కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
సూర్యాస్తమయ వర్ణనము
చ. తరుణి ననన్యకాంత నతిదారుణ పుష్పశిలీముఖవ్యథా
భర వివశాంగి నంగభవు బారికి నగ్గముసేసి క్రూరుఁడై
యరిగె మహీసురాధముఁ డహంకృతితో నని, రోషభీషణ
స్ఫురణ వహించెనో యన నభోమణి దాల్చెఁ గషాయదీధితిన్‌.
10
సీ. ఉరుదరీకుహర సుప్తోత్థ శార్దూలముల్‌, ఝరవారి శోణిత శంకఁ ద్రావ
వనకుంజమధ్య శాద్వలచరన్మృగపంక్తి, దావపావక భీతిఁ దల్లడిల్ల
నాశ్రమాంతర భూరుహాగ్రముల్‌ మునికోటి, బద్ధకాషాయ విభ్రాంతిఁ జూడ
ఘనసాను శృంగ శృంగాటకంబులఁ గాంచి, యమరులు హేమాద్రి యనుచు వ్రాలఁ
 
తే. గాసెఁ, బేశలరుచిఁ గింశుక ప్రవాళ
ఘుసృణ కిసలయ కంకేళి కుసుమగుచ్ఛ
బంధుజీవ జపా రాగ బాంధవంబు
లన్నగంబున జరఠారుణాతపములు.
11
శా. శ్రేణుల్‌ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్‌ బక్షు, లుష్ణాంశుపా
షాణవ్రాతము కోష్ణ మయ్యె, మృగతృష్ణావార్ధు లింకెన్‌, జపా
శోణం బయ్యెఁ బతంగబింబము, దిశాస్తోమంబు శోభాదరి
ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్‌.
12
క. తరణి యిదె గ్రుంకుచున్నాఁ
డరుదె మ్మని చంద్రుఁ బిల్వ నరిగెడు రజనీ
తరుణీమణిదూతిక లన
నరిగెం దూర్పునకు నీడ లతిదీర్ఘములై.
13
క. క్రుంకె నపరాంబురాశిం
బంకజబంధుఁడు తదీయ బడబాముఖ వీ
క్షాంకురిత కుతుక రథ్య ని
రంకుశ వేగాపహృత శతాంగుఁడు వోలెన్‌.
14
వ. ఆ సమయంబున. 15
సీ. ఏ విహంగముఁ గన్న నెలుఁగిచ్చుచును సారె, కును సైకతంబులఁ గూఁడ దారుఁ
దారి కన్గొని యది తనజోడు గాకున్న, మెడ యెత్తి కలయంగ మింట నరయు
నరసి కన్నీటితో మరలి తామర యెక్కి, వదన మెండఁగ సరోవారి నద్దు
నద్ది త్రావఁగ సైఁప కట్టిట్టు గన్గొని, ప్రతిబింబ మీక్షించి బ్రమసి యుఱుకు
 
తే. నుఱికి యెఱకలు దడియ వేఱొక్కతమ్మి
కరుగు, నరిగి రవంబుతోఁ దిరుగుతేంట్లఁ
బొడుచు ముక్కున, మఱియును బోవు వెదుక
సంజఁ బ్రియుఁ బాసి వగ నొక్క చక్రవాకి.
16
సీ. రవిబింబ పతన దీర్ఘ పయోధి గర్భ ని, ర్గత శేషఫణి ఫణా రత్న రుచియొ!
దివసావసాన సందీప్తాస్తగిరి శిఖా, జ్యోతిర్లతా ప్రతానాతపంబొ!
తపనధూర్దండ నిర్దళిత దిక్తట దృశ్య, కమలజాండ కటాహ కనకఘృణియొ!
చండీశ తాండవోత్సవ సంభృతక్షపా, హస్తాగ్ర దీప గభస్తి చయమొ!
 
తే. ద్రా గ్విదాహ చ్ఛిదా వినిద్రాణ మదవ
దంజనాలాన మూల శయ్యా విధాన
వారుణాధోరణాకల్పితోరు శోణ
మృత్తికా రాశియో! యన మెఱసె సంధ్య.
17
క. బహుళజల ప్లవమాన
ద్రుహిణాండము చెమ్మ యుఱికి రూక్షార్కవిభా
రహితతఁ గాటుకపట్టెను
రహి చెడి యన నంధతమస రాసులు బెరసెన్‌.
18
సీ. మృగనాభిపంకంబు మెయినిండ నలఁదిన, మాయాకిరాతు మైచాయఁ దెగడి
నవపించమయభూష లవధరించి నటించు, పంకజాక్షునిచెల్వు సుంక మడిగి
కాదంబ నికురంబ కలిత యై ప్రవహించు, కాళిందిగర్వంబుఁ గాకుసేసి
తాపింఛవిటపి కాంతార సంవృతమైన, యంజనాచలరేఖ నవఘళించి
 
తే. కవిసె మఱియును గాకోల కాలకంఠ
కంఠ కలకంఠ కరిఘటా ఖంజరీట
ఘనఘనాఘనసంకాశ గాఢకాంతిఁ
గటికిచీఁకటి రోదసీ గహ్వరమున.
19
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )