కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
మనోరమా - విభావసీ - కళావతులకు జీర్ణముని శాపము
సీ. విసుమానములు గాఁగ వసతోడఁ బెనవెట్టి, నెట్టెంబుగాఁ బ్రేవుఁ జుట్టినాఁడు
బండికందెన చాయ బైసిమాలిన మేన, మెదడు గందపు రొంపి మెత్తినాఁడు
కునఖంపు డాచేతి పునుకకప్పెర నిండఁ, బ్రాణికోటుల నల్లఁ బట్టినాఁడు
కొకిబికి వేసంబు గూని మూఁపులమీఁద, మూఁడు పంగల యీఁటె మోపినాఁడు
 
తే. నిట్టతా డనఁ బొడవుచే నిక్కినాఁడు
నిడుదకోఱల మిడిగ్రుడ్ల నెగడినాఁడు
నరవరోత్తమ! నేఁడు మూన్నాళ్ళనుండి
యుసుఱు గొన వెంటఁ దిరిగెడు నసుర యొకఁడు.
73
క. ఏయెడ ననదలమొఱ వా
లాయము వినవలయు దుర్బలస్య బలం రా
జా యన వినవే? ధరణీ
నాయకులకు నార్తరక్షణంబులె క్రతువుల్‌.
74
క. మరుదశ్వపుత్త్రి కిందీ
వరాక్ష గంధర్వరాజువలనఁ బొడమితి\న్‌
నరవర! వెలసితిఁ గళలం
దు రమించుటఁ జేసి భువి మనోరమ యనఁగ\న్‌.
75
శా. రారాపిళ్ళ భుజాంగదంబుల మణుల్‌ రాలంగ విద్యాధరుల్‌
గారా మొప్పఁగ నెత్తికొండ్రు నను, నంకస్థాయినిం జేయఁగా
వారి\న్‌ వీడ్కొని సింహపీఠిక\న్‌ జలత్వం బొందు మాతండ్రి మం
జీరం బించుక ఘల్లు మన్న, నవి దాఁ జెప్పంగ నిం కేటికి\న్‌?
76
తే. దేవ! పారర్షి పట్టి కళావతియును
నల్ల మందార విద్యాధరాత్మజన్మ
యగు విభావసియును నాకుఁ బ్రాణసఖులు
వారు నేనును నొకనాఁడు గారవమున.
77
సీ. నెత్తమ్ము లేకొండ నెత్తమ్ములం దాడు, విద్యాధరీకోటి విటులతోడ
నెచటిగాడ్పులఁ బుట్టు విచికిలామోదంబు, శబర కాంతల గుట్టు సళ్ళఁబెట్టు
నెన్నగేంద్రపుఁ జఱుల్‌ మిన్నంది పెన్నంది, కోరాడుఁ దనగుబ్బకొమ్ములొడ్డి
యెం దుండు గురివెంద పందిళ్ళ పూఁదేనె, జడి యిందుశిలలందు జాలువాఱు
 
తే. నట్టి కలధౌతశిఖరిఁ బుష్పాపచయము
సేయువేడుకఁ బొదరిండ్ల చాయలందుఁ
దిరుగుచుండి యొకానొక దెసఁ దృణంబు
దళముగా వాత మొలచిన బిలమునందు.
78
ఉ. ఊసరవెల్లి చందమున నొక్కట బీఱనరాలు దేఱఁగా
మీసలు గడ్డముం జడలు మే నుదరంబును వీనులు\న్‌ జరా
ధూసరమైన రోమతతితోఁ బెనఁగంబడి దూది రాశిగాఁ
జేసినరీతి నున్న యొక జీర్ణమునిం గని కౌతుకంబున\న్‌.
79
ఆ. ఇతని వదన కుహర మెద్ది? నేత్రద్వయం
బెద్ది? కర్ణయుగళ మెద్ది? యనుచు
బూచివోలె నున్న వాచంయముని మోము
బాల్య చాపలమునఁ బట్టుటయును.
80
క. ధ్యాన స్తిమితుం డగు న
మ్మౌని మదీయాంగుళీ విమర్శనములచే
మే నెఱిఁగి తొంటి యనుసం
ధానము చెడి కన్ను దెఱచి దారుణ ఫణితి\న్‌.
81
ఉ. ఓసి దురాత్మురాల! గృహ మొల్లక సర్వసుఖంబులు\న్‌ నిరా
యాసమునం దొఱంగి మిహిరాంశు మరుచ్ఛద నీర నీరస
గ్రాసము దేహధారకముగా గుహలం దప మాచరించు మ
మ్మీసరణి\న్‌ స్పృశించి నగ నేమి ఫలం బొనఁగూడెఁ జెప్పుమా?
82
క. తిమిరంపు వయసు గుబ్బల
కొమరాలవు, నీకుఁ దగిన గోవాళ్ళ మహిన్‌
నెమకి నగరాదె? ముదిసిన
మముఁ జెనకిన నేమి కలదు? మద మేమిటికి\న్‌?
83
క. ముసురుకొను జరభరంబున
నసురుసు రై యున్న మమ్ము నడకించితి వి
ట్లుసురు మనఁ బట్టువడు మొక
యసురకు నీ వనుచుఁ బలికె నాగ్రహ మెసఁగన్‌.
84
క. జననాథ! యేమి చెప్పుదుఁ?
గనలుచు నవ్వగ్గు తపసి కటము లదరఁగాఁ
దనచేతి నాగబెత్తముఁ
గొని పసరముఁ గొట్టినట్టు గొట్టె నదయుఁడై.
85
క. కొట్టువడి యటకు మునుపే
తిట్టుం బడి యేడ్చు నాదు దెసఁ గని మదిలోఁ
గట్టలుక వొడమి నాసఖు
లి ట్టనిరి మునీంద్రుతోడ నెత్తిన పెలుచన్‌.
86
ఉ. ఓయి దయావిహీనమతి! యూరక యీ పసిబిడ్డఁ గొట్టఁగాఁ
జేయెటు లాడె? నీకు నిది చేసిన దేమి? వృథా శపింతురే?
బోయవె? యాఁడుఁదోడునను బుట్టవె? శాపనిమిత్తమే తపం?
బీయెడ నున్న శాంతిపరులేమనువా రిఁక నీ చరిత్రకున్‌?
87
క. పాము కడు ముదిసి కడపట
గా మగుచందమున వార్ధకంబునఁ గ్రోధం
బేమియు మానక మండెడు
నా ముని మునియే? తలంప నదియుం దపమే?
88
క. పరుల యపరాధగతులకుఁ
గెరలక తనుఁ బొగడుచోటఁ గీ డాడెడుచోఁ
బరితోషము రోషము నెదఁ
జొరనీని తపస్వి సుమ్ము సుకృతి ధరిత్రి\న్‌.
89
తే. ఒండొకఁడవైన నిపుడ నీ పిండి యిడమె?
బ్రాహ్మణుఁడ వౌట మాచేత బ్రదుకు గంటి
తడవఁ బనిలేదు నిన్ను గౌతముని గోవ
వనుచు వాదించి విడిచిన నాగ్రహించి.
90
క. ముసలి శపియించె నపు డ
య్యసితాబ్జేక్షణల రాజయక్ష్మ క్షోభం
బెసఁగ నశియింప నగు న
ద్దెసఁ బాఱుఁడు సుగుడి గామి తెల్లమియ కదా!
91
క. ఆ రుజ యప్పుడ యయ్యం
భోరుహ లోచనలఁ బొందె భూవర! నన్ను\న్‌
వారత్రయముననుండియు
దారుణగతి నొక్కయసుర తఱిమెడు వెంట\న్‌.
92
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )