కావ్యములు మను చరిత్రము పంచమాశ్వాసము
. శ్రీనందన సౌందర్య! సు
ధీనందన! వితరణావధీరిత బలిరా
డ్భానుజ! పరరాజస్వ
ర్భాను భుజాహీంద్ర! కృష్ణరాయ నరేంద్రా!
1
వ. అవధరింపుము. జైమిని మునీంద్ర చూడారత్నంబునకు నీడోద్భవంబు లి ట్లనియె. 2
గంధర్వుఁడైన యిందీవరాక్షుని శాప వృత్తాంతము
తే. అపుడు గంధర్వపతి మహి కవతరించి
రాజు విస్మయమున హయరాజు డిగ్గ
నక్కు సేర్చి ముదంబుతో ననియె దంత
కిరణములు హారకాంతులు సరసమాడ.
3
సీ. భద్రమా నీకు నీ బాహాభృతక్షితిఁ, బ్రజలకు? లెస్సలా రాచవారు?
ధన్యుండ నైతి నీ దర్శనంబునఁ జేసి, నా దుష్కృతము లెల్ల నాశమొందె,
నీ జగత్త్రయి నన్ను నిందీవరాక్షాఖ్యఁ, గీర్తించు నప్సరో గీతసరణి,
గారాపు మీ తల్లికడవాఁడఁ గాని నే, గణుతింపఁ గడవాఁడఁ గాఁ జుమయ్య!
 
తే. పెండ్లి కొడుకవు మాకు, నీ బిసరుహాక్షి
కూర్మినందన, మొక మౌని ఘోర శాప
వికృతి మానిసిదిండి నై యకట! దీని
ప్రాణముల కల్గఁ దలఁచితిఁ బాపబుద్ధి.
4
క. అనునెడ వచ్చి మనోరమ
జనకుని పాదముల కెఱఁగ సస్నేహమతిం
గనుఁగవ నీ రొలుకఁగ నం
దన మూర్ధాఘ్రాణ మతఁడు దయఁ గావించెన్‌.
5
ఆ. అపుడు విస్మితాత్ముఁడై వరూధినిసుతుఁ
డేమి కారణమున నేతపస్వి
యిట్టి శాప మిచ్చె? నెఱిఁగింపు విన వేడు
కయ్యె ననఘ! యనిన నాతఁడనియె.
6
మ. కలఁ డుల్లోకయశఃపురంధ్రి జగతిన్‌ గంధర్వ వంశంబునన్‌
నలనాభాహ్వయుఁ, డేఁ దదీయతనయుండన్‌ బ్రహ్మమిత్రుండు శి
ష్యులకుం గంటను వత్తిఁ బెట్టుకొని యాయుర్వేద మోరంత ప్రొ
ద్దులఁ జెప్పన్‌ వినుచుండి మానసమునందు దజ్జిఘృక్షారతిన్‌.
7
తే. మౌనివరుఁ జేరి భక్తి నమస్కరించి
చెప్పవే నాకు నీ విద్య శిష్యకోటి
తోడఁ గూడంగ నేఁ గృతార్థుండ నగుదు
ననుచుఁ బ్రార్థింప ననుఁ జూచి యపహసించి.
8
క. నటవిట గాయక గణికా
కుటిలవచ శ్శీథురము గ్రోలెడు చెవికిం
గటు వీ శాస్త్రము వల ది
చ్చట నినుఁ జదివింపకున్న జరుగదె మాకున్‌?
9
తే. అనఁగ నే నట్టివాఁడఁ గాననఘ చరిత!
యించుకించుక మీవంటి యెఱుక గలుగు
పెద్దవారల శిక్షలఁ బెరిగినాఁడ
నవధరింపుము శిష్యుఁగా ననిన నతఁడు.
10
క. ధన రాజ్య రమా మదమునఁ
గనుగానని నిన్ను శిష్యుఁగాఁ గై కొనుకం
టెను నేరము గలదే? ననుఁ
గనలించుచుఁ బ్రేల కిఁకఁ బొకాలు మటన్నన్‌.
11
క. అచటన్‌ ద్వేష్టి గతాయు
శ్చ చికిత్సక మను నయోక్తి చర్చను నుచ్చా
వచ వచనంబులఁ గోపము
ప్రచురము గానీక మౌనిపతి కి ట్లంటిన్‌.
12
తే. నీవు చదివింతు వనుచు నిన్నియును విడిచి
బిచ్చ మెత్తంగ రాదుగా బేల తపసి!
కదవ నాడకు, చాలు నీ గొడవ యేల?
వెజ్జుఁదన మేల? యని మది లజ్జవొడమి.
13
శా. కంటే బ్రాహ్మణుఁ డెన్ని కాఱు లఱచెన్‌ గర్వించి? వీరెల్ల నా
కంటె\న్‌ బాత్రులె విద్య? కెట్లు నిది నేఁ గై కొందునంచున్‌ మది
న్గెంటెంపుంజల ముప్పతిల్లఁ గపటాంతేవాసి నై శాంబరిన్‌
గొంటుంజందము మాఱ శిష్యులగెడం గూర్చుండి చర్చారతిన్‌.
14
తే. కాయ బాల గ్రహోర్ధ్వాంగకములు నాల్గు
శల్య దంష్ట్రా జరా వృష సంజ్ఞ నాల్గు
నైనయష్టాంగకము ఠావు లారఁ గల్గు
వైద్య మెనిమిది నెలల సర్వమును నేర్చి.
15
క. ఇరుమూఁడు రుచుల దోషపు
విరసత మానన్‌ జ్వరాది వృష్యాంతం బై
పరఁగు చికిత్సయుఁ గని శాం
బరిఁ బాసి తపస్వితోడ మదమున నంటిన్‌.
16
శా. తండ్రీ! నాకు ననుగ్రహింపఁగదె వైద్యం బంచుఁ బ్రార్థించినన్‌
గండ్రల్‌గా నటు లాడి ధిక్కృతులఁ బోకాల్మంటి వోహో! మదిం
దీండ్రల్‌ గల్గినవారి కేకరణినేనిన్‌ విద్య రా కుండునే?
గుండ్రా డాఁచినఁ బెండ్లి యేమిటికిఁ జిక్కుం గష్టముష్టింపచా!
17
మ. అనినం గన్నులు జేవుఱింప నధరం బల్లాడ వేల్లత్పునః
పునరుద్య ద్భ్రుకుటీ భుజంగ యుగళీ ఫూత్కార ఘోరానిలం
బన నూర్పుల్‌ నిగుడన్‌ లలాటఫలకం బందంద ఘర్మాంబువుల్‌
చినుకం గంతుదిదృక్షు రూక్షనయన క్ష్వేళా కరాళ ధ్వనిన్‌.
18
వ. జటిలుండు కిటకిటం బండ్లు గొఱికి హుమ్మని కటమ్ము లదుర
ముకుపుటమ్ములు నటింపఁ గటకటా! కుటిలాత్మా! యటమటమ్మున
విద్యఁ గొనుటయుంగాక గుటగుటలు గురువుతోనా! యని
కటకటం బడి కకపాలలోని బూది కేలం గొని యాసురి యగు
మాయ మాయెడం బ్రయోగించి వంచించి యపహసించితివి
గావున నసురవై పిశితంబును వసయును నసృగ్రసంబు నశనంబులుగా
మెసవి వసుధ వసియింపు మని బసుమంబు సల్ల గుండె
జల్లుమని కల్లువడి మునితల్లజు పదపల్లవంబులం ద్రెళ్ళి యిట్లంటి.
19
శా. నా యజ్ఞానము సైఁచి సంయమివరేణ్యా! కావవే రాక్షసుం
డై యే నెట్లు భజించువాఁడ దురితంబయ్యో! నృమాసంబు కూ
డై యే నెట్లు భరించువాఁడ నుదరం, బార్ద్రాంతరంగుండ వై
యోయయ్యా! దయసేయవే యవధి, యే నోపంగదే హింసకున్‌.
20
చ. అనినఁ బ్రసన్నుఁడై ముని కరాబ్జములన్‌ నను నెత్తి వత్స! మ
త్సునిశిత శాప శూల హతి స్రుక్కితిగా యిఁకఁ గొన్నినాళ్ళపైఁ
దనయను మ్రింగఁ బోయి యొక ధన్యుని దివ్యశరార్చిఁ బ్రేలి వే
కనియెదు భద్ర మన్నఁ దురగంబుపయిం బడి ప్రొద్దుగ్రుంకఁగన్‌.
21
క. సన్నపుఁదలయేరున మయి
యన్నుకొనుచు నాము దిన్న యట్లై రాఁగా
ఖిన్నుఁడ నై పురి కేఁగితిఁ
దిన్నఁదనం బుడిగి కొన్ని దివియలు వెలుఁగన్‌?
22
క. అంపఁ దగువారిఁ గసరుచు
నంపి నగరు సొచ్చి వెలఁదు లారతు లీఁగా
నిం పఱఁ గశాభిహతులం
జంపించితి వారి నన్నిశామధ్యమున\న్‌.
23
సీ. అభ్రమండలి మోచునందాఁక నూరక, పెరిఁగిన ట్లౌ మేను నరవరేణ్య!
యవధి భూధరసాను వందాఁక నూరక, పఱచినట్లౌ మేను పార్థివేంద్ర!
యబ్జభూ భువనంబు నందాఁక నూరక, యెగసినట్లౌ మేను జగదధీశ!
యహిలోకతలమంటునందాఁక నూరక, పడిన యట్లౌ మేను ప్రభువతంస!
 
తే. యఖిలజగములు మ్రింగునం తాఁకలియును
నబ్ధు లేడును జెడఁ గ్రోలునంత తృషయు
నచలచాలనణచ మైన యదటుఁ గలిగె
నసురభావంబు ననుఁ జెందు నవసరమున.
24
క. రక్కసుఁడ నై నెపం బిడి
యొక్కొక యపరాధమునకు నొక్కొక్కఁడు గా
బొక్కఁగ లోకము పురపురఁ
బొక్కఁగఁ బాడయ్యె నంతిపురముం బురమున్‌.
25
తే. ఊరు పా డైనఁ గెళవుల యూళ్ళ కుఱికి
మెసవ దొరఁకొంటిఁ బ్రజ మారి మసఁగినట్లు
తీఱెఁ గతిపయదినముల దేశమెల్ల
మల్లె వట్టిన చేని క్రమంబు గాఁగ.
26
వ. ఇవ్విధంబున విధివిధానంబున యాతుధానుండనై ధారాధరోత్సేధంబును
నతి నిశిత రోమసంబాధంబును ధూమ సమధామంబును
ధృతాంత్రదామంబును జలిత కపాలకుండలంబును జ్వలిత సిత
దంష్ట్రామండలంబును నాగాయుత త్రాణంబును మస్తకోత్తుంగ
ఘోణంబునునై యనవరత హింసానురూపంబగు రూపంబుఁదాల్చి]
శకటాంగభంగికమ్ములై యింగలమ్ము లొలుకు నపాంగమ్ములం
బిశంగమ్ము లగుచుఁ బశ్యజ్జనానుమోచనమ్ము లగులోచనమ్ములు
వెలుంగ బభ్రుకేశమ్ములు దూల సకలభూత భయంకర మ్మగు
పటిమ నిచటియుటజమ్ముల కుఱికి జటి యనక వటు వనక యతి
యనక వ్రతి యనక గృహి యనక సతి యనక శిశు వనక
భక్షించి భక్షించి కుక్షింభరిత్వంబునం బ్రవర్తిల్లితి నది యట్లుండె
 
వినుము. తారలకు వర్షధారలకు నిసుమునకుఁ గసవునకు లెక్క
గలిగినం గలుగుఁ గాని మదీయజఠరానల జీర్ణ జంతుసంతానంబు
నకు లెక్కయిడ న క్కమలగర్భుండును సమర్థుండుగాఁ డిట్టి
కృత్రిమ దనుజభావావిష్టుండ నగు నా దౌష్ట్యంబు సవసవగాఁ దెలిసి
ముదురకయ మున్న మత్కళత్రంబులం బుట్టినింటివా రుత్సవావ
లోకన వ్యాజంబున ననిపించుకొని చని నిజగృహంబుల నునిచి
రక్షించుకొని యుండి, రప్పు డే నశనంబు కానక, కానక కన్న
యిక్కన్నియం గైలాసకాననంబునం గుసుమంబులు గోయు
దానిం గని కనికరం బుడిగి కడుపుఁ జిచ్చునకు మ్రింగం
దఱుముకొనివచ్చి యిచ్చోట భవదీయ దర్శనంబున వృజినరుజ
వలన విముక్తుండనై నిజప్రకృతిం బొంది కృతార్థుండ నైతి.
27
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - paMchamAshvAsamu ( telugu andhra )