కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
. శ్రీ వేంకటేశ పదప
ద్మావేశిత సదయహృదయ! హరనిటల నట
త్పావక పరిభావి మహః
ప్రావృతనిఖిలాశ! కృష్ణరాయమహీశా!
1
వ. అవధరింపు మమ్మహాత్మునకుం బక్షు లిట్లనియె. 2
వరూధినీ విరహ వేదనము
శా. ఆ భూదేవకుమారుఁ డేఁగినఁ దదీయానూన రమ్యాకృతిన్‌
దా భావంబున నిల్పి యంగభవ కోదండోగ్ర మౌర్వీరవ
క్షోభాకంపిత ధైర్యయై, యలఁత నచ్చో నిల్వ కచ్చెల్వ త
ద్భూభృన్మేఖల వెంటఁ గానలబడిన్‌ దుఃఖాబ్ధినిర్మగ్నయై.
3
క. తిరుగుచు ధరణీసురవరుఁ
డరిగిన చొప్పరసియరసి యటఁగానక యా
హరిణాంకముఖి సఖీజన
పరివృతయై మగిడి వచ్చి భావములోనన్‌
4
ఉ. అక్కట! వాఁడు నాతగుల మాఱడిసేసి దయావిహీనుఁడై
చిక్కక త్రోచి పోయె దరిఁ జేరఁగరాని వియోగసాగరం
బెక్కడ నీఁదుదాన? నిఁక నీకొఱనోములు నోఁచినట్టి నే
నెక్కడ? వాని కౌఁగి లది యెక్కడ? హా విధి? యేమి సేయుదున్‌?
5
ఉ. కమ్మనికుందనంబు కసుగందనిమే, నెలదేఁటి దాఁటులన్‌
బమ్మెరవోవఁ దోలుఁ దెగబారెఁడు వెండ్రుక, లిందుబింబమున్‌
గిమ్మననీదు మోము, గిరిక్రేపులు మూఁపులు , కౌను గాన రా
దమ్మకచెల్ల! వాని వికచాంబకముల్‌ శతపత్త్ర జైత్రముల్‌.
6
ఉ. చొక్కపుఁబ్రాయమున్‌ మిగుల సోయగముం గల ప్రాణనాయకుం
డెక్కుడు వశ్యతన్‌ రతుల నేఁకటఁ దీర్చి సమేళ మొప్పఁగా
నక్కున గారవించి ప్రియ మందఁగ నోఁచని యింతిదైన యా
చక్కఁదనం బ దేమిటికి? జవ్వన మేటికిఁ? బ్రాణ మేటికిన్‌?
7
ఉ. ఎంత తపంబు సేసి జనియించిన వారొకొ! మర్త్యభామినుల్‌
కాంతుఁడవజ్ఞ చేసినను గాయము వాయుదు; రే నమర్త్యనై
చింతల వంతలం జివికి సిగ్గఱితిన్‌ మృతి లేని నాదుచె
ల్వింతయు శూన్యగేహమున కెత్తిన దీపిక యయ్యె నక్కటా!
8
వ. అని వితర్కించుచుఁ గ్రిందుఁదనంబునం బునఃపునః పరిభవ
కారియై కాఱియఁ బెట్టు సిరిపట్టి బెట్టేయం గాఁడిచను నలరంప
కట్టియల గుట్టుచెడి వెచ్చవెచ్చనై హెచ్చి విచ్చలవిడిం గాయు
నుద్దామ విరహ దవదహన దాహంబున దేహంబు తల్లడిల్ల,
మల్లడిగొని పెల్లడరు నిట్టూర్పుగాడ్పు విసరులం గస రెత్తి
యంతకంత కంతరంగంబున నితంతనరాక పొంగి చింతాసాగ
రంబు వేగిరంబ వెల్లివొడిచె ననం దుడిచిన నడంగక సారెకుం
దారకల నీరిక లెత్తు పొగ రన నిగనిగ లినుమడిగ నిగుడ
మిగులు వగల బుగులు బుగులున నెగసి యెగసి యొప్పులకుప్ప
లగు ఱెప్పలం జిప్పిలు కాటుక లప్పళించి కరంచి దరదళ దరుణ
కమలదళ శోణంబులగు దృక్కోణంబులన్‌ దిగువాఱు కన్నీరు
చెన్నారు కర్ణద్వయీ గోళంబులు నిండి తనుతాప తప్తంబగు
హాటకతాటంక యుగళంబునంబడి క్రొంబొగ లెగయింప, బిస
కిసలయ సగంధంబగు మణిబంధంబునఁ జికురబంధంబుఁ జేర్చు
కొని పొరలం దుఱిమిన విరు లురుల నరవిరిసి కవిసి యిరులు
కొను గరగరని నెఱికురులు గుఱిగడవఁ బెరిఁగినవగుటం జేసి
రాశివడి మెయి మూసికొని గ్రహగణంబులం జెన్నగు మిన్ను
విఱిగి పయింబడిన వడుపున బెడంగువడఁ, గలయఁ దలకొను
పులకమొలక పయిరునకుం బాఱు దుర్వార వారిపూరం బనం గ్రమ
క్రమంబున సంగంబులం గ్రమ్ము చెమ్మటల మిన్నేటి పెన్నీటి
వఱ్ఱున మునుంగకుండ సవరించిన మించు కుంభప్లవం బనం
బరిభ్రష్టోత్తరీయంబై బయలువడి యబ్బురంపు గుబ్బ చనుదోయి
నిబ్బరంపు మెఱుంగు లీనం, గుపిత హర నయన శిఖి శిఖా
భస్మీకృత స్మర విరహ శోకంబునం బడి చందురునిం బట్టుకొని
యడలు రతిరమణి చందంబునం, గుసుమిత లతాంత నిశాంత
శశికాంత వేదికాంతరంబున మేను సేర్చి వివిధ దశాంతరంబుల
వేఁగుచుండె నంత.
9
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )