కావ్యములు మను చరిత్రము తృతీయాశ్వాసము
ఆశ్వాసాంత పద్య గద్యములు
శా. హిందూరాజ్య రమాధురంధర భుజాహిగ్రామణీ కంచుక
త్కుందస్వహ్ఛ యశోగుళుచ్ఛ! యవన క్షోణీధవ స్థాపనా
మందీభూత కృపాకటాక్ష! యసకృన్మాద్యత్కళింగాంగనా
బందీగ్రాహ విగాహితోతరక కుబ్ధాటీ సమాటీకనా!
142
క. తిరుమల దేవీ చరణో
దరలాక్షాకల్ప కల్పిత స్థల కమల
స్ఫుర దిందీవర బంధుర
హరిహయమణి మలయకూట హర్మ్యవిహారీ!
143
ఉత్సాహ
(సుగంధి).
వర్ణనీయకీర్తివైభవా! ప్రభూతభూతిదృ
క్కర్ణకుండలా! వితీర్ణి కర్ణ! దీర్ణహృద్భ్రమ
ద్దుర్ణయారిమానహారి దుర్భరానకార్భటీ
ఘూర్ణమాన కొండపల్లి కొండవీడుమండలా!
144
గద్యము. ఇది శ్రీమదాంధ్ర కవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష
పాదాంబుజాధీన మానసేందిందిర నందవర పురవంశోత్తంస శఠకోప
తాపస ప్రసాదాసాదితచతుర్విధ కవితామతల్లి కాల్లసాని చొక్కయా
మాత్యపుత్త్ర పెద్దనార్య ప్రణీతం బైన స్వారోచిష మను సంభవం బను
మహా ప్రబంధంబునందుఁ తృతీయాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - tR^itIyAshvAsamu ( telugu andhra )