కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
రక్కసునితో స్వరోచి ఘోరసమరము
మహా
స్రగ్ధర.
గళగర్తక్రోడ నిర్యత్కహకహ నినదోద్గాఢ హాసంబు భూభృ
ద్బిలముల్‌ మ్రోయింపఁ గాదంబినిగతిని బొగల్‌వెంప మిన్నెల్లమైగాఁ
జలితాస్య క్రూరదంత క్షత రదవసన క్షార కీలాల వేల్ల
జ్జ్వలన జ్వాలాభ జిహ్వాంచలుఁ డగుచు గదన్‌ జాళెముల్‌ ద్రిప్పుకొంచున్‌.
95
ఉ. దానవుఁ డద్ధరారమణుఁ దాఁకె నుదగ్ర పదాగ్ర ఘట్టన
గ్లాని సపాటమై యచటి కాన ఘరట్ట విఘట్టితాకృతిం
బూని చెడన్‌ గిరీశ గళ మూల హలాహల కాలకాంతితో
మేనఱికంబు లాడు తన మేటి త్రిశూలముఁ బూని యుద్ధతిన్‌.
96
తే. నింగి నొరయు రాకాసి మన్నీని మేని
నీడఁ జీఁకటిగొనె నవనీతలంబు,
చంద్రికలు గాంచె నట్టహాసముల వెడలు
నిశితదంష్ట్రలచే నవనీతలంబు.
97
పంచ
చామరము.
పలాశి డాసి రాజుఁ జూచి పల్కె నోరి! నోరి కీ
పొలానఁ బెన్పొలాన లేకపోవ నీవు దోఁచి తౌ
బలా! బలాలితోడఁ బాలఁ బట్టి బిట్టు చుట్టి నిన్‌
హళాహళిన్‌ హలాహలాభ యౌ బుభుక్షఁ దీర్చెదన్‌.
98
మహా
స్రగ్ధర.
అని బాహాస్ఫోట రావాహత పతగకులం బవ్వనీశాఖి శాఖా
జనిత వ్యాకీర్ణ జీర్ణ చ్ఛదముల కరణిం జల్లన\న్‌ రాల భూషా
ర్చి నుదీర్ణాలాత చక్రాకృతిగ జిఱజిఱ\న్‌ ద్రిప్పి వైచెన్‌ గద\న్‌ వై
చినఁ దేజి\న్‌ రాజు గెంటించెఁ దొలఁగ నది యచ్చెంత కాంతార మేర్చె\న్‌.
99
పృథ్వి. గదాహతికి నాత్మఁ గొంకక యెదిర్చి రాఁగా ని దౌఁ
గదా యనుచుఁ ద్రిప్పి రాక్షసుఁడు వైచె గాఢ భ్రమీ
నద త్కనక కింకిణీ నటన జాగ్ర దుగ్రార్భటీ
వదావద మహాగుహా వలభియైన శూలంబును\న్‌.
100
శా. ఆ శూలం బవనీశమౌళి కులిశాహంకార హుంకారి కృ
న్నైశిత్యం బభినుత్య మై నెగడు బాణశ్రేణిఁ జెండాడి వే
కాశ శ్వేత గరుత్పరంపరల నాకాశంబు దుగ్ధాబ్ధి సం
కాశం బై వెలుఁగ\న్‌ శరావళులచేఁ గప్పెం గకుప్పంక్తుల\న్‌.
101
క. అవి యాతని పై తోలును
నవియింపఁగ లేక మిడిసి యల్లటు వడఁ జూ
చి వనేచరు లేచిన వెఱఁ
దవిలిన మతి నద్దిరయ్య దయ్యం బనుచు\న్‌.
102
సీ. పక్కుపక్కున నంఘ్రి పాశముల్‌ వెసఁ ద్రెంచి, డేగ తండముల మింటికిని విడిచి
గళగళ ధ్వనులతోఁ గంఠశృంఖల లూడ్చి, సుడివడఁ గుక్కల నడవిఁ గలిపి
గుప్పు గుప్పున మోచికొనియున్న వలలతోఁ, బలలంపుఁ బొత్తరల్‌ పాఱవైచి
కంగుకంగున నేలఁ గై దప్పుగాఁ బడు, వేఁటమ్ము లేఱక దాఁటిదాఁటి
 
తే. తిరిగి చూచుచు దట్లెగఁదీసికొనుచు
దగలు దొట్టి యథాయథ లగుచు విఱిగి
యొకఁడు వోయినత్రోవ వే ఱొకఁడు వోక
చెట్టొకఁడు గాఁగఁ బఱచిరి చెంచు లపుడు.
103
క. ప్రోవుఁ దలపోసి నిలువక
పాపాత్మకమై కిరాత బల మటు పాఱ\న్‌
భూపతి యయ్యింతి హయ
స్థాపితఁగాఁ జేసి పలికెఁ దన్ముఖ్యులకు\న్‌.
104
ఉ. కైదువు సున్న, పూజ్యములు కంకటఖేట శిరస్స్థలత్రముల్‌
లే దరదంబు, తత్తడి హుళక్కి, సహాయము సర్వమంగళం
బీ దనుజుండు చిక్కె, భయమేటికి? లుబ్ధకులార! యాత్మకుం
బీదతనంబు మేలె? మఱి మృత్యువు డాఁగెడిచోట లేదొకో?
105
ఆ. నీడఁ గడవఁ బాఱ నేలకు వెలి గాఁగ
నడుగు వెట్టి తిరుగ నాత్మ మొఱఁగి
యొకటిఁ దలఁప నరుల కొదవిన నొదవ దే
కరణి మృత్యుదేవిఁ గన్నుఁబ్రామ.
106
క. చావుఁ దలపోసి మానవుఁ
డేవగ దుష్కీర్తి వొరయకే దినములు పొం
దై వెడలునట్లు నడవఁగఁ
దైవం బటమీఁద మేలు తాన ఘటించు\న్‌.
107
సీ. బుద్ధీంద్రియ క్షోభములకుఁ బెట్టని కోట, విపదంబురాశి దుర్వికృతి కోడ
ఖల దురాలాప మార్గణ వజ్రకవచంబు, రణ మహీస్థలికి శ్రీరామ రక్ష
శాత్రవ దుర్గర్వ సంస్తంభ నౌషధి, మొనయు చింతాశ్రేణి మూఁకవిప్పు
యోగాదిసంసిద్ధు లొనఁగూర్చు పెన్నిధి, తూలు నేకాకుల తోడునీడ
 
తే. సకల సుగుణ ప్రధానంబు సకల కార్య
జాల సాఫల్యకరణైక సాధనంబు
ధైర్యగుణ, మట్టి ధైర్యంబు దక్కి పోరఁ
దత్తఱింతురె! యకట! మీ తరమువారు?
108
క. అని తెలిపి తిరుగుఁ డనుటయు
మనమున లజ్జించి యెఱుకు మన్నీ లిఁక నీ
జనపతితోడిద లోకం
బని తమతమ మొనలు ద్రిప్పి రవియును దిరిగెన్‌.
109
వ. ఇట్లు తిరిగి యుక్కెక్కి రక్కసుండెక్క డెక్కడ నని
యక్కౌట బలంబు లగుడంబులుఁ గటారు లీఁటెలుఁ బందీఁటెలు
విండ్లు గండ్రగొడ్డండ్లుఁ జిల్లకోలలుఁ బంట్రకోలలు మెఱయ రయ
సముద్ధూత ధూళి ధూసరిత ధారాధర పథంబగుచు నొక్కపరియ
చీమపరి యనం గవిసె నందు.
110
మ. శరసంధానముతోనె కొన్ని యడుగుల్‌ జౌజవ్వనన్‌ బాఱి య
ద్ధరణిం గాల్కొని ద్రోణముల్‌ దివియు దోర్దండంబులం జేఁది యే
సిరి బోయల్‌ దిను మంచు నార్చి పరఁగం జిట్టాసలన్‌ డాయుచున్‌
గొరవంకల్‌ మొఱవెట్టినట్లు గుణముల్‌ ఘోషింప రోషింపుచున్‌.
111
తే. ఆ శరావళి నమ్మనుజాశనుండు
లీల మృగదంశకము మశకాళి నొడిసి
చప్పరించు విధంబున శాతదీర్ఘ
దంష్ట్రికలఁ జప్పరించి రౌద్రమునఁ గెరలి.
112
సీ. గళితశృంఖల మైన గంధనాగమువోలెఁ, బ్రజలపైఁ బేరెముల్‌ వాఱి పాఱి
కలశాబ్ధి మథియించు కైటభాంతకులీల, జవ మొప్పఁ జేతులు సాఁచిచాఁచి
కన లూను కీనాశ కాసరమ్మునుబోలెఁ, గమిచి తట్టువగుంపుఁ జమరి చమరి
యమృతాపహరణార్థ మరుగు పక్షిస్వామి, గతిఁ బుళిందశ్రేణిఁ గమిచి కమిచి
 
తే. సెలవులు బిగించి నేత్రదంష్ట్రికలు మెఱయ
నిడుదమొగ మెత్తి మీసల నెత్తు రొలుకఁ
బటబటఁ గపాలపంక్తులఁ బగులఁ గొఱికి
బలమునెల్లను గడియలోపలన మ్రింగె.
113
క. ఆ సమయంబున గీర్వా
ణీసుతుఁడ య్యింతినొక్క నికట నికుంజా
వాసమ్మున నిడి క్రమ్మఱి
వే సురరిపుఁ దాఁకెఁ దురగ వేగము మెఱయన్‌.
114
వ. ఇట్లు తలపడి యమ్మనుజ దనుజులు బీరంబులు దోరంబులుగాఁ
బోరుతఱి భూరమణుండు క్రుద్ధుండై సమిద్ధరణి బద్ధపరంపర యగు
నంపఱం బెంపఱం జంపరాదు నిలింపారాతినని వితర్కించి, కించిత్తును
గొంచక కాంచనద్రవకంచుకితంబును దరణి ఖరకిరణ
కాండచండంబును నయి యాఖండల దోర్దండ సముజ్జృంభిత వజ్రాయుధ
చకచకం బకబక నవ్వు వజ్రభేదియలుంగు వెలుంగ మత్తారులకు
నుత్తలంబిడు నత్తలంబును బద్మరాగమణిచూడంబగు కేడెంబునుంగొని
వేడెంబునం దురంగంబుఁ బఱపితెఱపి గని తఱటుచేసి
యొరసిచన నుఱికించి కఱకుటరిబరిఁ బఱియవడం బొడిచి
కడచి నిలిచినం, బెలుచనం బరిగోలపోటున నాటోపించు మత్త
కరివృత్తి నెత్తు రొలుక నక్తంచరుం డుదంచితగతి సవ్యదిశ
కొత్తి తఱుమ నపసవ్యగతిన్‌ జాళెంబున హయంబుఁ బోని
చ్చుచు నచ్చరకొడుకు తిరిగితిరిగి సింగిణి నేయుచుం జుట్టుకొనిరా,
మనుజాశియు నిట్లట్ల వెనుక వెనుక కడుగిడుచు నడ్డంబుగా నడవి
కడ కొత్తికొని నడచి యొడుదొడు కగుడు బెడిదంపు నడక
నడరి కడకాళ్ళ కొడియం జిక్కె రక్కసునకుం దుక్ఖారంబను నాలోన
నడిదంబునం బుడమిపతి పెడవిసరు విసరి యసురవరు కరాం
గుళంబులు దెగనడిచె, నడిచిన సుడివడక మడమలం దాటించిన
ఘోటకంబు వెగ్గలంబుగ మ్రొగ్గియు నగ్గలిక చెడక మోఁకరించు
కొని కొన్ని యడుగులు సని సేకరించుకొని కంచుమించుగం
బఱచుట గగనచరుల వెఱఁగువఱిచె, నట్లు పఱచినం గందంబుఁ
జఱచి మొగంబు దుడిచి ప్రస్తుతులఁ గుస్తరించి యతిరభస
ఫూత్కార ఘోరారావంబుతో ఘోణారంధ్రనిశ్శ్వాస గంధవాహ
ప్రవాహంబు వెడలు వాహంబు దగ మట్టువడ నిట్టట్టు మట్టించుచు
నాస్వరోచి నిశాచరు నుద్యోగంబు చూచికొనవలసి నిలిచి,
యంతన యతం డొక్క తరువుఁ గరయుగళి నిఱియంబట్టి పెల్లగింప
మల్లాడు నాలోనన గల్లునం గింకిణులు మొరయ మెఱుంగు
మెఱసినగతి మరల హరిం బఱపియొకటి రెండు మూఁడు
గొరకల నెఱఁకులు గాఁగ గుబ్బకొలందికిం దిగవైచి మ్రాను
విడిపించి యెలయించుకొని బయలువెడలించి, దోషాచరుండు
పాషాణమ్ముల కెపుడెపుడు వంగె నపుడపు డెల్లం దురంగంబు
నటం దోలి గంటి యిడి వెంటంబడుటయు గెంటించి లేదు
బంతి యన్నయ ట్లల్లంత నుండ వాగె సడలించి పగతుపై నిగిడి
వాగెఁ గుదియింప ముంగాళ్లు గగనంబున రా మగిడించి యందె
చప్పుడుం గింకిణీ రవంబును నురుమ గీసినగతిం దేఁటి మ్రోసిన
క్రియ నాదాఱక యే దిక్కుఁ జూచిన నాదిక్కుననే వినంబడ నెక్కడఁ
జూచిన\న్‌ దానయై, నీడ యేర్పడక పార్శ్వంబులం గట్టుకెంబట్టు
లాలసరి సమకట్టు ఱెక్కలుగా యాతుధానుం డనుకొండచిలువ
నొడియ నేలపఱపుగా నాడు గరుడుం డనం బాయుచు డాయుచు,
దవ్వులం బొలసి కుఱంగటఁ దోఁచి, కుఱంగట నని చూడ దవ్వులం
బొరసి, దవ్వు చేరువ లనిర్ధార్యంబులుగా మెలంగు దేజికాశ్వంబు
మెలంపుచు వింటనుం బంట్రకోలల నడిదంబున నత్తలంబున
నేసియు వ్రేసియు నడిచియుం గడపలం గానక మిడిసి మృతుండునుం
గాని దానవునిం జూచి వేసరి రోసంబున.
115
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )