కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
గంధర్వుఁడు కల్లబొల్లి మాటలు సెప్పి చనుట
క. అంత వియచ్చరుఁ డభిమత
మంతయు సమకూఱుటయును, నచ్చర గర్భ
శ్రాంత యగుటయును, గనుఁగొని
యింతట నిచ్చోటు వాయ కేనిఁకనున్న\న్‌.
124
క. వంచన యెఱిఁగిన మఱి శపి
యించునొ సురకాంత, చెప్ప కేఁగినఁ బ్రేమం
బంచశర శరపరంపరఁ
బంచత ప్రాపించి మీఁదఁ బాపం బిడునో!
125
వ. అని వితర్కించి యక్కపటవిప్రుఁ డెఱింగించి యనిపించుకొనియ
పోవువాఁడై యప్పుడప్పువ్వుఁ బోఁడి డాయం బోయి బుజ్జనంబొప్ప నిట్లనియె.
126
తే. ఎవ్వఁడే బాదలేప మొక్కింత నాదు
పాదములఁ బూయ నింతేసి పనులు పుట్టె
నమ్మహాయోగి బహుయోజనాధ్వగామి
యీ గిరికి నేఁగుదెంచె నేఁ డేఁగి కంటి.
127
క. అతఁడు మఱి తీర్థయాత్రా
వ్రతవశమున వచ్చి మాపురంబు తెరువుగాఁ
గతలుగ మా సంసార
స్థితు లెల్లను జెప్పె, నేమి సెప్పుదు? నబలా!
128
సీ. పై పరామరిక చొప్పడమిఁ బక్వము దప్పి, పండఁబాఱిన పొల మెండఁబాఱెఁ
గట్టఁ గాపింప దక్షత లేమి నూరూర, బందెలఁ బడిపోయెఁ బశుగణంబు
వంచనామతిఁ బ్రాడ్వివాకులై వటువు లొ, జ్జల కొప్పగించిరి చదువు లెల్లఁ
గికురించి రిచ్చి పుచ్చుకొను చోటులవార, లాఁకకు లోనుగా కప్పు లీక
 
తే. గ్రహణ సంక్రమణాదుల రాచనగరఁ
గాసు వీసంబు వెడలమి గ్రాసమునకు
నాధి వెట్టిరి క్షేత్రంబు లందుఁ గొన్ని
లెస్స యుండునె గృహకర్త లేనిబ్రతుకు?
129
క. అది గా కేనిట వచ్చిన
యది మొదలుగఁ జింతచే నహర్నిశమును నా
కెదురెదురె చూచు చిద్దఱు
ముదుసళ్ళును బుత్త్ర మోహమున నగునార్తి\న్‌.
130
క. తడి కంట నెపుడుఁ దఱుఁగక
కడి దఱుఁగఁగ వడియుఁ దఱిఁగి గాసి\న్‌ బుడమిన్‌
బడిన గనరాక మంచపుఁ
దొడుగఱ లైరట్టె రుజలతో నే మందు\న్‌!
131
క. కావున వారలఁ జూడం
గా వేగమ చనఁగవలయుఁ గమలదళాక్షీ!
నీ వెఱుఁగని ధర్మాధ
ర్మావస్థితి గలదె? దీనికై యడలకుమీ!
132
క. వఁడి గాఁచి కాఁచి యుండం
గడవలనీ రినుము ద్రావు కైవడిఁ బైపైఁ
బొడమెడు కోర్కులచేఁ బె
ల్లుడికిన మది భోగముక్తి కూఱట గనునే?
133
ఉ. కావున నెన్నడు\న్‌ దెగని కాంక్ష నెపం బొకఁ డెన్ని రోసి నేఁ
బోవఁ దలంతు నేని వలపు\న్‌ ననుపు\న్‌ దగవు\న్‌ బ్రియంబును\న్‌
నీవలన\న్‌ సమగ్రములు నిల్చిన సంపెఁగ పువ్వుఁదేనె క్రొ
త్తావికిఁ దేఁటి చిక్కిన విధంబునఁ జిక్కనె? లోలలోచనా!
134
ఉ. ఎవ్వఁడు మీఁ దెఱుంగక యథేచ్చ సుఖైక రతిం జరింపఁగా
నవ్వల వంశహాని వ్రతహాని యశోధనహాని పుట్టుఁ దా
నవ్వెడఁ గమ్మనుష్యపశు వయ్యవివేకి చెడు\న్‌ జగంబున\న్‌
నవ్వఁగఁ బాలు రౌరవమునం బడఁ బాలును నిందపాలునై.
135
మ. అనినం జిత్తము జల్లన\న్‌ సొరుగు నయ్యంభోజపత్రాక్షిలో
చనగోళంబులఁ జిమ్మలై చిలుపలై జాలై తరంగంబులై
చనుదోయిం గొనబౌ కురంగమద చర్చల్‌ జాఱిపో నొక్క యొ
డ్డున బాష్పాంబుఝరంబు లుప్పతిలెఁ బోటుంబాటుగా నెంతయున్‌.
136
క. అత్తఱి గంధర్వవిభుం
డత్తామరసాక్షి వదన మక్కునఁ గృపతో
నొత్తి మొగమెత్తి యశ్రులు
మెత్తనఁ గొనగోరఁ బాఱ మీటుచుఁ బలికె\న్‌.
137
శా. ధీరస్వాంతవు వంత నీకుఁ దగునే? దివ్యాంగనల్‌ కోవిదల్‌
గారే? యోగవియోగముల్‌ సతములే? కర్తవ్యముల్‌ సేయరే?
పోరే రారె ప్రియంబు గల్గినజనుల్‌? పోరామి పోఁ బోవునే?
పో రాకుండఁగ నేమి కాళ్ళు దెగెనే? ఫుల్లాంబుజాతేక్షణా!
138
తే. మూలముట్టుగఁ దెల్పె నమ్మునివరుండు
ప్రార్థితుం డయి నాకు నప్పరమ విద్య
వచ్చుచును బోవు చుండెద వదల నిన్ను
శుకకలాలాప! నమ్ము ద్రిశుద్ధిగ నను.
139
గీ. అని వరూధిని నూరార్చి యచటు వాసి
పోయెఁ దనయిచ్చ గంధర్వ పుంగవుండు
తప్పరాదు ఋణానుబంధంబు తెగినఁ
బ్రాణపదమైన వలపును బాసి చనదె!
140
వ. అనుటయు\న్‌ దరువాతి వృత్తాంతంబు గృపాయత్తం బగుచిత్తం
బున నానతీయ వలయు నని యడుగుటయును.
141
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )