కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
వరూధినీ కాముకుఁడైన గంధర్వుని మాయోపాయము
శా. ఏ గంధర్వుఁడు తద్విలాసములు మున్నీక్షించి తా నెంతయున్‌
రాగాంధుం డయి కోరి హత్తక గడున్‌ రారాపులం గంతుఁ డు
ద్వేగం బందఁగఁ జేయ నెవ్వగల నువ్విళ్లూరుచున్‌ వేఁగుఁవాఁ,
డా గంధర్వకుమారుఁ, డంగభవవిద్యాపారగుం డాత్మలోన్‌.
68
ఉ. ఒక్కొకవేళఁ బద్మముఖు లొల్లమి సేయుదు, రొక్కవేళఁ బె
న్మక్కువ నాదరింతురు, క్షణక్షణముల్‌ జవరాండ్రచిత్తముల్‌,
పక్కున వేసఱన్‌ జన, దుపాయములన్‌ దగు నిచ్చకంబులన్‌
జిక్కఁగఁజేసి డాసి, సతి చిత్తముఁ బట్టి సుఖింపఁగాఁ దగున్‌.
69
క. అని తలఁచి యవ్విలాసిని
యనిశముఁ గ్రీడించు పుష్పితారామంబున్‌
మును కలుగఁ జొచ్చి యొక చం
దనభూజము నీడ నిల్చి దంభం బమరన్‌.
70
సీ. అర్ధచంద్రునితేట నవఘళించు లలాట, పట్టిఁ దీర్చిన గంగమట్టితోడఁ
జెక్కుటద్దములందు జిగి వెల్లువలు చిందు, రమణీయ మణికుండలములతోడఁ
బసిఁడివ్రాఁత చెఱంగు మిసిమి దోఁపఁ జెలంగు, నరుణాంశు కోత్తరీయంబుతోడ
సరిలేని రాకట్టు జాళువా మొలకట్టు, బెడఁగారు నీర్కావి పింజెతోడ
 
గీ. ధవళధవళము లగు జన్నిదములతోడఁ
గాశికాముద్ర యిడిన యుంగరముతోడ
శాంతరస మొల్కు బ్రహ్మతేజంబుతోడఁ
బ్రవరుఁ డయ్యె వియచ్చర ప్రవరుఁ డపుడు.
71
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )