కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
వరూధిని సఖులతో నుద్యాన విహారము
క. ఇట నవ్వరూధినియు నొ
క్కొటఁ గతిపయసఖులు దన్నుఁగొలిచి నడువఁగాఁ
జటుల ఝళంఝళరవ పద
కటక సమాకృష్ట కేళి కలహంసిక యై.
72
సీ. ఉరగఫూత్కార ధూమోగ్ర గంధముఁ బాసి, పొలయుఁబో యీతావి మలయపవనుఁ
డనలాక్షు పెడబొబ్బ నలమిన తలదిమ్ముఁ, బాయుఁబో యీ తేంట్ల పాట మరుఁడు
ఘర్మ సామీప్య సంకలిత దాహస్ఫూర్తి, నీఁగుఁబో యీ చల్ల్‌ నీట మధుఁడు
గరళసౌదర్యాత్తకర సుధాకటుకత్వ, ముడుపుఁ బో యీ తేనె నోషధీశుఁ
 
తే. డనఁగఁ జంపక కురవక పనసతినిశ
నిచుల వంజుల దాడిమీ విచికిలామ్ర
పాటలీ పూగ కేసర ప్రముఖతరుల
సొబగు మీఱు నుద్యానంబుఁ జొచ్చి యచట.
73
మ. పవమాన ప్లవమాన పంకజ రజః పాళీ పిశంగచ్ఛవీ
భవ దభ్యర్ణ వికీర్ణకృత్రిమ సరిత్పాథస్తరంగాహతైం
దవపాషాణవితర్దికాతలమున\న్‌ నాళీకపత్త్రాక్షు లు
త్సవ మొప్ప\న్‌ విహరించుచు\న్‌ సరస వాచా ప్రౌఢిమల్‌ మీరఁగ\న్‌.
74
చ. బటువయి విఱ్ఱవీఁగి పరిపాటిగఁ బూచి పరాగపుంజ మొ
క్కొటఁ గలయంగఁ బర్వఁ గొనకొమ్మను గోయిల మించనొప్పెఁ జెం
గటి యెలమావి హారరుచి గందవొడిం గనుపట్టి నీలతా
స్ఫుటతర చూచుకం బగుచుఁ బొల్చు వనేందిరగుబ్బ చన్నన\న్‌.
75
తే. వెలఁది యిచ్చట సంపెంగ విరులు గహన
దేవతల యిండ్ల నెత్తిన దీపశిఖలు
గాక యుండినఁ బంచబంగాళ మగుచుఁ
బాఱునే మత్తమధుకర పటల తమము?
76
చ. అపరిమితానురాగ సుమనోఽలస యై చిగురాకుఁ జేతులం
దపసిని గౌఁగిలించె వనితా? యిదె రంభ; దలంప రంభ దా
నపరిమితానురాగసుమనోఽలస యై చిగురాకుఁ జేతులం
దపసిని గౌఁగిలించు టుచితంబె కదా! యన నవ్వె రంభయు\న్‌.
77
ఆ. కొమ్మ! కన్నుఁగవకుఁ గోరగింపఁగఁ బూచి
తఱుచు జొత్తు గ్రక్కు దాసనంబు
గవియు నీతమాల గహనాంధకార వి
తానమునకు నుదయభానుఁడయ్యె.
78
తే. శ్యామ లోపరి నిబిడపత్త్రాభ్రములకుఁ
గాండషండంబు దిగు వాన కాళ్ళు గాఁగఁ
బంకరుహనేత్ర! వర్షర్తు శంక నొసఁగు
పోఁకబోదియ నవకంబు మోకఁ గంటె?
79
ఉ. చూతమె డాసి పస్వతర శుక్తిపుటాంతర దృశ్య మౌక్తిక
వ్రాతములై వెలుంగు గరువంపుఁ గొటారుల నొప్పు తామ్రప
ర్ణీతటమట్లు జీర్ణదళబృంద సమావృత పాండుర ప్రసూ
నాతిమనోజ్ఞ మూలముల నర్థి నెసంగు మధూకసాలముల్‌.
80
క. పంకజముఖి! విరహులపయిఁ
గింక\న్‌ నిజసైన్యకోటికిని సెలవిడు మీ
నాంకుని కరతల మన నల
కంకేళిం జిగురు గాలిఁ గదలెడుఁ గంటే!
81
చ. నునుఁజిగురాకు మేయుతఱి నోరికెలంకులఁ దేఁటి గుట్టినన్‌
వనతరు శాఖలం గువకువధ్వనిఁ బాఱు పికాంగనం బికం
బనునయ మొప్పమాన్పు గతి నాత్మముఖంబు ముఖంబుఁ జేర్చి చుం
బన మొనరించె, సందుసుడిమాయలుగా మగవారికృత్యముల్‌.
82
క. అని పొగడుచు నొయ్యారపు
టనువున జడ లల్లి జిలుఁగు లగు పయ్యెదలం
జనుకట్లు గట్టి గట్టిగ
ననిమిషకాంతలు లతాంగ హరణోత్సుకలై.
83
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )