కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
సూర్యోదయ వర్ణనము
ఉ. పాటన సేయమిం గురులు పైఁబడి శీర్ణపటీరపంక లా
లాటికమై దరస్మిత విలాసపుఁజంద్రిక డొంకి వాడుటం
దేటఁ దొఱంగి విన్న నగు నీ మొగమో! యన మాసి చంద్రుఁడో
పాటలగంధి! వ్రాలె నదె భానురుచిం దన కందు మీఱఁగన్‌.
53
సీ. సకుటుంబముగ వీఁగి చరమశైలముఁ జేరు, తుహినాంశు దుముదారుదొర యనంగ
నాసీరమై వచ్చు నలినబాంధవు టెక్కి, యంబుపై దీపించు నద్ద మనఁగ
నరుణాగ్ర నిబిడ వాద్యములలోఁ గనుపట్టు, సమయశాంఖికుచేతి శంఖ మనఁగ
నినుఁ డప్పు డజుఁ డైట మునుమున్న పడివాగెఁ, గొనివచ్చు రాయంచ కొదమ యనఁగ
 
తే. నుదయగిరిమీఁదఁ గోవురంబుండి నిగుడు
నహిత రవిరశ్మిచే బద్ధుఁ డగుచుఁ దోడి
బలఁగ మైనట్టి చుక్కల వలసత్రోవఁ
జూప నేతెంచె నన వేగుఁ జుక్క వొడిచె.
54
మ. సకలాశాగతి నర్మకోపవిరతి శ్రౌతక్రియారంభణా
త్మక వర్గత్రయికిన్‌ మదుచ్చరిత శబ్దజ్ఞానమే మూల మిం
తకుఁ బోలన్‌ వినుఁడంచుఁ దెల్పుగతిఁ, జెంతం గొండపై పల్లెలం
గృకవాకుల్‌ మొరసెన్‌ గృహోపరిఁ ద్రిభంగిన్‌ భుగ్నకంఠధ్వనిన్‌.
55
మ. ఇనుఁ డస్తాద్రికిఁ బోవఁ గొల్లకొని నేఁ డేతేరఁ దద్దీప్తినం
జన సంబంధజ బాంధవంబున రతి శ్రాంతాంగనా నేత్రకో
ణనికాయంబుల డాఁచి తద్ధవళిమం దాఁ బూనెనో చొప్పు మా
ర్ప ననన్‌ వెల్వెలఁ బాఱె దీపకళికా వ్రాతంబు శాతోదరీ!
56
శా. వాలారుం గొనగోళ్ల నీ వలసతన్‌ వాయించుచో, నాటకున్‌
మేళంబైన విపంచి, నిన్న మొదలున్‌ నీ వంటమింజేసి యా
యాలాపంబె యవేళఁ బల్కెడుఁ, బ్రభాతాయాత వాతాహ తా
లోల త్తంత్రుల మేళవింపఁగదవే లోలాక్షి! దేశాక్షికిన్‌.
57
చ. పలుకులు నేర్పు వేళఁ గలభాషిణి! నీ విటు లుండఁ బంజరం
బుల నరగన్ను వెట్టి ముఖముల్‌ చరణాగ్ర నఖాళి గోఁకుచున్‌
నిలుగుచు నావులింపుచు వనీవిహగోత్కర మెట్లు పల్కు, న
ప్పలుకులె యఱ్ఱు లెత్తి విని పల్కెడు వింటివె? కీరశారికల్‌.
58
మ. ఉరుసంధ్యాతపశోణమృత్కలితమై యొప్పారు బ్రహ్మాండ మ
న్గరడిం గాలపుహొంతకాఁడు చరమాగస్కంధముం జేర్చు ని
బ్బరపున్‌ సంగడమో! యనన్‌ శశి డిగెం బ్రాగ్భూమిభృత్కైతవే
తరబాహాగ్రపుసంగడం బనఁగ, మార్తాండుండు దోఁచెన్‌ దివిన్‌.
59
చ. కరకరి గూఁటఁ గఱ్ఱ యిడఁగా మొఱవెట్టెడులీల బాల భా
స్కర కరకాండకందళ విఘట్టన నించుక వాయివిడ్డ తా
మర మొఱ వెట్టి వెట్టి పలుమాఱును వాకిలి దాఁటి యాఁగుచున్‌
మొరయ విపంచి మీటుగతి మ్రోసి యళుల్‌ వెడలెన్‌ గొలంకులన్‌.
60
చ. అడరు నవీన భానుకిరణానల మంటినఁ గూడుకొన్న పు
ప్పొడి కొలుచెల్ల మోచికొని పోయెడి సంభ్రమమొప్పఁ గంటివే?
పడఁతి! భవద్విహారవనపద్మసరః కుముదాలయంబులన్‌
వెడలు మిళిందబృందములు వీఁవు పిశంగిమ కైతవంబునన్‌.
61
చ. కొలకొలఁ గూయుఁ బై నొఱగుఁ గుత్తుకఁ గుత్తుకఁ జుట్టుఁ బాఱు చి
ల్వలక్రియఁ గానరానిగతులన్‌ మయి మైఁ బెనఁచున్‌ జనించు న
శ్రు లఱుత నొత్తు సోలు నిలుచున్‌ విధిచాతురిఁ గూడియున్‌ రతిం
దలఁవవు కంటె పాసిన వెతల్‌ దలఁపించుచుఁ గోక దంపతుల్‌.
62
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )