| కావ్యములు | మను చరిత్రము | చతుర్థాశ్వాసము |
| విపన్నయగు మనోరమకు స్వరోచి యభయ మొసఁగుట | ||
| వ. |
ప్రాణరక్షాసంశయంబగు మహారణక్షోభం బొక్కటి గలుగు, మీఁద నెట్టకేలకు మితి వెట్టరాని జయ మంగళంబు లగునని యంతరంగంబున నిశ్చయించి యూఱడిలు సమయంబున. |
65 |
| క. |
ఆ విపినాంతరమున హా! హా! వనిత ననాథ నబల నార్త విపన్నం గావరె! యీ పుణ్యమునం బోవరె! యని పలుకు నాఁడు మొఱ వినఁబడియె\న్. |
66 |
| క. |
ఆమొఱ వేమఱుఁ జెవి నిడి భూమండలభర్త కరుణ పొడమఁగ నయ్యో! యేమానిని కెవ్వనిచే నే మాయెనొ? యనుచు నచటు నీక్షించుతఱి\న్. |
67 |
| శా. |
మట్టెల్ మ్రోయఁగ, గబ్బిచన్నుఁగవ కంపం బంద, వేణీభరం బట్టిట్టై కటిఁ జిమ్మచీఁకటులు గా, నశ్రువ్రజం బోడిక ల్గట్టం జూపులు చిమ్మరేఁగి దివి రోలంబాళిఁ గల్పింపఁగా మిట్టాడంగ నరుండు లేనియడవి\న్ మీనాక్షి దీనాకృతి\న్. |
68 |
| క. |
ఒక్కతె భయశోకంబుల వెక్కుచు మెయిఁగల విలాస విభ్రమలక్ష్ముల్ దక్కుటయును నొక యొఱపై నెక్కొన ధరణీశునెదుట నిలిచి వినీతి\న్. |
69 |
| క. |
పలుచని వాతెఱ మెఱుఁగునఁ బలు మెఱుఁగులు సందడింపఁ బాపటపై నం జలిఁ జేర్చి జళుకుఁజూపులఁ బలుకులఁ బులకండ మొలుకఁ బలికెం గలఁక\న్. |
70 |
| శా. |
ఓ రాజన్యమహేంద్ర! యో మణిగణ ప్రోతాసివాతాశన ప్రారజ్యత్కటిచక్ర! యో ముఖరశార్ఙ్గ క్రూరబాహార్గళా! యో రుక్మాచలకల్ప! యో కవచిత వ్యూఢాంగ! కావంగదే యో రాహుత్తశిరోమణీ! నిరవధి ప్రోద్యత్ప్రతాపారణీ! |
71 |
| క. |
అనినఁ దలంపున నింపిన యనుకంప నిలింప చంపకామోదసుతుం డనునయ మొప్పఁగ నోడకు మని నిజవృత్తాంత మడుగ నది యిట్లనియె\న్. |
72 |