కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
చంద్రోపాలంభము
క. అని యొడఁబడఁ బల్కుచుఁ దో
డ్కొని వచ్చినఁ బాన్పుఁ జేరి గురుకుచ, తనపైఁ
గనకనఁ గనలెడు వెలుఁగులఁ
గనికర మఱి మండు చంద్రుఁ గని కర మలుకన్‌.
35
క. ఓచెల్ల! విరహిణీవధ
మే చతురత నీకు? దురితమే చేయు పనుల్‌
రాచఱికపు ఫలమే? య
య్యో చంద్ర! వివేక మెఱుఁగవొకొ గురుసేవన్‌?
36
సీ. తొలుదొల్తఁ గమలమిత్రుని వంక రూపౌట, దక్షాధ్వరధ్వంసి తన్ను గనుటఁ
బరివేషమిషమునఁ బాశంబు దాల్చుటఁ, గప్పు దేహమునందుఁ గానఁబడుటఁ,
గాలవశంబునఁ గాని తోఁపక యుంట, సతతనిష్ఠురగదాన్వితతఁ గనుటఁ
బూని పాండుక్షేత్రమునఁ బ్రవర్తించుటఁ, బ్రకటానురాగతారకుఁ డగుటను
 
తే. నంతరం బెద్ది యాత్మలో నరసి చూడ
రాజ! నీకును నల ధర్మరాజునకును?
బ్రాణిలోకంబు బాధలఁ బఱుచునపుడు
ధర్మపద మొక్కఁ డెక్కు డా ధన్యునందు.
37
చ. ఒక పెనుబాఁపఱేడు చలమొప్ప రసాతలసీమకుం, జకో
రకములు భూతధాత్రికి, సురల్‌ దివికిం బగదీఱునట్లుగా
మెకమెకపాటుతోడ నిను మ్రింగక పో రెపుడుం, ద్రిలోకకం
టకుఁడవు గాన, నీయొడలు నజ్జుగఁ జేసి కురంగలాంఛనా!
38
క. వాతాపివలన నెఱిఁగితొ
శీతకిరణ! కడుపుఁ జొచ్చి జీర్ణింపని యీ
రీతి? నినుఁ దినియు నాయువు
చేత సురల్‌ చెడరుగాక, చెఱుపవె వారిన్‌?
39
తే. త్రిపురసంహార మొనరించునపుడు హరుఁడు
బండికల్లుగ నీమేను గండి చేసె
నదియు సెలవాఱి తెగటాఱవైతి చంద్ర!
యకట! రోహిణియెడ నపథ్యమునఁ జేసి.
40
తే. పాలఁ బుట్టిన మాత్రాన మేలి గుణము
నేఁడు నీకేల గల్గు నో నీరజారి!
నీటఁ బుట్టిన వాఁడు గాఁడోటు వహ్ని?
కాల్చుచున్నాఁడు జగమెల్లఁ గరుణలేక.
41
క. గోవధము సేయు తురకల
దైవంబవు నీవు మొదలఁ, దక్కక పాంథ
స్త్రీవధము సేయ రోయుదె?
నీవర్తన మేమిచెప్పు? నీరజవైరీ!
42
క. విడువక తలపయిఁ గొన్నా
ళ్ళిడి చూచి కళంకి వగుట యెఱిఁగి, మహేశుం
డుడుకుచు దక్షాధ్వరమున
నడుగునఁ బడవైచె దాన నడఁగవు చంద్రా!
43
క. గాండీవము నీ చేతిది
పాండవునిం జేరఁబట్టి బ్రతికితి మా వి
ల్లుండిన నేఁడు నిశాచర!
చెండవె యల్లునికిఁ దోడు శిత భల్లములన్‌?
44
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )