కావ్యములు మను చరిత్రము పంచమాశ్వాసము
సాయంసంధ్యా వర్ణనము
మ. వికసిల్లం బ్రజ చక్రపాలనము గావించెం, గరవ్యాపృతిం
గకుబంతంబుల నాక్రమించెఁ, బొసఁగంగా నేర్చె వర్ణాళిఁ, గాం
తికిఁ బాపెం బెఱరాజకోటిఁ, దుది శాంతిం బొందె, దైవంబు సేఁ
తకుఁ దాపం బిఁక నేలనంగ నినుఁడస్తప్రాప్తుఁ డయ్యెంగడున్‌.
32
తే. అసురవరుఁడైన యిందీవరాక్షుమేన
నంటుకొన్న స్వరోచిబాణాగ్ని వోలె
నంతఁ గనుపట్టె శుకతుండ కాంతిఁ దెగడి
సాంధ్య రాగంబు పశ్చిమాచలమునందు.
33
క. తలచూపె నప్పు డఖిలా
శల దట్టపు టిరులు చిలువ జవరాలు నభ
స్స్థల మండపకోపరి సీ
మల నిడిన సితాండపటలి మాడ్కిం జుక్కల్‌.
34
ఆ. సాంధ్యనటన చండ చండీశ పద హతిఁ
దరణిచక్ర మొరగి శరధిఁ గ్రుంగ
దోరగల్లువడియె భూ రథేతర భాగ
చక్రమనఁగ నపుడు శశియుఁ దోఁచె.
35
క. తమ మను కాలాహి ప్రపం
చము నెరగొని యోషధీశ సద్యఃకృత దం
డమున మగుడంగఁ గ్రక్కెడు
క్రమమున నొయ్యొయ్య విచ్చి కడలకుఁ దొలఁగె\న్‌.
36
వ. అనంతరంబ క్రమ క్రమంబున. 37
సీ. కలయ వెల్లువగట్టి జలజలఁ బ్రవహించు, శశికాంతవాంత నిర్ఝరముజలము
మలయానిలముచే దుమారంబు రేఁగు సౌ, గంధికంబు రజంబు కఱకుదుమ్ము
నిండార విరిసిన బొండుమల్లెల నుండి, వడియు మరందంబు గుడరసంబు
తొలఁకి మింటికిఁ బొంగు దుగ్ధపాథోరాశి, కరడులమీఁది మీఁగడల మెఱుఁగు
 
తే. తనకు రసవర్గములుగా సుధాకరుండు
సారె సారెకుఁ గరములు సాఁచి చాఁచి
యచ్చ తెలుపుగ నపుడు బ్రహ్మాండ మండ
పంబు వెన్నెల సన్నసున్నంబు సేసె.
38
వ. ఆ సమయంబునం బరిశ్రాంతుం డగునమ్మహీకాంతుం డొక్క
శశికాంత శిలా మండపంబున దట్టంబుగాఁ బఱచిన చిగురుపఱపుల
గంధర్వరాజునుం దానును సుఖాసీనుం డై యిష్టకథాగోష్ఠి నా
రాత్రి గడిపె నంత.
39
సీ. తనుఁ బాసి శశి దవ్వు చనిన నెవ్వగఁ బోలెఁ, దొలిదిక్కు జవరాలు వెలుకఁ బాఱెఁ
బ్రథమాద్రిసభయందుఁ బఱిచిన కెంబట్టు, జముకాణ మనఁగ రాగము జనించె
ధవుఁ గూర్మి కొసరుచున్నవి వోలె ముఖరాశి, వనరుహాస్యములఁ బద్మినులు తెఱచె
భానూష్మభీతి మున్పడిన చుక్కలభంగి, దొరలె వేకువగాలిఁ దరుల మంచు
 
తే. కాలగుణయుక్తి మింటి చక్కటికి నెగయ
వాసవునిపట్టి పొడవుగా వైచి యాడు
గచ్చు చమరిన దారు చక్రంపు బిళ్ళ
వోలె నొయ్యనఁ బ్రాచి లేఁ బ్రొద్దు పొడిచె.
40
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - paMchamAshvAsamu ( telugu andhra )