కావ్యములు మను చరిత్రము చతుర్థాశ్వాసము
ఆశ్వాసాంత పద్య గద్యములు
శా. శ్లాఘాలంఘన జాంఘి కోజ్జ్వల గుణాలంకార! ఘీంకార హే
షా ఘోషోద్భట ధాటికా గజఘటాశ్వ క్షుణ్ణ విశ్వంభరా
మోఘీభూత భుజంగ భోగభర! సంఫుల్లాబ్జపత్రేక్షణా!
ద్రాఘీయః ప్రతిభావిచక్షణ! త్రయీ ధర్మైక సంరక్షణా!
120
క. బహువీర హనన మిళ దఘ
వహన భ్రమకృ త్కళంక వర్గోగ్రాసి
గ్రహిళ భుజయుగళ! గజప
త్యహిప హరణ తార్క్ష్య! సజ్జనావన దక్షా!
121
పృథ్వి. సుధీ మధురవా క్సుధా సుముఖ! నాగమాంబా సుతా!
మధు ప్రసవసాయక స్మయ విరామ రమ్యాకృతీ!
దధీచ విధుకామ ధుగ్ధనద దుగ్ధసింధు ప్రథా
వధీరణ పరాయణోజ్జ్వల వదాన్యతాలంకృతా!
122
గద్యము. ఇది శ్రీ మదాంధ్ర కవితాపితామహ సర్వతో ముఖాంక పంకజాక్ష
పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోప
తాపస ప్రసాదాసాదిత చతుర్విధకవితామతల్లి కాల్లసాని చొక్కయా
మాత్యపుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను
మహా ప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - chaturthAshvAsamu ( telugu andhra )