కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
ఎఱుకు ఱేని మొఱ
ఆ. ఒక్క యెఱుకుఱేఁడు నక్కకొమ్మును నిఱ్ఱి
గోఱజంబు జున్నుఁ జాఱపప్పు
బీలిగఱుల యంపకోలలు సెలవిండ్లుఁ
గానుకిచ్చి కరయుగంబు మొగిచి.
14
వ. యుగ విగమ సమయ సముద్భూత జీమూత పటలంబునుం
బోలెఁ గైలాసగిరినితంబ ప్రాంత కాంతారపర్యంతంబు నిరంతరంబై
కాఱుకొన్న యొక్క గహనరేఖం గరాంగుళిం జూపి
భూపతి కి ట్లనియె.
15
క. అల్లదె కంటే? పొనపొన
దెల్లని గట్టఱుత మబ్బుతేఱెడి పొలమం
దెల్లెడఁ జూచిన ధరణీ
వల్లభ! సీరాముసేన వాలుమెకంబుల్‌.
16
సీ. కండూతికై రాయుఁ గర్కశం బగుతుంటిఁ, బీఁటవెట్టిన మ్రాను పెల్లగిల్లఁ
జెవి దార్చి విను చీమ చిటుకన్న నొకసారి, సెలవి వెంపరలాడుఁ జిట్టలెల్లఁ
జప్పరించు వెదుళ్ళు సట లుబ్బ దంష్ట్రాంగ్ని, చొంగపైఁ బడి చుంయి చుంయి మనఁగఁ
జండ్రనిప్పులువోలెఁ దీండ్రించు కనుమించు, లెసఁగ నొండొంటిపై నెక్కఁబాఱు
 
తే. వెట్టదినముల మడుఁగుల మట్టి కలఁప
బుడబుడధ్వనివెడలు బుద్బుదములందుఁ
జిలుపచిలుపని నేతుల జిడ్డు దేఱు
నేమి చెప్పుదుఁ? గ్రొవ్విన యేకలములు.
17
చ. బల మిఁక నేమి చెప్ప? విను పండువెదుళ్ళవలీల మోరత్రో
పులఁ బడఁ జొప్ప వంచుకొమ పోలిక వంచి తదగ్రధాన్యముల్‌
సెలవుల ఫేన ముట్టిపడ జిట్టలతోడనె చప్పరించు న
ప్పొలము వరాహపోతములు భూవర! తొండము లేని యేనుఁగుల్‌.
18
క. పొడిచిన కైదువునకుఁ జము
రిడఁగా వల దగ్గికాఁక యించుక యిడిన\న్‌
జెడుగఱ్ఱల గ్రుచ్చిన నం
జుడు మంటలఁ దగిలి నెయ్యి జొటజొట వడియు\న్‌.
19
తే. వలదు కుక్కల విడువంగ వలవ దేయ,
నడచి మొలపిడియమ్మునఁ బొడువవచ్చుఁ
బంకము గొరిజ దిగఁబడఁ బఱవలేవు
మన్ను లివ్వేళ రేగటి మన్నులందు.
20
క. పొడ చెదరి బోద చఱచిన
యొడళ్ళతో నాల్గు రెండు నొకటియుఁ బ్రంగల్‌
వెడలిన కొమ్ముల బరువున
నడుగిడఁగా లేవు బలిసి యందలి దుప్పుల్‌.
21
ఆ. చలము లొదవ ముళ్ళు గల మ్రాఁకుదీములఁ
గెరలి తాఁకి కొమ్ము లురులఁ దగిలి
వాని లేవ నీడ్చి కానకే కొనిపోవుఁ
బోతరించి యిఱ్ఱిపోతు లచట.
22
ఆ. కప్పువెట్టి వెన్ను కందమ్ము సమముగాఁ
బొదలి జోళ్ళు గట్టి పోరుచుండి
మలయుఁ గాని పోవు మానిసిఁ బొడగన్న
నేమి చెప్ప? వాని యీసు లధిప!
23
క. కట్టియఁ జేకొని డేగం
బట్టి యుబుసుపోకఁ బొలము మట్టినఁ జాలు\న్‌
దొట్టిన క్రొవ్వులు గలయవి
చె ట్టడిచినఁ జేటెఁ డేమి చెప్ప\న్‌ బులుఁగుల్‌?
24
తే. ఉడుము గరిమిడికొక్కు దందడియు వెల్ల
యెలుక కల్లెల్క తఱుచును నేమి చెప్ప?
నడవి నెల్లెడఁ జూచిన నవనినాథ!
జల్లెడయుఁ బోలె లాఁగల నుల్లసిల్లు.
25
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )