కావ్యములు మను చరిత్రము ద్వితీయాశ్వాసము
ఆశ్వాసాంత పద్యగద్యములు
శా. నిస్తంద్రప్రతిభా! సుధీనుత! దిశోన్మీలద్యశశ్శ్రీవధూ
హస్తాగ్రామలకాయమాన మహనీయాంభోజగర్భాండ! సై
న్యస్తోమోత్థ రజోవ్రజ స్థగిత కృష్ణాగౌతమీ మధ్య భూ
మ్యస్తోకోత్కలరాట్పురీ హరణ లీలావార్య శౌర్యోదయా!
79
క. బిసరుహనయనా నవవిధ
కుసుమాయుధ! యవధికుధరకూటాంచల భూ
విసృమర తేజ శ్చంపక
భసల దసత్కీర్తి మలిన పరిపంథినృపా!
80
కవిరాజ
విరాజితము.
నల నృగ రంతి భగీరథ భారతనందన కల్ప! యనల్ప యశ
శ్చులుకితలోక! విలోకివధూజన సూనశరానన! మానఖనీ!
ప్రళయ ఘనాఘన ఘోష జయానక భాంకృతి భీమ చపేట లుఠ
త్కలబరిగీకటకక్షితి రక్షక! కన్నడరాజ్య రమారమణా!
81
గద్యము. ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష
పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోపతాపస
ప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లికాల్లసాని చొక్కయామాత్యపుత్త్ర
పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవంబను మహా
ప్రబంధంబునందు ద్వితీయాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - dvitIyAshvAsamu ( telugu andhra )