కావ్యములు మను చరిత్రము పంచమాశ్వాసము
మందరగిరి వర్ణనము
సీ. జరఠ కచ్ఛపరాజు చరమాంగ గృహమేధి, భోగివేష్టన రేఖఁ బొలుచు జాణ
కులములోఁ దరితీపు గలిగి మించినమేటి, మైనాకు నొరసిన మావటీఁడు
తొలువేలుపుల వేలుపులపనుల్‌ గొనుఱేఁడు, కడలిరాయల లోఁతు గన్నగబ్బి
సురరాజునకుఁ బాండుకరిఁ జేర్చు మరకాఁడు, కల్పకంబుల పంట కమ్మతీఁడు
 
తే. గంటె! మథిత సుధా ధౌత కటక జాత
చంపకవన ప్రకంపనాకంప విసర
దఖర ముఖరవ మధుకర ముఖర శిఖర
నందరస మందిరం బగు మందరంబు.
47
శా. వైకుంఠాంగద హేమ మాతత వలద్వాతాశనాకృష్ట రే
ఖాకారంబులఁ జుట్టు నంటి మొలనూలై మేటియొడ్డాణమై
శ్రీకారప్రభఁ గంఠియై శిఖరిరాట్సింహోల్లసత్పట్టమై
యీ కొండం గనుఁ గొంటె! మాయ దిపుడు\న్‌ హేరాళపుం గాంతుల\న్‌.
48
తే. వేదవేదాంతముల వేధ వెదికి కనని
పద్మలోచను శ్రీపాద పంకరుహము
లబ్జరేఖాంకితము లవే యచలవంశ
వల్లభుని మేఖలాసీమ నెల్ల మెఱయు.
49
ఉ. నాలుకబంతి వ్రేలఁబడి నంజునఁ దోఁగి తమాలపల్లవ
శ్రీల హసింప నుబ్బి కనుఁ గ్రేవల జేవుఱు పుక్కిలింపఁగా
వాలిక మేనిపీఁ చెగయ వాడిన మాల్యమువోలె నాదిమ
వ్యాళము దీనిపగ్గ మయినట్టి యవస్థఁ దలంతు నెప్పుడు\న్‌.
50
చ. బిలముఖ పంక్తి నీ ధరణిభృత్పతి వారిధి నిర్భరభ్రమి\న్‌
దలముగ మున్ను ద్రావిన సుధారస ధార గుణంబునం జుమీ
పలితవికార దూర నిరపాయ సుఖస్థితిఁ గాంచె నాఁగఁ గో
మల విచలచ్ఛిరోరుహ తమాల వినీలిమ రేఖ యొప్పెడి\న్‌.
51
చ. జడధి మథింపఁ జిక్కి సుధ సౌరభ మానుటఁ జావు దక్కి ఱా
పడఁకులనుండి దుగ్ధభవ పాండిమ బొందుల నందమొంద నిం
దడవి మెకాలతోఁ గదుపులై చరియించును మేఁతకై బయ
ల్వెడలి ఢులీ కుళీర శకులీ మకరీముఖ వారి జంతువుల్‌.
52
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - paMchamAshvAsamu ( telugu andhra )