కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
మాయా ప్రవర దర్శనము
సీ. పసిఁడితోరముతోడి బాహు వల్లన నెత్తి, సారెకుఁ బొదలపైఁ జాఁచి చాఁచి
బింబాధరంబు గంపింప నొయ్యన విపం, చీ స్వరంబున జట సెప్పి చెప్పి
దిశల మార్గాన్వేషి దీర్ఘలోచన దీప్తి, గణముచేఁ దోరణకట్టి కట్టి
కమనీయ తనుకాంతి కనకద్రవంబున, నారామరంగంబు నలికి యలికి
 
తే. యానితంబ విలంబి కాలాహికల్ప
ఘనకచగ్రంథి నచటిభృంగముల కసిత
దీధితులు వడ్డికొసఁగుచు దేవపూజ
విరులు చిదిమెడి కపటభూసురునిఁ గనియె.
88
ఉ. కాంచి కలక్వణ త్కనక కాంచికయై యెదు రేఁగి యప్పు డ
క్కాంచన కేతకీకుసుమగాత్రి వయస్యల డించి తన్నికుం
జాంచలవీథిఁ దాఱుచు ఘనాంత చల చ్చపలాకృతిం గలం
గాంచిన వస్తువుం దెలిసి గాంచిన యట్లనురక్తిఁ గాంచుచున్‌.
89
ఉ. ఆ కమలాక్షి యింపున దృగంచల మించుక మూసి హర్షబా
ష్పాకుల కోణ శోణ రుచు లగ్రమునం జనఁ జూచు చూపు తీ
రై కనుపట్టెఁ దమ్మరస మంటుకొన\న్‌ వెడవింటివాఁడు క్రో
ధైక ధురీణతం గఱచి యేసిన సింగిణి కోలయో! యన\న్‌.
90
సీ. తొలుదొల్త వానిఁ గన్నులఁ గాంచినప్పుడ, పల్లవాధరగుండె జల్లు మనియె
నట రెండు మూఁడంజ లరుగునప్పుడ కాళ్ళఁ, బంకజాక్షికిఁ దొట్రుపాటు గదిరె
డాయంగఁ జనునప్పుడ ముఖాంబుజంబునఁ, గంబుకంధరకు దైన్యంబు దోఁచెఁ
గదిసి నిల్చిన యప్డ కనుదోయి ఱెప్పల, లలనకు మిగులఁ జంచలత బెరసెఁ
 
తే. గటకటా! యనునపుడ గద్గదిక వొడమెఁ
జెఱఁగు వట్టినయపుడ లేఁజెమట గ్రమ్మె
సొలసి మాటాడ నుంకింపఁ దలఁచి మోముఁ
దేరగొనిఁ జూచునపుడ కన్నీరు వొడమె.
91
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )