కావ్యములు మను చరిత్రము పంచమాశ్వాసము
ఇందీవరాక్షుఁడు నిజనగరి కరుగుట
క. ఈ గతి నత్తఱిఁ దెలతెల
వేఁగిన గంధర్వపతికి వేగుట విని తా
రాగమున కేఁగి కాంచిరి
రాగమ్మునఁ గొలిచి మను పురాతన ఖచరుల్‌.
41
ఉ. కాంచినఁ బొంగి వా రొసఁగు కానుక లర్థిఁ బరిగ్రహించి మ
న్నించి పురప్రయాణ రతి నిక్క నరేంద్రుఁడు మున్నుగాఁ దటి
చ్చంచలవాహమై మణుల చాయల దిక్కు లలంకరించి హొ
న్నంచు రథంబు చాఁగు! బళి! యంచు నకీబులు మ్రోయ నెక్కినన్‌.
42
క. నందనయు నుచితరత్న
స్యందనమునఁ జనియె నర్థి జనకునిబడి న
య్యిందీవరాక్షుఁ డీ గతి
మందరమున కెగయ గగన మార్గమునందు\న్‌.
43
సీ. మండిగాలిడి దంత శుండాగ్ర హతిఁ జించి, జలధరాంభముఁ గరుల్‌ చల్లులాడ
నహిమాంశు హయ హేష లాలించి చెవి వంచి, కెరలి వాజులు బయల్‌ గొరిజఁ ద్రవ్వ
ధ్వజ వాతహతి నాఱ వైద్యుతాగ్నులఁ జూఁడి, పగలు దివ్వెలవారు పంజు లెత్తఁ
బెటులు చప్పుడు లాత్మ భీరు స్వయంగ్రాహ, పరిరంభ సుఖము ఖేచరుల కొసఁగఁ
 
తే. జామరప్రభ గగన గంగా మరాళ
చకచక భ్రమ మొదవింపశంకరాద్రి
కాననముమోచి మందరాగంబుదాఁకఁ
బౌఁజువెట్టిరి తన్మూల బలము దొరలు.
44
క. కుంజర శతాంగ హయ భట
రంజితమై పై రజఃపరంపర లలమ\న్‌
మంజుల కాంతిఁ గసీసపు
మాంజిష్ఠముఁ బోలె గగన మండప మమరె\న్‌.
45
తే. సొరిది నీ రీతి దివిఁ దోడు సూపినట్టి
దొరలు గొలువంగ ఖచరేంద్రుఁ డరిగి యరిగి
మింట గ్రహరాజు తనసగమింట వెలుఁగు
మంథగిరిఁ గాంచి పలికె నమ్మనుజపతికి.
46
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - paMchamAshvAsamu ( telugu andhra )