కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
అగ్నిని బ్రార్థించి ప్రవరుఁ డిలుసేరుట
తే. అనిన నేమియు ననక యవ్వనజగంధి
మేని జవ్వాదిపస కదంబించు నొడలు
గడిగికొని వార్చి, ప్రవరుండు గార్హపత్య
వహ్ని ని ట్లని పొగడె భావమునఁ దలఁచి.
74
మ. దివిషద్వర్గము నీ ముఖంబునన తృప్తిం గాంచు, నిన్నీశుఁగా
స్తవముల్‌ సేయు శ్రుతుల్‌, సమస్త జగదంతర్యామివిన్‌ నీవ, యా
హవనీయంబును దక్షిణాగ్నియును నీయం దుద్భవించున్‌, గ్రతూ
త్సవసంధాయక! నన్నుఁ గావఁగదవే! స్వాహావధూవల్లభా!
75
ఉ. దాన జపాగ్నిహోత్ర పరతంత్రుఁడనేని, భవత్పజాంబుజ
ధ్యాన రతుండనేనిఁ, బరదార ధనాదులఁ గోరనేని, స
న్మానముతోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోనఁ గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా!
76
వ. అని సంస్తుతించిన నగ్నిదేవుం దమ్మహీదేవు దేహంబున సన్ని
హితుం డగుటయు నమ్మహాభాగుండు గండు మీఱి పొడుపుఁగొండ
నఖండ సంధ్యారాగప్రభా మండలాంతర్గతుండగు పుండరీక వన
బంధుండునుంబోలె నుత్తప్త కనకద్రవధారా గౌరంబగు తనుచ్ఛా
యావూరంబున నక్కాన వెలింగించుచు నిజగమన నిరోధిని యగు
నవ్వరూధిని హృదయకంజమున రంజిల్లు నమందానురాగరస
మకరందంబు నందంద పొంగంజేయుచుఁ బావకప్రసాద లబ్ధంబగు
పవనజవంబున నిజమందిరంబున కరిగి నిత్యకృత్య సత్కర్మ
కలాపంబులు నిర్వర్తించె నని మార్కండేయుండు క్రోష్టికిం
జెప్పెనని చెప్పిన.
77
క. జైమిని యా దివ్య ఖగ
గ్రామణులంజూచి వేడ్క గడలుకొనంగా
నామీఁద వరూధిని విధ
మే మయ్యె నెఱుంగఁ జెప్పరే నా కనుడు\న్‌.
78
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )