కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
చంద్రోదయ వర్ణనము
క. అంతటఁ బ్రాచి నిశాపతి
యంతికగతుఁ డౌట విని ముఖాలంబి తమః
కుంతలములు దీర్పఁగఁ గొను
దంతపుదువ్వెన యనంగ ధవళిమ దోఁచెన్‌.
20
చ. మరున కొసంగఁ గాలము తమశ్ఛట గాటుకగా నవోదయ
స్ఫురదరుణప్రభా పథిక శోణితసిక్త సితోడుభక్తమున్‌
హరిహయదిఙ్నభస్స్థలమునన్‌ బలి చల్లి వటాంకమున్‌ వసూ
త్కరభరితంబు నై వెలుఁగఁ గాంచి సుధానిధి నెత్తె నత్తఱిన్‌.
21
మ. జలజాగారపరంపరల్‌ మఘవదాశాభిత్తిఁ దీండ్రించుచున్‌
దళ మై వెన్నెలచిచ్చు లంటిన మిళద్బాహ్య చ్ఛదశ్యామికా
చ్ఛలనం గంది ముడుంగుచో సిమసిమచ్ఛబ్దంబుతోఁ బుట్టు న
గ్గలపుంగ్రొంబొగలో! యనంగ వెడలెన్‌ గర్భస్వనద్భృంగముల్‌.
22
సీ. ప్రిదిలి కైరవదళశ్రేణి నొక్కులు దీరె, శశికాంతపంక్తుల జలము లూరెఁ
గోరి కాంతులతోఁ జకోరికల్‌ రతిఁ గేరె, వారాశిగర్వంబు మేర మీఱెఁ
ద్రోపడి యిరులు పటాపంచలై పాఱె, దిఙ్ముఖంబుల వింతతెలివి సేరెఁ
జక్రవాకంబు లబ్జకుడుంగములు దూఱెఁ, గామినీకాంతుల కలఁక దేఱె
 
తే. మదనుఁ డమ్ముల నూఱె, హిమంబు పేరె,
జడిసి విరహిణి వగఁ గూరె, జారచోర
దర్పములు జాఱె, రవికరతాప మాఱెఁ,
జూడఁ జూడంగఁ దారక స్ఫురణ దాఱె.
23
మ. స్ఫుట సౌగంధిక రాగ రక్తరుచి మైఁ బూనెన్‌ జపాసన్నిధి
స్ఫటికంబ ట్లుదయాద్రి గైరిక శిరస్స్థానస్థితిం జంద్రుఁడ
చ్చొటువాయన్‌ శుచియయ్యె, నౌఁబ్రకృతి నచ్ఛుండైన సన్మార్గియె
న్నఁటికిం గూటమివంక వచ్చువికృతిన్‌ మగ్నుండు గానేర్చునే?
24
శా. ఆరూఢస్థితిఁ జంద్రికాధవళితాజాండంబులోఁ జంద్రుఁ డొ
ప్పారెం, గాలభిషగ్వరుం డవిరతంబై కాముకశ్రేణికిన్‌
మారోత్సాహము నిల్వఁ, బాదరసముం బంధించి, గ్రాసార్థ మై
క్షీరస్థాలికఁ బెట్టినట్టి గుటికాసిద్ధౌషధంబో? యన\న్‌.
25
తే. రాజు తేజస్వియై గ్రహరాజుమీఁద
నలిగి దాడిగ వెంటాడ, నిలువ కతఁడు
బెగడువడి పాఱుచోఁ, జెఱఁ దగిలినట్టి
ఛాయ యిది యన నీలలాంఛనము మెఱసె.
26
తే. కలయ జగమునఁ గలయట్టి నలుపు లెల్లఁ
దెలుపులుగఁ జేసి, నీడలు దెలుపు సేయఁ
గా వశము గామిఁ, బొడము దుఃఖమునఁ బోలె
సాంద్రచంద్రిక తుహినబాష్పములు గురిసె.
27
వ. మఱియు వికసితకైరవంబు లగు సరోవరంబుల నిజధవళధాళ
ధళ్యంబున నాక్రమించి యందు నానందించు నరవిందమందిరకుం
బుట్టినింటిసొబగు చూపి, చూపఱకు నిందుబింబం బిది గ్రహంబు
లివి యను నంతరంబు లేకుండ నేకవర్ణంబు గావించి, సేవించు
చకోరకదంబంబుల పుక్కిళ్ళకు వెక్కసంబై ముక్కులకు నెక్కి
చిక్కంబడి, యొండొండ బొండుమల్లియల దందడిం దొరఁగు
పుప్పొళ్ళ నుప్పతిల్లు నెత్తావులకు వెకలులై యాడుమొకరి తుమ్మెదలు
రొదలు గల మెఱుఁగుడుంబురువులట్లు మిసమిసని మెఱవ
ససిమెఱుంగు మొత్తంబుల నుమిసి యుమిసి, యందంద ప్రవహించు
నిందూపల స్యందంబులకు విందు లగు నిందీవరమరందంబుల బెందడిం
బడి బందనగొను వలిమించుక్రొమ్మంచుటౌదులీఁది యీఁది,
వడిసడలి సుడివడుచు నొడలోము సోమరిగాలి యలవోక
సోఁకులం గదలెం గదల వనం గదలునుపవన కదళి కేతకీ
తాలహింతాల నారికేళపూగావళి కోమల పలాశద్రోణికల నునుపుగల
పొరల యోరల శరధితరఁగల మీఁదనుంబోలె గిఱికొని,
యెల్లవల్లికలుం బూవకఁపూచిన ట్టుల్లసిల్ల ఱెల్లుల్లసిల్లిన చందంబునం
దెల్ల తెల్లనై, మొల్లమిగ నంతకంతకు దిగంతంబులు
దంతంబులు దీరిచిన యిడుపులుంబోలెఁ దీండ్రింప రేయెండ
దానగుటం జేసి యెండమావులం బుట్టించె ననం బట్టుగల పటికంపు
రాచట్టు నేలల నెట్టుకొని, వెండియుం జిట్టకంబులకుం
బెడమొగంబు వెట్టుకొని పట్టఁబట్టం బోవు ప్రాణభర్తల వెంటంబడి
నూపురంబులు మొరయ వేనలులు విరియఁ గ్రమంబునంబుట్టు
నిట్టూర్పు పవనంబు జవంబునం బైఁటకొం గెడలింప నందని
కౌఁగిటం బొదివి ప్రియంబు చిలుకం బలికి ముద్దాడు జవరాండ్ర
దంతచంద్రికల సాంద్రతం బంతంబు మెఱసి, మంతనంపువేళల
మాటతబ్బిబ్బునం బుట్టు పొలయలుకలం దలలు వంచి రొద లేని
నాలియేడ్పు లేడ్చు ప్రియల ననునయింప నింపునం జనవుమెఱసి
చెక్కుటద్దంబులు నొక్కి మొగం బెగయ నెత్తి ముత్తియంపు
ముంగఱ రంగునఁ గడలుకొను బుడిబుడి కన్నీటం బ్రతిఫలించి
తుఱంగలించు తనదు నిగనిగలు గనుంగొని నగెనగె ననుచుం
జుంబనం బిడం బోయి కెంగేల నదరంట వాటువడు కాముకుల వెల
వెలపాటుకూటువం గోటికిం బడగలెత్తి, పిండి చల్లినగతిం గాయ
డాయ లజ్జించి బుజ్జవంబునం బొదరిండ్లకుం దార్చి కాంతులం
గవయ నంగనాచులగు నంగనల యంగంబుల పస ముంగిటంబడఁ
జలిత కిసలయాంతరాళంబులం దూఱితూఱి యిరులు విరియించి,
పతుల ప్రార్థనంబులం బుంభావ సురతాడంబరంబునకుఁ దోడు
సూపి దూపటిలి యంగరాగంబులు గరంగం జెమర్చిన చంచలాక్షుల
నిద్దంపుఁ దనూలతలం బుట్టి దట్టంబులగు చిఱుచెమట బొట్టులం
బొడకట్టి తెలుపారు మలయజంపుఁ జిటులు గందంబుల యందంబు
లొసంగి, సంజకడం దారు నొడివిన సంకేతంబుల నుండక తెరువు
గట్టి పొరువుఁ దరువుల నీడల నడంగి నవ్వుటాలకు వెనుకపాటునం
గదిసి ముసుంగు లెడలింప బెగడి కళవళంపుఁ జూపుల వల్లభులం
జూచి యల్లన నగు నభిసారికల వెడందకన్నుల చెన్ను నన్ను
కొని, పొదలు మదనోన్మాదంబునకుం బ్రోదిగా మోదంబునం
గాదంబరి గండూషించి విటకదంబంబునకుం నొసంగు నంబురుహముఖుల
యొప్పులకుప్పలగు నిప్పపూ మొగ్గలం బోని బుగ్గలం దగ్గలిక సూపు
కమ్మ పంజుల వజ్రపుం జకచకల నకనకలు వీడుకొని,
కలికితనంబులం గలసి మెలసి రతాంతంబునం బరిశ్రాంతి
యడంగ నంగణంబుల నిలిచి యొండొరులకురులు దువ్వుచు విహరించు
సమయంబునం బల్లవులు కేళి కల్లప్పుడన్న తమ మాటలు
దలఁపించిన నుదరిపడి మందస్మితంబు లంకురించు హుంకృతుల
జంకించి కంకణంబుల రత్నంపుఁ దళుకులు సెదర నుంకించి
వైచు చేమంతిపూబంతులం బుటపుటనై, మిటమిటం గాయు
దట్టంపుఁ బండు వెన్నెల మెండున బెండువడి డెందంబు గంది తాలిమి
చిందువందై కెందలిరు పాన్పునం దను వొందక లేచి కూర్చుండి
కన్నీరు గోట మీటుచు బోటితో వరూధిని యిట్లనియె.
28
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )