కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
వరూధినీ కపట ప్రవర సంభాషణము
క. పాటిత కరిదంత ద్యుతి
పాటచ్చర గండఫలక భాగంబులపైఁ
గాటుక కన్నీ రొలుకఁగ
మాత వెడలఁ గ్రేటుకొనుచు మానిని పలికె\న్‌.
92
ఉ. ఏలర! యీ చలం బుడిగి యేలర! బాల రసాల మాలతీ
జాలములో శశాంక కరజాలములో వలవంత నశ్రువుల్‌
జాలుగ నాల్గుజాలు నిఁకఁజాలు భవం బమనంత కాఁకకు\న్‌
బా లయి రాత్రి పంచశరు బారికిఁ జిక్కితి, నీకు దక్కితి\న్‌.
93
శా. రా, వైరాగ్యముఁ బూని నీవు కడు నిర్దాక్షిణ్య చిత్తంబున\న్‌
రావై తేఁ జవి గాని యిందులకు హోరాహోరిగాఁ బోరి యే
లా వాలాయము సేయఁగా? బ్రదుకు నీ వాచారవంతుండవై
చావో యెక్కుడొ నీ యెడం బొడము వాంఛ\న్‌ భూసురగ్రామణీ!
94
క. కట్టిఁడితనమున కి ట్లొడి
గట్టి మనసు ఱాయి సేసి కరఁగవు మఱి నీ
పట్టినది విడువ విఁక ని
న్నిట్టట్టన నేల మా యదృష్టం బుండ\న్‌?
95
వ. అనిన నక్కుహనా భూసురుండు. 96
సీ. కొనసాఁగి కామినీ గోష్ఠిఁ బ్రౌఢములైన, యుదుటుఁజూపుల ఱెప్ప తుదల నాఁచి
సంతసంబున ముఖాబ్జమునందుఁ జిఱునవ్వు, కందళింపక యుండ డిందుపఱచి
పొంగారు మైఁ దోఁచు శృంగారచేష్టల, తమిఁ దెచ్చికోలు మౌగ్ధ్యమున డాఁచి
పొడము రసావేశమున వచ్చు నర్మోక్తు, లొదవి నాలుకకు రాకుండఁ గ్రుక్కి
 
తే. మస్తకము వాంచి యుసు రని మౌనముద్ర
నేల బొటవ్రేల వ్రాయుచు నిలిచి కొంత
సేపు వెడవెడ చింతించి శిర సొకింత
యెత్తి సన్నంపు టెలుఁగుతో నిట్టు లనియె.
97
శా. తల్లిం దండ్రియు నన్నుఁ గానని మనస్తాపంబునన్‌ బొక్కఁగా
నిల్లా లార్తిఁ గృశింపఁగా సవన వహ్నిశ్రేణి చల్లారఁగా
నిల్లు\న్‌ శూన్యత నొంది సొంపు చెడఁగా, నిచ్చోట నేఁ జిక్కి యో
ఫుల్లాంభోరుహనేత్ర! యే సుఖమతి\న్‌ భోగించెద\న్‌ఁ జెప్పవే!
98
ఉ. ఓ సరసీరుహాక్షి! వినవో రతిఁ గౌఁగిట నీవు చేర్చు నిం
పా సురభర్తకైనఁ గలదా? వలదంచుఁ బెనంగ నేను స
న్న్యాసినెఁ యొక్కటే తహతహ\న్‌ మన సొగ్గదు కేళిపై "ననా
శ్వాసిత దుఃఖితే మనసి సర్వ మసహ్య" మన న్నెఱుంగవే?
99
క. ఐనం గానిమ్ము భవ
ద్దీనతకై వ్రతము విడిచితిం, బరులకు మే
లైనం జాలు, శరీరం
బైన నుపేక్షింపవలయు, నది యట్లుండె\న్‌.
100
క. తివురక యిం కొక్కటి విను
కవయునెడ\న్‌ వలయుఁ గన్నుఁగవయును మూయ\న్‌
భువి నిది యస్మద్దేశ
వ్యవహారము; కన్ను దెఱువ నఘ మగుఁ దెఱవా!
101
శా. ఈ మర్యాదకు నీ వొడంబడిన మే లీ భంగి గాదేని
భూమింజేరఁగ నెట్లు నీ యొడలితోఁ బోవంగ లేనే కదా!
యీ మందాకిని పొంత నీ మునులతో నీ వృక్షవాటంబులో
భామా! యేఁ దపమాచరింతు విధి కబ్రహ్మణ్యమున్‌ బెట్టుచు\న్‌.
102
తే. ఇంక నొక్కటి వినుము పూర్ణేందువదన!
వ్రతము చెడ సౌఖ్యమైనను వలయుఁ గలుగ,
వాంఛితము దీర నను నీవు వదలఁ జెల్ల
దేను నిను సమ్మతిలఁ జేసి యేఁగు దనుక.
103
వ. ఇంత యేమిటి కంటేనిం జెప్పెద, నేను వైదేశికుండ, బంధుమిత్ర
కళత్రంబులం బాసి దైవయోగంబున నింత దూరం బేఁగుదెంచిన
వాఁడ, మీఁద భవదర్థంబు ప్రార్థితుండనై వ్రతహోమాద్యను
ష్ఠానంబులు విడువంగలవాఁడ నగుటం జేసి యంతరంగంబునఁ గల
తెఱంగు తేటపడం బలుకవలసె నాకర్ణింపుము.
104
ఉ. నీ చనుదోయి సంకుమద నిర్భరవాసన మేన నూన న
య్యో! చిరసౌఖ్యముల్‌ గనుట యొండెఁ, దపంబొనరించి పాపముల్‌
రాచుట యొండెఁగా, కిహపరంబుల కూరక దూరమై వయః
శ్రీ చన, రెంటికి\న్‌ జెడిన రేవఁడ నౌదునె? నీరజేక్షణా!
105
క. అని యాస గలుగఁ బలికిన
విని వేలుపు వెలఁది మోము వికసిల్లంగాఁ
దనచేతి చెఱఁగు బిగియం
బెనఁచుచుఁ దల వాంచి నగవు బెరయఁగఁ బలికె\న్‌.
106
శా. హా! నీ నిష్టురవృత్తి మాని కరుణైకాయత్తచిత్తంబునన్‌
మానం జాల నటంచు నేఁడు శ్రవణానందంబుగాఁ బల్కుటన్‌
సూనాస్త్రు\న్‌ వెలవెట్ట కేలితి సుఖార్ణోరాశిలోఁ గ్రుంకితిన్‌
నా నోముల్‌ ఫలియించె నా వయసు ధన్యంబయ్యె విప్రోత్తమా!
107
వ. నీ వెట్లు చెప్పి తట్లు సేయంగలదానినని యతనినొడంబఱుచు
సమయంబునఁ దోడి నెచ్చెలు లచ్చకోరాక్షిం గూడుకొని.
108
సీ. అకట! నిర్దయబుద్ధి వని దూఱెఁ గడు రంభ, యాహా! వివేకి వౌ దనియె హరిణి
చేఁదు మ్రింగెద వంచుఁ జికిలి నవ్వె ఘృతాచి, మాయలాఁడని తిట్టె మంజుఘోష
న్యాయనిష్ఠురములఁ బ్రార్థించె నూర్వశి, జంకించె ర మ్మంచుఁ జంద్రరేఖ
చెలి నేఁచి తని దిసంతులు కొట్టె మేనక, విడువు మాయ లటంచు నొడిమె హేమ
 
తే. గొంట వనియెఁ దిలోత్తమ, గూర్మిఁ గొసరె
ధాన్యమాలిని, పుంజికస్థల యదల్చె
దివిజకామిను లీరీతిఁ దిరుగువాఱి
గువ్వకోల్గొంచుఁ దమలోన నవ్వుకొంచు.
109
క. ఆ కుహనాభూసురుఁ డపు
డా కాంతల సరస సమ్మదాలాపముల\న్‌
గైకొనుచు ముదితహృదయుం
డై కేళీవనము వెడలి యరిగి కుఱఁగట\న్‌.
110
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )