కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
వరూధిని పై కొనఁ బ్రవరుఁడు తిరస్కరించిపోవుట
మ. వెతలం బెట్టకు మింక న న్ననుచు నీవీబంధ మూడన్‌, రయో
ద్ధతి నూర్పుల్‌ నిగుడన్‌ విరులు చిందం గొప్పు వీడం దనూ
లత తోడ్తోఁ బులకింపఁగా, ననునయాలాపాతిదీనాస్యయై
రతిసంరంభము మీఱ నిర్జరవధూరత్నంబు పై పాటునన్‌.
67
శా. ప్రాంచద్భూషణ బాహుమూల రుచితోఁ బాలిండ్లు పొంగారఁ బై
యంచుల్‌ మోవఁగఁ గౌఁగిలించి యధరం బాసింప 'హా! శ్రీహరీ'
యంచున్‌ బ్రాహ్మణుఁడోర మోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ ద్రోచెఁ గలంచునే సతుల మాయల్‌ ధీర చిత్తంబులన్‌?
68
క. త్రోపువడి నిలిచి ఘన ల
జ్జా పరవశ యగుచుఁ గొప్పు సవరించి, యొడల్‌
దీపింప నతనిఁ జుఱచుఱఁ
గోపమునన్‌ జూచి క్రేఁటుకొనుచున్‌ బలికెన్‌.
69
ఉ. పాటున కింతు లోర్తురె కృపారహితాత్మక! నీవు త్రోవ ని
చ్చోట భవన్నఖాంకురము సోఁకెఁ గనుంగొనుమంచుఁ జూపి య
ప్పాటలగంధి వేదననెపం బిడి యేడ్చెఁ, గలస్వనంబుతో
మీటిన విచ్చు గుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందఁగన్‌.
70
క. ఈ విధమున నతికరుణము
గా వనరుహనేత్ర కన్నుఁగవ ధవళరుచుల్‌
గావిగొన నేడ్చి, వెండియు
నా విప్రకుమారుఁ జూచి యలమటఁ బల్కెన్‌.
71
ఉ. చేసితి జన్నముల్‌ దపము చేసితి నంటి, దయావిహీనతన్‌
జేసిన పుణ్యముల్‌ ఫలము సెందునె? పుణ్యము లెన్ని యేనియున్‌
జేసినవాని సద్గతియె చేకుఱు భూతదయార్ద్రబుద్ధి, కో
భూసురవర్య! యింత దలపోయవు నీ చదు వేల? చెప్పుమా!
72
సీ. వెలివెట్టిరే బాదములు పరాశరుఁ బట్టి, దాశకన్యాకేళిఁ దప్పుఁజేసి?
కులములో వన్నె తక్కువయయ్యెనే గాధి, పట్టికి మేనక చుట్టఱికము?
ననుపుకాఁడై వేల్పు నాగవాసముఁ గూడి, మహిమ గోల్పడియెనే మాందకర్ణి?
స్వారాజ్య మేలంగ నీరైరె సుర లహ, ల్యాజారుఁ డైన జంభాసురారి?
 
తే. వారికంటెను నీ మహత్త్వంబు ఘనమె?
పవన పర్ణాంబు భక్షులై నవసి, యినుప
కచ్చడాల్‌ గట్టుకొను ముని మ్రుచ్చు లెల్లఁ
దామరసనేత్ర లిండ్ల బందాలు గారె?
73
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )