కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
మలయ పవనోపాలంభము
తే. అనుచు నిందించి వలవంత యినుమడింప
నవ్వరారోహ విదళిత హల్లకముల
కమ్మపుప్పొడి పై దుమారమ్ము రేఁచు
మలయ మంథర పవనుపై నలుక వొడమి.
49
ఉ. అక్కట గంధవాహ! తగవా హరిణాంకునిఁ గూడి పాంథులం
బొక్కఁగఁ జేయఁ? బావకుని పొం దొనరించి జగమ్ము లేర్చు నీ
యక్కొఱగామి మాన, వది యట్టిద, చుల్కనివృత్తి దుర్జనుం
డొక్కనిఁ జొచ్చి క్రిందపడు నొడ్లకుఁ గీ డొనరింపఁ గల్గినన్‌.
50
క. నాలుకలు రెండు నిన్నుం
గ్రోలనె కల్పించె నలువ ఘోరాహికి, న
న్నాలి గ్రహ మిపుడుఁ దెగఁ దినఁ
జాలద మృదుపవన! విరహి జన దురితమునన్‌.
51
వ. అని పలికి యక్కలకంఠకంఠి దీపించు తాపంబు పెల్లున
మూర్ఛిల్లినం, జూచి తోడిపల్లవోష్ఠు లల్లనల్లన హల్లకంబుల
హిమాంబు పూరంబులం గర్పూరపటీర కర్దమాసారంబులం జెంగావుల
మృణాలభంగంబుల నంగంబులకుం జలువ పుట్టింప నెట్టకేలకుం
దెలిసె, నంతఁ బ్రభాత సమయం బగుటయు నొక్క పువ్వుఁ
బోఁడి వరూధినితో నిట్లనియె.
52
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )