కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
వరూధినికి సఖుల సమాశ్వాసనము
ఉ. ఇందునిభాస్య! వాఁడనఁగ నింద్రుఁడొ? చంద్రుఁడొ? యా యుపేంద్రుఁడో?
యిందులకై వగం బొగుల నేటికి? నేఁటికి నందుఁ బోదమా
నందనభూమి భూమిసురనందనుఁ డుండకపోఁడు, రమ్ము నీ
చందము నందము గనిన జవ్వని! యెవ్వని వెఱ్ఱిఁ జేయదే?
63
ఉ. ఏల దురంతవేదన మెయిం బొరలాడెదు తాల్మి దక్కి? మే
లే లలితాంగి? యెంత పని లె మ్మిది, విప్రవరుండు గోలయున్‌
బాలుఁడు గాన నప్పటికిఁ బైఁ బడఁ గొంకెను గాని, వానికిన్‌
గా లొకచోట నిల్చునె వగన్‌ మగుడన్‌ నినుఁ జూచునంతకున్‌?
64
క. రార మ్మనుటయు, దివిష
న్నారీరత్నంబు నికట నాకనాధునీ క
ల్హారాంభోరుహ మధురస
ధారా చంద్రకిత సలిల ధౌతాననయై.
65
సీ. ఘనసార పంక మొక్క లతాంగి దెచ్చిన, ముట్టి వ్రేలనె చుక్క బొట్టు పెట్టి
యింతి యొక్కతె పూవు టెత్తు లెత్తినఁ జూచి, విసువుతో నొకకొన్ని విరులు దుఱిమి
పడఁతి యొక్కతె రత్నపాదుక లిడ నిల్చి, తొడుగ కవ్వలికిఁ బో నడుగు పెట్టి
బాగాలు వెస నొక్క పద్మాక్షి యొసఁగిన, వెగ్గలం బని కొన్ని వెడల నుమిసి
 
తే. సగము గొఱికిన యాకును, సఖులు పిలువ
సగ మొసఁగు నుత్తరముఁ, దెల్వి సగము, మఱపు
సగము నయి, చింతచే సగ మగుచు నరిగె
నవ్వరూధిని యంతికోద్యానమునకు.
66
వ. ఆ సమయంబున దేవజాతిత్వ జనిత విమలజ్ఞానపాటవంబునం
దద్వృత్తాంతంబు సమస్తంబు నెఱుంగుటంజేసి.
67
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )