కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
జలక్రీడలు
క. నాళీక మధూన్మత్త మ
రాళీ ముఖరాళి సుఖకరం బగు కొలనం
గేళీలాలసగతి డిగి
యాళీనివహంబు లోల లాడెడు వేళన్‌.
85
ఉ. వాడిన మోముఁదమ్మి తెలివాలిక కన్నులు విన్నఁబోవఁ దో
నాడక నెన్నొసల్‌ కరమునం దిడి తీరనిషణ్ణ యై జలం
బాడఁగఁ బిల్చువారి నొక హస్తపు మ్రొక్కున నాడుఁ డంచుఁ దాఁ
జూడక చూచుచూడ్కి నలజోటి దెసల్‌ పరికింప నొక్కచోన్‌.
86
మాలిని. రవిరుచిఁ ద్రసరేణు వ్రాతముల్‌ మించు వాత్యా
నివహనిహతిలో నిందిందిరశ్రేణు లాడన్‌
గువలయ ఘనకుల్యాకూల వల్లీవనీ సం
భవము లగుచు మింటన్‌ బర్వు పుప్పొళ్ళలోనన్‌.
87
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )