కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
వరూధినికిఁ జెలుల శైత్యోపచారములు
ఉ. నోములు నోఁచినమ్మలు మనోరథముల్‌ దయివాఱ నిత్తఱిం
దామరతంపరై ప్రియులుఁ దారు విహారము సల్ప, వీరిలో
నీమెయి దుఃఖశీల నగునే వసియింపఁ దరంబె? పోద మా
రామముఁ జూద నందు సుకరం బగు సర్వము నంబుజాననా!
29
క. అని పలికి పాన్పు డిగి కా
మిని చంద్రాతపము వేఁడిమికిఁ బైఁట చెఱం
గున ముసుఁ గిడి నిజకేళీ
వనిఁ జొచ్చి వియోగవహ్ని వడఁబడి తెగువన్‌.
30
సీ. చనుఁగప్పు దొలఁగ వాసన గాలి కెదురేఁగుఁ, బరువొప్ప నలుఁగులఁ బాఱు కరణి
నిడుదవేనలి నూనెముడి వీడఁ జిగురాకుఁ, బొదఁ దూఱుఁ గార్చిచ్చుఁ గదియు కరణిఁ
బసిఁడిగాజులు పైకి వెసఁ ద్రోచి నునుఁదీఁగఁ, దెమలించు నురిత్రాడు నెమకు కరణి
మొలనూలు బిగియించి వెలఁది వెన్నెలఁ జొచ్చుఁ, బిఱుదీయ కేటిలో నుఱుకు కరణి
 
తే. జడియ దళులకుఁ, గురియు పుప్పొడుల మునుఁగు,
మావి కడ నిల్చు, విరుల నెత్తావిఁ గ్రోలు,
విషమసాయకు నేఁపుల విసివి విసివి
తనువుఁ దొఱఁగంగఁ దలఁచి యవ్వనరుహాక్షి.
31
క. అట్టియెడ నమ్మృగేక్షణఁ
బట్టి సఖీజనము వెడఁగుఁబట్టీ! తగవే
యిట్టి తెగు వనుచుఁ, జెక్కులఁ
దొట్టిన కన్నీరు వోవఁ దుడుచుచుఁ బలికెన్‌.
32
ఉ. పూఁతపసిండివంటి వలపున్‌ బచరించు కులంబు నీతికిన్‌
లేఁత గదమ్మ యిత్తెఱఁగు? లేమ! సురాంగన లెల్ల నిట్టి నీ
చేఁతకు మెత్తురమ్మ? దయసేయక తిన్నని మేను వెన్నెలన్‌
వేఁతురటమ్మ? యింత కనువేఁదుఱు సెల్లునఁటమ్మ యింతికిన్‌?
33
చ. ఉడుపతిబారికిన్‌ వెఱచి యూఱట యౌ నని పేరుటామనిన్‌
ముడివడు కంతుసేనలకు ముయ్యెల గుట్టయినట్టి యిందు రా
నడఁగునె తాపవహ్ని? మన మై హరితేక్షణ! ముల్లు పుచ్చి కొ
ఱ్ఱడిచిన చంద మయ్యెఁ, బదమా యెలదోఁటఁ జరింప కింటికిన్‌!
34
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )