కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
పావకాస్త్రము ప్రయోగింప రాక్షసుఁడు గంధర్వుఁ డగుట
క. భూపతి పావకబాణం
బేపున సంధించి తివిచి యేసిన మెయిఁ గీ
లాపటలి పొదువ నతఁడా
రూపం బెడఁబాసి ఖేచరులు వెఱఁగందన్‌.
116
లయ
విభాతి.
ధగధగనిదేహరుచి నిగనిగని కుందనపుఁ
దగడుఁ దెగడం, జిగురు జిగి నెగుచుమోవిన్‌
నగవు నిగుడం, గురుల పొగరు మగుడన్‌, నయన
యుగళి వెలిదామరల మగలమగలై డా
లెగయ, మృగనాభి భుగభుగ లెసఁగఁ, జామరలు
మగువ లిడ, మౌళిమణి మిగులఁగ వెలుంగం
దెగలు గలహారముల జిగి చెలఁగఁగాఁ, గొదమ
మొగులఁ దగు యానమున గగనచరుఁ డయ్యెన్‌.
117
క. నవనవ సౌరభముల నె
క్కువ కువలయవర్ష మపుడు కురిసెన్‌ మొరసెన్‌
రవరవ మురజ రవంబులు
దివి దివిష జ్జలజముఖులు తెలిసి నటింపన్‌.
118
వ. అనిన విని తరువాతి వృత్తాంతంబు వినుటకుం దివుటమై
మదీయ మానసంబు కౌతుకాధీనంబయ్యెడు వినిపింపుఁడని యడుగుటయును.
119
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )