
బావను లౌటకున్‌ ఫలము మా కవుఁగిళ్ళ సుఖించుటేకదా?
54
సీ. సద్యో వినిర్భిన్న సారంగనాభికా, హృతమై పిసాళించు మృగమదంబు
కసటువో బీఱెండఁ గరఁగి కఱ్ఱల నంటి, గమగమ వలచు చొక్కపు జవాజి
పొరలెత్తి ఘనసార తరువులఁ దనుఁదాన, తొరఁగిన పచ్చకప్పురపు సిరము
గొజ్జంగి పూఁ బొదల్‌ గురియంగఁ బటికంపు, దొనల నిండినయట్టి తుహినజలము
 
తే. వివిధ కుసుమ కదంబంబు దివిజతరుజ
మృదుల వసన ఫలాసవామేయ రత్న
భూషణంబులు గల, విందు భోగపరుఁడ
వయి, రమింపుము ననుఁగూడి యనుదినంబు.
55
క. అంధునకుఁ గొఱయె వెన్నెల?
గంధర్వాంగనల పొందు గా దని, సంసా
రాంధువునఁ బడియె దకట! ది
వాంధము, వెలుఁగు గని గొంది నడఁగిన భంగిన్‌
56
ఉ. ఎన్నిభవంబులన్‌ గలుగు? నిక్షుశరాసన సాయక వ్యథా
భిన్నత వాడి వత్తలయి కేలఁ గపోలము లూఁది, చూపులన్‌
విన్నఁదనంబు దోఁపఁ, గనువేఁదుఱున\న్‌ బయిగాలి సోఁకిన\న్‌
వెన్నవలెం గరంగు నలివేణులఁ గౌఁగిటఁ జేర్చుభాగ్యముల్‌.
57
క. కుశలతయే వ్రతముల నగు
నశనాయాపీడ నింద్రియ నిరోధమున\న్‌
గృశుఁడ వయి యాత్మ నలఁచుట?
సశరీరస్వర్గ సుఖము సమకొని యుండ\న్‌.
58
తే. అనినఁ బ్రవరుండు నీ వన్న యర్థ మెల్ల
నిజము కాముకుఁడైనవానికి, నకాముఁ
డిది గణించునె? జలజాక్షి! యెఱిఁగితేని
నగరమార్గంబుఁ జూపి పుణ్యమునఁ బొమ్ము.
59
క. బ్రాహ్మణుఁ డింద్రియవశగతి
జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా
జిహ్మగముల పాలై, చెడు
బ్రహ్మానందాధిరాజ్య పదవీ చ్యుతుఁడై.
60
వ. అనిన నత్తెఱవ యక్కఱకరి పలుకుల కులికి, గఱిగఱిం గఱవఁ
గరకరిం జెఱకు విలుకాఁడు పరఁగించు విరిదమ్మి గొరకలు నెఱఁ
కులఁ జుఱుకుచుఱుక్కునం గాఁడినఁ గడుం గెరలి, పరిణత వివిధ
విబుధతరు జనిత మధుర మధురసం బానుమదంబు నదటునం
జిదిమిన నెఱుంగక, మదనహరునైనఁ జదురునం గదియ గమ
కించు తిమురునం గొమిరెప్రాయంపు మదంబునను, ననన్య కన్యా
సామాన్య లావణ్యరేఖా మదంబునను, నొంటిపాటునం గంటికిం
బ్రియుండై, తంగేటి జుంటి చందంబునం గొంటుఁదనం బెఱుంగక
కుఱంగటనున్న యమ్మహీసురవరకుమారు తారుణ్యమౌగ్ధ్యంబులం
జేసి తన వైదగ్ధ్యంబు మెఱయఁ గలిగె నని పల్లవించు నుల్లంబు
నుల్లాసంబునం గదురు మదంబున నోసరించక, చంచల దృగంచల
ప్రభ లతని ముఖాంబుజంబునఁ బొలయ వలయ మణిగణ చ్ఛాయా
కలాపంబు లుప్పరం బెగయఁ, గొప్పు చక్కంజెక్కుచు, జక్కవ
గిబ్బలుం బోని గబ్బిగుబ్బల\న్‌ జొబ్బిల్లు కుంకుమ రసంబునం బంకి
లంబులగు హారముక్తాతారకంబుల నఖకోరకంబులం గీఱి తీరు
వడం జేయుచుఁ, బతిత వనతరు కుసుమకేసరంబులు దాల్చు
నెపంబునఁ బయ్యెద విదల్చి చక్క సవరించుచు, నంతంతం
బొలయు చెలులం దలచూపక యుండం దత్తఱంబునంజేసి
బొమముడిపాటుతో మగిడి మగిడి చూచుచుఁ, జిడిముడిపాటు
చూపుల నంకురించు జంకెనల వారించుచుం జేరి యిట్లనియె.
61
శా. ఎందే డెందము కందళించి రహిచే, నేకాగ్రత\న్‌ నిర్వృతిం
జెందున్‌ గుంభగత ప్రదీపకళికాశ్రీ దోఁప, నెందెందుఁ బో
కెందే నింద్రియముల్‌ సుఖంబుఁగను, నాయింపే పరబ్రహ్మ, 'మా
నందో బ్రహ్మ' యటన్న ప్రాఁజదువు నంతర్భుద్ధి నూహింపుమా!
62
తే. అనుచుఁ ద న్నొడఁబఱుచు న య్యమరకాంత
తత్తఱముఁ జూచి, యాత్మ నతండు దనకు
సిగ్గు వెగటును బొడమ, నిస్పృహతఁ దెలుపు
నొక్కచిఱునవ్వు నవ్వి, యయ్యువిద కనియె.
63
శా. ఈ పాండిత్యము నీకుఁదక్క మఱి యెందేఁ గంటిమే? కామశా
స్త్రోపాధ్యాయివి నా వచించెదవు మేలొహో! త్రయీధర్మము
ల్పాపంబుల్‌, రతి పుణ్య మంచు, నిఁక నేలా తర్కముల్‌? మోక్షల
క్ష్మీపథ్యాగమ సూత్రపంక్తికివె పో మీ సంప్రదాయార్థముల్‌.
64
మ. తరుణీ రేపును మాపు హవ్యములచేతం దృప్తుఁడౌ వహ్ని స
త్కరుణాదృష్టి నొసంగు సౌఖ్యము లెఱుంగన్‌ శక్యమే నీకు? నా
కరణుల్‌ దర్భలు నగ్నులుం బ్రియములైనట్లన్యముల్‌గా వొడ
ల్తిరమే? చెప్పకు మిట్టి తుచ్ఛసుఖము ల్మీసాలపైఁ దేనియల్‌.
65
చ. అనుటయు మాట లేక హృదయాబ్జము జల్లన మోము వెల్లనై
కనలుచు నీరుదేఱు తెలిగన్నుల నాతనిఁ బుల్కు పుల్కునన్‌
గనుఁగొని మాటలం బొదువు గద్గదికం దల యూఁచి యక్కటా!
వనిత తనంతఁ దా వలచి వచ్చినఁ జుల్కన కాదె! యేరికిన్‌?
66
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )