| కావ్యములు | మను చరిత్రము | తృతీయాశ్వాసము |
| లతా గృహాంతర సమాగమము | ||
| సీ. |
మృగనాభినికరంపు బుగబుగల్ గలచోటఁ, జదలేటి తుంపురుల్ చెదరుచోట వకుళవాటీ గంధవహుఁడు పైకొనుచోటఁ, గర్పూరతరు ధూళి గప్పుచోటఁ బసమీఱు సెలయేఱు లిసుక వెట్టినచోటఁ, జిగురుమావుల సంజ నిగుడుచోట నవమాలికల తేనె నట్లుట్టి పడుచోట, మాణిక్యదీపముల్ మలయుచోటఁ |
|
| తే. |
బ్రమదమునఁ దేఁటు లెలుఁగెట్టి పాడుచోట శారిక లనంగశాస్త్రముల్ చదువుచోటఁ గీర కలకంఠములు క్రొవ్వి కేరుచోటఁ బావురము లారజంబులు పలుకుచోట. |
111 |
| తే. |
ఆ వరూధిని మణిమండితాలయంబుఁ గాంచి యనురాగమునఁ బ్రవేశించినంత వారి నిరువురఁ గూర్చి యవ్వనజగంధు లాత్మగృహముల కేఁగి రనంతరంబ. |
112 |
| క. |
ఫుల్ల లవలీనవైలా వల్లిమతల్లికలతోడ వాసంతిక లు ద్యల్లీల నల్లిబిల్లిగ నల్లికొనిన యొక లతాగృహాంతరసీమ\న్. |
113 |
| క. |
ఆ గంధర్వకుమారుఁడు నా గజగమనయుఁ బ్రఫుల్ల హల్లకతల్పా భోగంబున రహి మిగులఁగ భోగింపఁదొడంగి రాత్మఁ బొంగెడు కాంక్ష\న్. |
114 |
| వ. | ఆ సమయంబున, | 115 |
| సీ. |
సహసా నఖంపచ స్తన దత్త పరిరంభ, మామూల పరిచుంబితాధరోష్ఠ మతిశయప్రేమ కల్పిత దంత సంబాధ, మగణితగ్లాని శయ్యానిపాత మతివేల మణిత యాచ్ఞార్థ గల్లచపేట, మతిదీన వాక్సూచితాత్మవిరహ మంకుర త్పులక జాలావిద్ధ సర్వాంగ, మానంద కృతహారవాననాబ్జ |
|
| తే. |
మాక్రమక్షీణ నుతివర్ణ మానిమీలి తాక్ష మాస్విన్న గండ మాయత్త చేష్ట మాస్తిమిత భూషణారవ మావధూటి ప్రథమసురతంబు గంధర్వ పతిఁ గరంచె. |
116 |
| క. |
అన్నునఁ గనుమూయుట రొద సన్నగిల్లుటఁ గౌఁగిలింత సడలుట నేర్పుల్ సు న్నగుట వరూధిని రతి కన్నెఱికపు రతియుఁ బోలెఁ గడు నింపొసఁగె\న్. |
117 |