కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
స్వరోచి మృగయా విహారము
క. అనుటయు మృగయాకౌతుక
మునఁ జిత్తము చెంగలింప భూధర శృంగం
బుననుండి డిగ్గి నగరికి
ననిమిషకాంతాకుమారుఁ డరిగి రయమునన్‌.
26
వ. నగరు సొచ్చి యచ్చటం గక్ష్యాంతరశాలాంతరాళంబుల నందంద
తండతండంబులై వ్రేలునత్తెంబులం జము రంటు పలల ఖండంబుల
మండితంబు లగు నిడుద వెదురుదండెంబుల బర్హి బర్హ
నిబద్ధాగ్రంబులై కొమరారు దోరెపుఁద్రాళ్ళతోడం దిరుగుడుల
వెడంగుపడి వడిదప్పునట్లు త్రాళ్ళం గట్టువడి పొట్ట లదరంగ
నిక్కి పరిసెనంబుల వేయునవియును, నపహసితశార్దూలకుటిల
నఖ కోటి పాటవంబులగు త్రోటిపుటంబులం జటకసరటాదిజంతు
కళేబరంబులం జరణనఖరాంకురంబుల నిఱికి చీరుచుం గేరునవి
యును, నాఁడునాఁటికిం బాటించి వేఁటకాం డ్రదనెఱింగి మేపు
మేపుల చమత్కారంబుల నిరాకరించి వీఁకునం దిరిగి తిరిగి
యీఁక దీర్చుకొనునవియును, బద నగ్గలించి కూయుచుం గడుపు
నకనకంబడం గనుకట్టుతోడ మోములు మలంచుచుం బంజరస్థిత
కీర శారికా పారావతాదుల పలుకు లాకర్ణించి యెగసి యెగసి
నిజావస్థితతాదృగ్విధాధార వేణుయష్టులకుఁ జట్టుపలు చెదరం
బ్రదక్షిణభ్రమణంబులఁ బరిభ్రమించి మగుడ నెట్టకేలకు మట్టు
కొనునవియును, మేర మీఱం దిన్నయెరల నన్నుకొని యరగన్ను
వెట్టి బోరకడం బొటమరింపం గూరుకుచుం గుతికిలంబడునవి
యును నై పరఁగు పలుదెఱంగుల డేగమొత్తంబులను, గుత్తంబు
లగుమిగులమెత్తని జలపోఁతతోలు పట్టెడలు మెడల నమరం
బనుపార్చి కట్టుఁగంబంబులకుం దార్చి బంధించిన కుందనంపు
గొలుసులు గల్లు గల్లు మనంగ నొడళ్లు జాడించికొనుచుం గొన
సాగి సోగలై ముంగిసమోరలుంబోని మోరలు సారెసారెకు
నెత్తి బయలు పసివట్టుచుఁ గట్టెదుటి వాజిశాలలం గట్టిన
పొట్టేళ్ళకై యాదిగొని నీల్గి కాలుద్రవ్వి ఘనఘనాఘన ఘర్ఘర
ధ్వాన సమ ధ్వనులు చెలంగ మ్రోఁగుచు నింగిఁ బ్రాఁకుచు నింగలంబు
లుమియు నయనగోళంబుల నాభీలంబులై వివృతవదన
గహ్వర విలంబి జిహ్వాపల్లవంబులకుం గ్రూరతర దంతకోణ
కాంతికలాపంబులం గోరక స్తబక యోగంబు గల్పించుచు నల్పే
తరగ్రస్త కీలాలపలలజాలగ్రాసంబులు నెన్నడుము సన్నఁదనంబున
నట మిగుల డిగ్గి చన కునికిం గటితటంబులకంటెం దారె పుట
పుట నయ్యె ననం దోరంబు లగుబోరలఁ గందంబుల నందం
బులు గని బిరుదు లంకించి తమ్ము నుపలాలించు పరిపాలకుల
సంస్తవంబులకుం జెవిదార్చె ననం గర్ణకిసలయంబులు వ్రాలం
బడి వెండి గుండులుంబోలెఁ గన్నులపండువులై గండభైరవ
పూజవారువంబు లన మెండుకొనియుండు జాగిలంబులను
గాంచి యందునందును వేఁటకు నుఱవైనవాని నేర్పఱించి తెచ్చు
టకు ననుచరుల నీవు నీ వని నియమించి తానును నాఖేటకోచిత
పరిపాటి సన్నద్ధుం డయ్యె, నయ్యవసరంబున.
27
సీ. పచ్చని హురుమంజి పనివాగె పక్కెర, పారసిపల్లంబు పట్టమయము
రాణ నొప్పారు పైఠాణంబు సింగిణి, తళుకు లకోరీల తరకసంబు
మహి పసిండి పరుంజు మొహదా కెలంకున, ఠావు గుజ్జరిసేఁత కేవడంబు
డాకెలంకున సిరాజీకరాచురకత్తి, కుఱఁగటఁ గ్రొవ్వాఁడి గొరకల పొది
 
తే. పీలికుంచె తలాటంబుఁ బేరజంబు
మణుల మొగముట్టు వన్ని సాహిణి యొకండు
కర్త యెదుటికిఁ గొనివచ్చె గంధవాహ
బాంధవంబగు నొక మహా సైంధవంబు.
28
క. తెచ్చుటయు నిచ్చ మెచ్చి మ
రుచ్చటుల కురంగ రయ నిరోధి స్యద గ
ర్వోచ్చం బగు నత్తేజి సు
హృచ్చక్రం బలర వేగ నెక్కి వెడలిన\న్‌.
29
చ. జడలు మలంచి చొళ్ళెముగ సన్నపుఁ బాగ లడంగఁ జుట్టి చ
ల్లడములు పూని మీఁదఁ బదిలంబుగఁ గట్టిన మట్టికాసెలం
బిడియము లంట దోపి పృథు భీషణబాహుల సాళువంబుల
న్దడవి కెరల్చుచుం జనిరి నాథునిమ్రోల నృపాలనందనుల్‌.
30
సీ. ఇవి కంఠపాశంబు లింత డుస్సిన మీఁదఁ, బడి దిశాకరినైన గెడపఁ జాలు
నివి మింటఁ బఱచు పక్షీంద్రుఁ జూపిన నీడ, బడి వాలునందాఁకఁ బఱవఁ జాలు
నివి గాలి గనిన మూకవరాహదనుజేంద్రు, నైన జుట్టెంటిలో నాఁగఁ జాలు
నివి కాటు కొల్పిన వృద్ధకూర్మమువీఁపుఁ, జిప్పైన నెఱచికై చింపఁ జాలు
 
తే. ననఁగ ఘర్ఘర గళగర్త జనిత భూరి
భూభృదురుబిల భరిత భౌభౌ భయంక
రార్భటీ దీర్ణ దిగ్భిత్తు లగుచుఁ జెలఁగె
సరిపెణలఁ బట్టి తెచ్చిన జాగిలములు.
31
చ. పులియఁడు బూచిగాఁ డసురపోతులరా జనుమంతిగాఁడు చెం
గలువ సివంగి భైరవుఁడు గత్తెర సంపఁగి వెండిగుండు మ
ల్లెలగుది వాయువేగి చిటిలింగఁడు సాళ్వఁడు వత్సనాభి యే
కలములమిత్తి గబ్బి యనఁగా గలవాని గ్రహించి యుద్ధతి\న్‌.
32
ఉ. కట్టిన నీలిదిండ్లు సెలకట్టియవిండ్లును విండ్లగౌసెనల్‌
చుట్టి నొసళ్ళపై నిడిన జుంజుఱుఁబల్లసిగల్‌ కటీతటిం
బెట్టిన మోటకత్తులును మేనులఁ గార్కొనుకప్పు లేర్చి చేఁ
బట్టిన వేఁటయమ్ములును బాగగు వాగురికుల్‌ మహాధ్వని\న్‌.
33
సీ. సట లెత్తుకొని యొత్తు కిటినైన మోటాస, పడి యేయఁ బొడుతు నీ పాద మాన
కలగుండు వడఁ జెండు కరినైనఁ జెవిపట్టి, బలిమిమైఁ దెత్తు నీ పాద మాన
సెల నెప్పుకొని రొప్పు పులినైనఁ బీడించి, పడవైతుఁ జొచ్చి నీ పాద మాన
తెరఁదూఱి వెఱఁబాఱు గురుపోతుపై నైనఁ, బడియెక్కి పొడుతు నీ పాద మాన
 
తే. యితర దుర్బల మృగపంక్తు లేమి లెక్క?
కండగరువంపు మాటలు గావు సుమ్ము
చూడు మ మ్మని పంతంబు లాడుకొనుచు
నవ్వరూధినిసుతుఁ గొల్చు యరిగి రపుడు.
34
ఆ. మువ్వ గదల నత్తెములనుండి యెగురుచుఁ
బదను మీఱ నెరల వెదకు డేగ
పదువు వట్టి దండపాణులై నడచిరి
విభునిగెడల డేగ వేఁటకాండ్రు.
35
ఆ. గూనివీఁపు లదర గొణఁగి తిట్టుచు నేకుఁ
గఱచినట్టి కుక్క గండ్లనంగ
మూతి నరపమీసముల బోయ ముదుసళ్లు
పంది వలలు మోచి పఱచి రపుడు.
36
వ. ఇట్లరిగి యమ్మహారణ్యంబు సొచ్చి విచ్చలవిడి నచ్చటం బచ్చిక
బయళ్ళ మచ్చిక లచ్చుపడం దటిచ్చటులం బగు లోచన ప్రభా
పటలంబు దిక్తటంబులం బర్వఁ దాఱుమాఱుపడ నిడికొనిన
మొగంబులతో నేణీజిహ్వాపల్లవోల్లిహ్యమానాంగంబు లగు
సారంగంబుల ఖురళికారంగంబు లనం గనుపట్టు చెలికపట్టు
లును, బిట్టెసంగు నాఁకటం దట్టువడి పొట్టకై పుట్ట కూటికిం
జీమలకుం జెదలునకు నెలుంగులు గులగులం బుట్టలు నిశిత నిజ
నఖర కులిశ కోటులం గోరాడ నాదండలఁ గాచుకొని యుండి వెడలి
చను విషవిస్ఫురద్భుజంగంబుల నల్గడం గబళించి గెంటకుండ దంటు
చప్పరించు గతిం జప్పరించుచు నొండొంటికిం బేరెంబులు వాఱి
కుప్పించి తప్పించుకొను దుప్పుల ఖురజ రజశ్ఛటల నెసక మెసంగు
మసకమసకల మఱుంగుపడియుండు గండోపలంబులును, బరిహసిత
సితేతర పాషాణపాటవంబు లగు విషాణపరిఘంబు లొండొంటిం
దాఁకి కఠిల్లు పెఠిల్లు మనం బోరు కారుపోతుల కోలాహలంబులం
బ్రతిశబ్దంబు లీను కోనలును, మదమొదవ నెదపదనునం బొదలు
పెట్టలకుం జుట్టంబులై చిల్లర సలుగులం బిల్లలం జుల్లరంబుల
సాగనిచ్చి గమికి వెనుకయై మలయుచుం బిఱుందం దిరుగు చిఱు
గున్నలకు వెన్నాడు తోడేళ్ళ సివంగులం దిరిగి తిరిగి మొత్తి
పోనొత్తి చరియించి నేకచరంబుల ఘుర్ఘురధ్వానంబుల ఘూర్ణ
మానంబు లగు పరిగె పక్కె పలుమేరు రేఁగు వేము పులుగుడు
గురివెంద యీఁదు గేదంగి మోదు గౌరు కోరింద కనుము కానుగు
మొదలగు పొదలం బొడు వగు నానా విపిన పాదప కలాపంబు
లును, మాటిమాటికి మానిసికాటు మరగి తెరువులు గాచికాచి డగ్గుత్తిక
పడం దిను పెద్ద పొలవలనం బుటపుటనై త్రుప్పుళ్లు డుల్లి
త్రుళ్లి గంతులిడు గబ్బి బెబ్బులుల నలఁగుడుల దొడ్లజనంబులు
మంత్రించి పొరక దిగిచిన నీరు మే పుడిగి గిరులు గ్రక్కదల
వాపోవుచుం దిరిగి తిరిగి వాకట్టు విడిచినప్పుడు దప్పికై పాఱి
సెలయేటిటెంకులం బాఱమ్ములు ఱొమ్ము కెలంకులంగాఁడ గాండ్రు
గాండ్రు మని రొప్పి నొప్పి కుప్పరంబుగా వియత్తలంబునకు
విల్లెత్తుపొడ వెగసి నెత్తురులు గ్రక్కుచుఁ గూలు క్రోల్పులుల
ఘర్ఘరధ్వనుల గుండియ లవిసి కలగుండు వడు కారండవంబుల
పక్షపుట పటాత్కారంబుల బోరుకలంగు సెలయేటి టెంకులును,
మేఁతవెంబడిం బొలము పల్లంబులం దిరిగి తిరిగి పెంట్రికలు
వెట్టు పెంటపట్టునకు వచ్చి యచ్చట గ్రుచ్చి కానరాకుండ
మునుమున్న మృగయుండు బిసయొడ్డి సంఘటించిన కాలి
బోనులం బడి బెగడక యద్దారు వీడ్చుకొని యీరములఁ దఱి
యంబడి యవ్వలికై వెడలి చనలేక గెడసి తన్నుకొను మన్ను
మెకంబుల యాక్రందనంబులం గ్రందుకొను విషమ ప్రదేశంబులును,
జిఱుత గండ్లగమిచేత దైవికంబున డాప్రక్క మీఁదు
వడ దాఁటువడి యవి గొంతుక్రొన్నెత్తురులె క్రోలి విడిచి చన
మార్మెడలు వడి మశకవనదంశమ్ములు మూఁగ మాఁగంబాఱిన
కొండగొఱియ ముఱుగుడు బొందులకు సందడించు కంకగృధ్రా
వళుల మొల్లంబుల ముసుంగువడు పల్లంబులును, మేయుతఱి వీఁ
పెక్కి ఱేఁ చొకటి మూఁపురంబు గఱచి కరచి యెఱచి పడ
వైవం దోడి యొక రెండు మూఁడు వెనుకముందఱ నందంద
కాళ్ళం బెనంగుచు నత్తునుక లేచి యేఱి తినఁ గాలెడలిన యెడ
మండుతద్వేదనకుం గాక మట్ట లెత్తుకొని యొత్తుగల పొదరుటడవులు
చొఱంబాఱు పిడికడితి కదుపు నురవడికి విఱిగి పడిన
విటపి విటపంబులం దడుకు వొడిచినగతి నొందు నెడలును,
బదులుపదులు నూఱులు నూఱులు వేలువేలు గుములుగట్టి దట్టం
బగు నెయ్యంబున వెదురుబియ్యంబు లొండొంటి కొసంగఁ గరి
వరకరేణువులు వంప ముంపుచెడి యిట్టట్టువడి తిట్టలగు జిట్టల
సంకటంబు లగు డొంకల నీక్షించి హర్షించి, యెక్కుడుఁ దమి
నొక్కయెడ నడుగు వెడలనిటెంకిఁ గని వాఱుగవులునకు
మెకము దిగ దని యెన్ని; మన్ను దూర్పెత్తించి గాలి పరికించి
దిగువ దెస దొడ్డివల పన్ని యెగువ పొలిమేర బారాది యగు
దూరం బేఁగఁ బోఁగువాఱించి యత్త్రాట వల మోవం దెర లెత్తి
యెత్తిన నత్తెరఁ దుత్తుమురుగాఁ జించుకొని పాఱినం బోనీక
బారిసమరుటకు వలచుట్టునుం జెట్టు దండగొని నిలువ నలువుగల
పుళిందులఁ గొందఱ నిలిపి, యమ్మంది పిఱుంద జాగిలంబుల
తోడ వాగురికుల నిలువ నియమించి తెరకు లోనగువాని నందుఁ
బడంగొట్టించియు గట్టువెంట దట్టంబుగాఁ బ్రజ నెక్కించి మఱి
కలయ గహనతలంబున నెల్లం బెల్లుగా విల్లువేఁటకు నేటుదప్పని
మేటివిలుకాండ్ర మృగములు వెలువడుటకు హరిచ్ఛదచ్ఛటా
వృతశిరఃకటిధనుష్కోటులై కొట్టికానిం జూపెట్టుకొని యెదురు
మాటులు గాకుండ నుండి చెదరి పొరదెరువులం బఱవకుండ
నీరముల సందుసందులం దమతమకట్టిన మోటకత్తుల నొండొండ
ఖండితంబు లగు మండగల కంపమండలు ద్రోచి మునుములం
గనుమ లొనరించుకొనం బంచి, తాను నొక్కొక్కయెడఁ బాద
చారియు, నొక్కొక్కయెడఁ దురగాధిరూఢుండును నై యెల్లెడల
మెలంగుచుం గూఁత లెగయఁ బణవ మృదంగ దుందుభి ప్రముఖ
తూర్యంబులు గొట్టించియు గాహళులు పట్టించియు నగ్నియంత్రములు
ముట్టించియు రొద మిన్ను ముట్టం జోపు వెట్టించిన.
37
మ. చకితై ణాహుతిదాన మావళితపుచ్ఛ స్వల్ప గచ్ఛత్తర
క్షుక మద్రిగ్రహయాళుభల్లుకము వక్షోభాగ నిక్షిప్త డిం
భక వల్గత్‌ప్లవగీకదంబము హ్రదాంభః ప్రోత్థిత క్రోడనా
యక మాభీల ముఖద్విపిస్థపుటితం బయ్యె\న్‌ వనం బత్తఱి\న్‌.
38
క. నెల వెడలియు నెఱి సడలియుఁ
జల ముడిగియు నిదుర సెడియు జంట లెడసియు\న్‌
గలహము లడఁగియుఁ బఱచెం
బులి కిరి కరి మన్ను దున్న మొదలగు మెకముల్‌.
39
ఉ. అత్తఱి వేఁపికాండ్రు యమునాంబుతరంగ పరంపరాకృతి\న్‌
ముత్తర మైన సూకరసముత్కరముం గని మోటుకాండ్రు వి
ల్లెత్తకమున్న రాజుమది కెక్కెడునట్లుగ దీని మిత్తికిం
బుత్త మతంచుఁ బట్టెడలు బోరన డుయ్య భయంకరార్భటి\న్‌.
40
క. జాగిలములు మొఱసడములుఁ
జాగెఁ గలసి చాపముక్త శరగతి, నం దా
జాగిలము లెదిరెఁ బందుల
కై, గోథాదికము గాలి కడరె నితరముల్‌.
41
సీ. ఎగుచుకూఁతలు ముట్టె యెత్తి బి ట్టాలించి, గమికిఁ గన్నాకయి గాలి యరయు
వడిఁ గుక్క లంటంగ వచ్చిన మెడ ద్రిప్పి, ఘుర్ఘురించుచు బయల్‌ కొమ్ముఁ జిమ్ముఁ
దారసించిన చోట దారునఁ జొరఁ బాఱి, యొకటి రెంటిని దొబ్బ లురల నడుచుఁ
బాలచేరులు వట్టి తూలింప బలిమి నీ, డ్చుకొని డొంకలఁ దూఱి చుట్లఁ బెట్టు
 
తే. నీఁటె పోటులఁ బడి ప్రేవు లీఁదులాడఁ
బోయి పోలేక దగ దొట్టి పొదలు సొచ్చి
బెండువడియును జొఱనీదు పీఁటవెట్టి
చూపులనె యేర్చుఁ బ్రజ నొక్క సూకరంబు.
42
క. అట్టియెడ నొక వరాహము
బిట్టడిచిన మెఱసెఁ గుక్క ప్రేవులు దంష్ట్రం
జుట్టుకొని రొంపిఁ గలఁపఁగ
నిట్టలముగఁ దగిలినట్టి యెఱ్ఱలు వోలె\న్‌.
43
మ. హరిణం బొక్కటి కుక్కతండముఁ బుళిందానీకముం ద్రోచి యు
ర్వర్‌ అఁ గా లూఁదక దాఁట నేటలవికి\న్‌ వాహంబు నడ్డంబు నూఁ
కి రసావల్లభుఁ డేసె భల్లమును నింగిం గాళ్ళు జోడించుచో
గొరిజల్‌ నాలుఁగుఁ ద్రెవ్వ సేన వొగడెం గోదండ పాండిత్యమున్‌.
44
క. పఱచు నొక కడితిఁ బతి ముకుఁ
జెఱమలకై యేయఁ జిప్ప చినుఁగఁగ నది యు
క్కఱఁ గాఁడి డుస్సి పాఱిన
నఱిముఱిఁ జాపరువు వాఱి యల్లటు వడియె\న్‌.
45
మ. గవిలో బెబ్బులి డాఁగి గ్రుడ్లు మెఱమంగాఁ గాంచి రా జేసె నే
య వడి\న్‌ బాణము వెంటనే నిగిడి పైక ట్లేచి రా నేసె రెం
డవకాండబుఁ దదస్త్రముం గొనక డాయ\న్‌ వచ్చి కౌక్షేయక
ప్రవిభిన్నం బయి నేలఁ గూలెఁ బవిధారాభిన్న శైలాకృతి\న్‌.
46
తే. క్రొవ్వి నడగొండ కైవడి గునుకు నొక్క
యొంటిగాని మహీనాథుఁ డొదిఁగి యేయ
గొరక మే నుచ్చి ధరఁ గాఁడ శిరము విసరె
లే దసృక్పాన మనుచుఁ దెల్పెడు ననంగ.
47
తే. ఒక్కఁ డడుగెత్తి గొఱక వేయుచును డాఁచి
న ట్టరిగి టెంకిఁ గని వీఁకఁ బట్టుటయును
మృగయు లందఱుఁ జని వెల్వరించి నిశిత
కాండములఁ జెండి రొక పెద్ద కారుపోతు.
48
ఉ. ఆ సమయంబునం జకితమై మెక మెవ్వని మీఁదఁ బాఱె వాఁ
డేసినయమ్ము వమ్మయి మహిం బడ కొక్కటి కొండ చాలి వీ
తాసులఁ జేయ మెచ్చి వసుధాధిపముఖ్యుఁడు మోట్ల నున్న బా
ణాసనభృత్పుళిందులకు నర్థి నొసంగె నభీప్సితార్థముల్‌ఁ.
49
క. వలఁ బాఱినవానిని భటు
లలుఁగుల పాలాడి, రధిపు కై పట్టిరి బె
బ్బులి మహిష మెలుఁగు కిటి దోఁ
డెలు మొదలగువానిఁ గొన్నిటిని వేఁటకరుల్‌.
50
తే. మున్ను జాగిలములఁ గూడి చన్నయట్టి
యుడుపకుక్కలు కుందేళ్ళ నుందురువుల
నుడుముల గ్రహింపఁ బుట్టల కడలఁ బొదల
గిరుల చరియలఁ బసివట్టి తిరుగుచోట.
51
చ. బరవస మొప్పఁ గాలితడఁబాటు మెయిం గవిఁదూఱి యొక్కకు
ర్కురము తమంబులో వెరఁజి కోఱలచేఁ గబళించి పొట్టపెం
జెర నుడు మంచుఁ దెచ్చి కని చేవ దొఱంగక ద్రుంచివైచెఁ ద
ద్గురుబిరుద ప్రమాదములకుం బతి మోదవిషాదశాలి గా\న్‌.
52
క. ఒడ లుబ్బ నిక్కి ముందఱి
యడుగులు ధర నూఁది చిందు నలబలములకు\న్‌
జడియ కొక గబ్బిగం డె
క్కుడుఁగడిమిం దివిచెఁ గ్రుంగి కొమ్ములయుడుము\న్‌.
53
తే. కంపతొడు గీడ్చిన ట్లేఁదు గానఁ జన్న
తెరు వెఱుంగుచు నొకఁ డేఁగి పరువుతోన
పడి యడఁగి యుండఁగాఁ బటపటన ముండ్లు
గాలిఁ గదలుట గని పంట్రకోలఁ బొడిచె.
54
వ. అత్తఱిం దత్తఱంబున మొత్తంబయి చోపుడుఁగోలలు గొని
కెలంకుల పొలంబులం బులుఁగులం జోపుచు డేగవేఁటకాండ్రు
వేఱుపడి వేఁటాడం దొడంగి రందు.
55
ఉ. లీలఁ బుళిందుఁ డొక్కఁడు కళిందసుతోర్మి సరోజినీదళాం
దోళిత కోకరేఖఁ దనతోరపు నల్లని దీర్ఘ బాహుపై
హాలహలంబపోలె విడి యత్తెమునం దల యెత్తి చూచు బల్‌
సాళువము\న్‌ వడిం జను శశంబుపయి\న్‌ విడిచె\న్‌ మహోద్ధతి\న్‌.
56
క. మొలదట్టిచెఱఁగుఁ జెక్కుచు
బలుదిట్ట కిరాతుఁ డొకఁడు పటు వగుముష్టి\న్‌
సెలకట్టెఁ బట్టి వేఱొక
సెలకట్టెం గొట్టి వైచెఁ జెమరుంగాకి\న్‌.
57
సీ. పెనుదవ్వు దగ దొట్టఁ జని రెట్ట వడఁ గొట్టె, నుడువీథి బెళగువ్వ నొక్క యణుజు
ఱెక్కతాఁకున స్రుక్క నిక్కి ప్రక్కలు నొక్కె, నుఱక కల్లేటి నొక్కోరణంబు
పొదఁ దూఱు నొకమేటి పూరేటి వెలికిఁ బోఁ, దోలి కైకొనె నొక్క తోఁచిగాఁడు
తను నేలుదొర చిత్తమున మెచ్చఁ దీతువుఁ, జని పట్టె బి ట్టొక్క జాలెడేగ
 
తే. విజ్జువిజ్జునఁ దన్నంగ విడువ కెలమిఁ
గఱకుటంఘ్రుల నిఱికించి గజ్జె గదలఁ
గఱికి నెఱినెఱి కోలెమ్ముకయును విఱుగ
విఱిచె వడిఁ గైజు నొక పెద్ద వేసడంబు.
58
క. నింగికయి కుంచెయెత్తి వె
సం గో! యని యార్వఁ బక్ష సంహతిగాడ్పుల్‌
ఱింగని మ్రోయఁ గుజాగ్రపుఁ
గొంగల నొక లగుడు డిగ్గి కొట్టె నిలఁబడ\న్‌.
59
వ. ఇ ట్లాఖేటఖేలనంబున వివిధ మృగ విహగ వధం బాచరించి
చాలించి, యంచెలంచెలం బంచతాపతిత చమర సృమర కిరి
హరిణ రురు మహిష వృషదంశక గోధికా శశ పిశిత ఖండంబు
లొండొండ యువ్వెత్తుగా నాకుఁబొత్తరలం గట్టియు గుదులు
గుట్టియుఁ జిక్కంబుల నించియుఁ గావడుల నుంచియు సవరించి,
దిగదిగన విసరి బగబగన మండు చిదుఁగు సొదమంటల కడ్డంబు
వట్టి, మీసంబులు సూఁడిచూఁడి వాఁడులగు కత్తులం దిత్తులొలిచి
కుత్తుకలు గోసి శితముఖంబులగు నఖంబులం బెకలించి విపుల
వపు రపహసిత మహాశైలంబు లగు శార్దూలంబుల బొందుల
నందంద పడవైచి, యంతంతఁ గాంతారంబున దంతురంబుగాఁ
బడిన దంతావళంబుల దంతంబులు గైకొనియుఁ దత్కుంభ
నిర్గత మౌక్తికంబు లేఱికొనియు, గోఱజంబుం జమరవాలంబుల
బర్హిబర్హంబులం బరిగ్రహించియు మరలి, యత్తఱిఁ గడింది
నెత్తురుం బ్రొద్దగుట వెఱచఱవం జఱవ నేఁదు పెనుముండ్లఁ
బండ్ల సరియలు నెఱియలువాఱి బోరనం గాఱు ధారాళ రుధిరా
సారపూరంబు నాకి నాకి నాలుకలు దిగవైచి యేచిన మహాతపోష్ణంబునం
దృష్ణ వొడమి దగ నిగుడ వగ రడరి యొడలం దొడలను
మెడలను బెడిదంపు నిడుదకోఱల సలుగు లడిచినయెడలం
బొడబొడను వెడలెడు నుడుకునెత్తుట\న్‌ బడలి తూలుకౌలేయ
కమ్ముల యంగమ్ము లార్ద్రకర్పటంబులం గప్పి, దప్పి నిగుడ
నప్పొలంబు పశ్చిమపు దండ నుండు వెండికొండ బండలఁ
జండకర కర హిండనంబునం బాండుప్రభలు నిండి పఱచు
తఱచు సెలయేఱుల సూరెలంగాఱుకొను భూరుహ నికాయంబుల
డాయం జని తద్ఘనచ్ఛాయల నిలిచి, యచ్చటంగ్రొచ్చి గరువు
నేలల గుంట లొనరించి లోన నుమ్మగిలి గబ్బు వలవక కమ్మ
తావులు గల నావురాకులు పఱచి యెఱచిలో మే లేఱి కారిజముం
గందనకాయ క్రొవ్వు మొదలగు మిగుల మెత్తని పలలభిత్తంబు
లందుఁ గ్రందుకొనం గ్రుక్కి, యెక్కువ తక్కువలు గాకుండఁ
గండ గలతింత్రిణీ శలాటు సంఘాతంబు లామీఁద నెఱయం
బచరించి, యెసరుగాఁ దేట లగు వేఁడినల్లలు గుమ్మరించి, లవణ
కణ సంచయంబు నించి, లావుగాఁ గావు గప్పి, యుపరి ప్రదేశంబులఁ
గారెనుపపెంటపట్ల నీరాఱు నేఱుఁ బిడుకల దాళ్ళిడి,
నెల్లికొయ్యలు ద్రచ్చి నుచ్చు లంటించినం బెచ్చుపెరుఁగు చిచ్చులా
త్రంపులం దవిలించి, చిముడ నుడికిన వెలువరించి, యుప్పు
వెప్పునుం గల యప్పిశితఖండంబులు గనగనని నిప్పులం జమురు
చిప్పిలం గాల్చిన కమ్మకఱకుట్లం జట్రాతిపయిఁ గాట్రేనికిం
గుడుపువెట్టి, పిదపఁ బాళ్ళవెంబడిం బంచుకొని తారు నుపయోగించి,
తద్దేవతా ప్రీతికై తలలుఁ దోఁకలు డొక్కలు నచటి విటపి
విటపంబుల వ్రేలం గట్టి, శిశిర మధుర సలిలమ్ములు ద్రావి
వాగురికులు విశ్రమింప, నిలింపాంగనాసుతుండును సహ సమాగత
చతుర వలల కృత పలల ఫల మూలాది శుచిమధుర మృగయోచితా
హారంబులం దృప్తి వహించి పరిజనారచిత పల్లవాసనా
సీనుండై గండూషితపుండరీక మధు రసాసారంబు లగు నిర్ఝరా
నిలకిశోరంబు లొలయ నలయికలు దేఱియున్న సమయంబున.
60
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )