కావ్యములు మను చరిత్రము పంచమాశ్వాసము
మనోరమా స్వరోచుల వివాహ వైభవము
మ. అనుచుం జందనపంక పంకిల తలంబై కేతు రుద్ధాతపా
ధ్వనిరుష్ణం బయి మంచకోపరి కుటీ వాటీ నట న్నర్తకీ
జన మై యౌవత సర్వతః కలిత వీక్షా తోరణ స్రఙ్నిబం
ధన మై యొప్పుపురంబు సొచ్చి భవనద్వార ప్రఘాణంబున\న్‌.
53
క. మంతుల బాంధవభటసా
మంతుల నాశ్రితుల నిలిపి మహికాంతునిశా
కాంతమణి కాంతికందళ
కాంతం బగు నొక్క దొరనగర విడియించె\న్‌.
54
వ. విడియించి యనంతరంబ యంతఃపుర కాంతాకరాంత తంతన్యమాన
మణిభాజన నీరాజనమంగళంబు లంగీకరించి, ప్రియాంగనల
సంభావించి, మగుడ నాస్థాన మండపంబున కేతెంచి మతంగ
మంకి మంకణ మందపాల మరీచి మాండవ్య మార్కండేయాది
మహామునుల రావించి, లగ్నంబు నిశ్చయించి, గగనచర జంఘాల
కరప్రేషిత లేఖతరులేఖాముఖంబులఁ జిత్రరథ చిత్రాయుధ చిత్ర
సేనాదులగు గంధర్వులను వరాహకర్ణ గజకర్ణ సుకేతు మాణిభద్ర
ప్రముఖ యక్షులను రేవంత ప్రముఖ గుహ్యకులను మందార ముఖ్య
విద్యాధరులను బిలిపించి, వినయపూర్వకంబుగా విత్తాధిపతికి విజ్ఞాపన
పత్రిక లిఖియించి నిజప్రధానులం బంచి నలకూబరు రావించె నంత.
55
క. పసువుల నలుఁగిడి రైదువ
బిసరుహలోచనలు పెండ్లి పెద్దల యాజ్ఞ\న్‌
వసుధాధ్యక్ష బుభుక్షున
కసితాకలభరకుఁ బేరఁటాం డ్రొగిఁ బాడ\న్‌.
56
ఉ. మజ్జన మాడె రాజు కృశమధ్యమ లింపున వంప గుంపులై
గొజ్జెఁగనీటి వెల్లువలు గోవ జవాజుల నిగ్గుఁ జూపఁ జం
చజ్జరఠాహి కంచుకము చాయ మడుంగుల నొత్తెఁ జెమ్మనీ
రుజ్జగిల\న్‌ వహించె మెయి నూఁదినఁ బాఱు దుకూలచేలముల్‌.
57
చ. గరువున కొత్తఁ జెంగలువ కచ్చు ఘటించినమౌళిఁ జుట్టెఁ జెం
దిరికచెఱంగునం బసిఁడితీఁగెలు నించిన జిల్గుపాగ బం
భరసభ వాసనాపవనపారణఁ దేల నలందెఁ గస్తురి\న్‌
మరకతమౌక్తికాదిమణి మండనమండితుఁ డయ్యెనయ్యెడ\న్‌.
58
మ. కదిసె\న్‌ లగ్నమటంచు మంత్రులు దొరల్‌ గంధర్వరాజాజ్ఞ ను
న్మదవేదండ ఘటా భటాశ్వ రథ సేనా జైత్రవాదిత్ర సం
పద మీఱం జనుదెంచి కాంచిముదమొప్పం జేసి రారూఢుఁగాఁ
గదళీకాంచనకక్ష్యల\న్‌ మెఱయు లేఖస్వామి చౌదంతిపై\న్‌.
59
ఉ. అత్తఱిఁ బట్టణంబు వికచాంబురుహాక్షులు కౌతుకంబునం
జిత్తము లుల్లసిల్లఁ గయిసేసి గృహాంగన సౌధ మాలికల్‌
హత్తి నరేంద్రవీథిఁ జతురంగబలంబులుఁ గొల్వఁగా మరు
న్మత్తగజంబుపైఁ జను కుమార శిరోమణిఁ జూచి రుబ్బున\న్‌.
60
ఉ. అంచెలు గట్టి కాలి తొడుపై చననివు గదమ్మ ప్రోదిరా
యంచ లివేటి సంగడము లయ్యెను? దయ్యమ! యేటివేడ్క నా
కంచుఁ బదంబున\న్‌ మొరయు నందియ యూడఁగఁ దన్నిపోయి వీ
క్షించె లతాంగి యోర్తు మురజిన్నిభు సాగరమేఖలావిభు\న్‌.
61
చ. అలపులపల్లవుం డొకఁడు వట్టిచలంబున నేఁప దీనయై
యలుకలు తీర్చితీర్చి యొక యచ్చర వచ్చి నృపాలు నన్నగ
ర్వెలువడి చూచెఁ గాముకుఁడు వెంటనె రా నపుడాత్తఘర్మయై
వెలవెలఁబాఱె దన్ముఖము వెల్వెలఁబాఱె విటాననాబ్జము\న్‌.
62
చ. చిలుకలకొల్కి కల్కి యొక చేడియ నాటకసాల మేడపై
నిలువున నాడుచుండి ధరణీపతిఁ జూడఁ దలంచి యంచున\న్‌
నిలిచి రహిం గనుంగొనుచు నెయ్యమునం దనువల్లి యుబ్బి కం
చెల తెగిపడ్డఁ గేతనము చీరచెఱంగున మూసెఁ జన్నుల\న్‌.
63
ఉ. కీరమనోజ్ఞవాణి యొక కిన్నర కిన్నెర మీటి మీటి యొ
య్యారపులీల నేఁగి వసుధాధిపుఁ గన్గొనె జిల్గుపయ్యెద\న్‌
హారముఁ జక్కఁ బెట్టెడు కుచాహితహస్తముపైఁడిగోళ్ళు హిం
సారతి సేయు దర్పకుని సంపెఁగముల్కులుఁబోలె మించఁగ\న్‌.
64
చ. పరవశదైన్య మాడుకొను ప్రౌఢలఁ గానదు, ఘర్మవారిచేఁ
గరఁగి స్రవించుచిత్రకము గాన, దనాదృత వీటి పాటలా
ధరమున సున్న మంటిన విధంబును గానదు, నవ్వుటాల కా
భరణము గొన్నఁ గాన దొక బాల నృపాలుని జూచి నివ్వెఱ\న్‌.
65
చ. అలికులవేణి యొక్కతె రతాంతమునం దనయంగవల్లికం
బులకలు చొక్కు లేఁజెమరుఁ బుట్టఁగ నేఁగి నరేంద్రుఁ జూడ నా
పులకలు చొక్కు లేఁజెమరుఁ బోవక యట్టుల యుండె నట్టి దౌఁ
జెలు వగువానిఁ గన్గొనిన చెల్వకుఁ జూపుల కావె కూటముల్‌?
66
చ. అలరులబంతి జృంభికకు నడ్డము సేయుచుఁ గర్ణపాళిపై
కలకలఁ ద్రోయుచుం దరఁగ లౌ ప్రమదాశ్రులు గోట మీటుచుం
జెలి భుజపీఠి నొత్తగిలి చిల్కను దువ్వుచు వాలుఁగన్నుఁ గ్రే
వల కుదధార చేర నొక వారవిలాసిని చూచె రాసుతు\న్‌.
67
చ. జిలుఁగులఁ బెట్టుచుం దొడలఁ జెంద్రికపావడ యంట మైతడిం
బెళపెళ లేనిచీరఁ గటి బింకపుఁజన్నులఁ జేర్చికొంచు వే
జలకము లాడియాడి యొక చాన కరస్థితకేశ యై నృపు
న్వెలువడి చూచె లోఁబడితి నీ కని బాసకు నిల్చెనో యన\న్‌.
68
మ. ఒకనేత్రాంబుజ మొక్కగల్ల మొకచన్నొయ్యారపు\న్‌లీల వీ
థికిఁ దోఁప\న్‌ దలుపోరఁగా నొక పురంధ్రీరత్న మీక్షించె రా
జకిశోరంబుఁ దదీయలై వెలయుభాషాలక్ష్ములం జూచి త్ర్యం
బకభాగంబు మొఱంగి మైత్రికి శివాభాగంబ యేతెంచెనాన్‌.
69
మ. కలయ\న్‌ గూర్మిఁ జెమర్చునంగముల లగ్నంబైన సన్నంపుమం
జుల కౌశేయమునందు మించు కమల స్తోమంబుచేఁ జూచె నొ
క్కలతాతన్వి చెలంగి పొంగు మతికాంక్షల్‌ దీఱ మే నెల్లఁ గ
న్నులుగావించి కుమారుజవ్వనము చెన్నున్జూచుచందంబున\న్‌.
70
వ. ఇత్తెఱంగునం గరంగు నంతరంగంబులు గల కురంగాక్షుల యపాంగంబులం
దుఱంగలించు సితేతర తరళతర దృగ్రోచుల నభంగ
శృంగారరసవీచుల చాలునం బోలెఁ బొదువంబడి యాలంబిత
చీనాంబర ప్రాలంబమాలికాచిత్రమ్ములగు నాతపత్త్రమ్ములు
మెఱయఁ, బత్త్రమ్ముల డిగ్గి దుర్గాధిపతు లే మేమ యని త్రోపు
త్రోపాడుచు వీచు వీచోపు లచ్చమ్ము లగు కౌముదీగుచ్ఛమ్ముల
సంతరింప, నంతిక వైజయంతికలం గ్రాలువలువలం బొలయు
చిఱుగరువలిం దూలు నీలాలకల యలక లుభయపార్శ్వస
ముత్తుంగ మత్తమాతంగ మద సౌరభ సంగిభృంగ సంఘంబుల
నెలయింప, నింపారుకలపంబు లబ్బాటునం బేటులెత్తి యొండొరుల
యొత్తిడి\న్‌ బొడిపొడియై యెగయు విసృమరపరాగపూరంబు
చదల నెల్లెడ నుల్లెడ గట్టిన ట్టమర, దట్టదట్టమ్ముగ సాగు నాగరుల
వాగారవమ్ములు నిగుడ, నెడవడక పొగడు పొగడికల కల
కలమ్ములును, బుంఖానుపుంఖ శంఖభేరీపటహకాహళవేణు వీణాది
వాదనధ్వానంబును, గల మధురకిన్నరీ క్వాణంబుల రాణంద్రాణఁ
జెఱుచు విన్నాణంపుఁ గొల్పు టెలుంగులును, వేల్పు
గాణలు పాడు లక్ష్మీనారాయణుల కల్యాణంపుఁబాటలం దీటుకొను
తిన్నని రవంబులుం గలిసి బలిసికొను కోలాహలమ్ము లిమ్ముగ
సందడుల నెడ గలుగం జడియు వేత్రహస్తుల ప్రశస్తతర
సాహోనినాదంబు సంబంధించి పెంపొలయ నత్యంత కాంతంబయి
నిరంతరగతిం గ్రంతనడవ, నడదివియలై మకుటార
విందరాగంబులు వెలుంగ నలుగడల సామంత సందోహంబు
క్రందుకొన మందమందగమనంబునం జను బృందారకవేదండంబు
పై నుద్దండ తనుచ్ఛాయా కలాపంబు జంబేటి జంబాల
కదంబకంబు డంబు విడంబింపఁ దిన్నని రవంబునం గలసి బలసిన
కోలాహలంబు హంసాది విహంగమ హృదయంగమ
రావంబును బెడంగువడ నడచు క్రంత నత్యంత దర్శనీయంబులై
మెఱయు మంగళ ద్రవ్యంబుల నెడనెడఁ దీండ్రించు పుండ్రేక్షు
దండంబులకడలఁ గడలుకొను పసరుటాకులడాలు శైవాలంబు,
నందందక్రందుగా మండు చేదివియలు చెందొవలునుం గాఁ
బార్శ్వద్వయ సముత్తుంగ మణిసౌధ వీథికారోదోఽంతరాళంబున
గంధగజఘటా ఘనాఘనకాంతికధూళి మాగధ ప్రవాహంబునం
గూలంకషంబగు నృపతిపథ యమునాహ్రదంబు గగన గంగావ
గాహనాభ్యాసంబున నిండుకొనిపోవు నదియునుం బోలెఁ దనరఁ
దన సముద్దామ తేజోభరంబున\న్‌ జడిసిన మేరుగిరిమోరులుం
బోలెఁ దీరుగలభుజంబులం దాఱుమాఱుగా నిడిన తారతారంపుఁ
బంచసరంబులు దోరంతరహారంబులుఁ గేయూరహీరంబులుఁ
గర కంకణ కురువిందకందళంబులుఁ గటికనకమేఖలాఘటితం
బగుచేరు కరాచురీ మరకతంపుఁబిడిమెఱుంగులుం దఱిసి వెన్నెల
క్రొన్నురువుల బోరన న్నగు నరపడుగు జిలుఁగుకంచుకంబున మించి
వెలుపలం దోఁప మంచు గవిసిన రోహణమహీధరంబునుం
బోలె రాజభవనాంగణంబుఁ జేర వచ్చె నంత నక్కడ.
71
క. కాంతా కదంబకిసలయ
కాంత కరావర్జ్యమాన కనక ఘటీని
ర్వాంత సుగంధి జలంబుల
నింతి జలకమాడి జిలుఁగు లిడి తడి యొత్తె\న్‌.
72
చ. తళుకు దుకూలశాటిఁ గటిఁ దాల్చి పటీర మలంది హారకుం
డల మణిపారిహార్య రశనా కటకాంగుళిముద్రికాది భూ
షలు తొడి పారిజాతవికసత్ప్రసవావళిఁ బూని యొయ్య న
వ్వెలఁది వివాహవేది కలివేణులు దేఁ జనుదెంచె సిగ్గున\న్‌.
73
తే. ఇట గృహద్వారసీమకు నేఁగుదెంచు
నా కుమారున కిందీవరాక్షుఁ డెదురు
సని మరుత్కరి డిగ్గి వందన మొనర్చు
నతని దీవించి హితమంత్రియుతము గాఁగ.
74
వ. భూసురాశీర్వాదనాదంబులు రోదసి నిండ నభ్యంతర గృహంబునకుం
దోడ్కొని పోవునప్పు డప్పుడమిఱేఁ డెడనెడం బుణ్యాంగన
లొసంగు నీరాజనోపచారమ్ము లాదరించుచుఁ గక్ష్యాంతరద్వార
దేశంబుల మంగళార్థంబుగా నిడినపూర్ణ కలశ ముకురాది
పదార్థంబులఁ గనుంగొనుచుఁ దోరణ స్తంభాయమానరంభా తరు
కిసలయోత్తాలతాళవృంతానిలంబులఁ గుంతలంబులు చలియింప
మంథరగతిఁ గింపురుష వృషభుం డగు గంధర్వరాజప్రధానుం
డొసంగు కైదండ గొని యల్లనల్లన నడచి పురోహిత బ్రాహ్మణ
బంధుపురంధ్రీసందోహనీరంధ్రం బయి వైవాహిక క్రియారంభ
సంభార సంభ్రమద్రంభాది మరుద్రంభోరువుల కలికి నునుసోగ
పలుకుల కలకలంబునం గొలగొల మను కౌతుకాగారంబు సొత్తించి.
75
చ. ప్రభలు నభోవిటంకమున భానుమరీచులఁ బ్రోదిసేయఁగౌ
స్తుభనిభ నూత్నరత్న పరిశోభిత మై గరుడాశ్మ వేది రు
గ్విభవము పొల్పగుంజవిక విద్రుమపాద సువర్ణ పీఠిపైఁ
బ్రభుత దలిర్ప మామ పనుప\న్‌ వసియించె నుదంచితస్థితి\న్‌.
76
క. విధియుతముగ ఖచరుఁ దవ
న్యధినాథున కొసఁగె బసిఁడిహరివాణమున\న్‌
మధుర మఖభుగ్గవీ దధి
మధురస సంపర్క మయిన మధుపర్కంబు\న్‌.
77
తే. అంచితాకృతి సాక్షాత్కరించినట్టి
రమకుఁ బ్రతివచ్చు సుర మనోరమ మనోర
మ యనుదాని ననుంగు జామాతఁ గైట
భారి సరిఁగాగ నర్చించి దారవోసె.
78
క. తదనంతరంబ హర్షము
పొదలు మది\న్‌ మెట్టుఁబ్రాల పుట్టికలయెడం
గదియం బట్టిన పెందెరఁ
గదియించిరి బంధుజనులు కన్యావరుల\న్‌.
79
ఉ. అప్పుడు తూర్యముల్‌ మొరయ నమ్మిథునమ్ము విలోకనస్పృహం
దెప్పలఁదేల వంపఁబడు తెల్లని చీరతెరం గ్రమంబునం
గొప్పు మొగంబు నఱ్ఱుఁ జనుఁ గొండలుఁ దోఁప లతాంగిపోలెఁ జె
ల్వుప్పతిల\న్‌ సుధారసపయోనిధి పెందెరఁ బుట్టు నిందిర\న్‌.
80
చ. కటకరవంబు బోరుకలఁగ\న్‌ రమణుల్‌ తెరచీర వంచినం
దటుకున రాజుమో మెదుటఁ దారసమైన లతాంగి నేత్రముల్‌
చటులత లజ్జఁ దల్లడిలె జాలరిచే వలఁ బాసి ధాత్రిపై
నటు నిటు మిట్టిమిట్టి పడు నంబుచరంబులఁ బోలె నత్తఱిన్‌.
81
మ. అవనీశ త్రిదశేంద్రు చూపుబరి కన్యా గండపాళిద్వయీ
నవలావణ్యరసంబుఁ గొల్లగొని యంతం జెంత ఫాలంపురా
జు విలోకించి చలించి కై కొనిన యా సొమ్మెల్ల ఘర్మాంబుకై
తవ మొప్పన్‌ వెసడించి తూఱెఁ గబరీతాపింఛ కుంజాంతమున్‌.
82
ఆ. రాజుచూడ్కి కపుడు రాజీవముఖిచూడ్కు
లెదురుకొనియె లజ్జఁ గొదికి కొదికి
జడిసి జడిసి జహ్ను సంభవాంభోవేణి
కెదురు లెక్కు మీల కొదమ లనఁగ.
83
మ. తనుమధ్యత్రివళుల్‌ నటింప నిలమీఁదన్‌ మట్టియల్‌ మోవఁగాఁ
గనుపాపల్‌ పయిఱెప్పలం గదియ నుత్కంఠాగ్రయై నిక్కి నా
థునిమౌళిం దలఁబ్రాలు వోసె నవలా దోర్మూలకూలంకష
స్తనవిస్ఫూర్తికి సందిదండల ధళల్‌ సాహోనినాదం బిడన్‌.
84
చ. ముడివడుకంకణ ప్రభల ముత్తెపుసేసలు దోయిలించి యె
త్తెడుతఱి బాహుమూలకుచదీప్తులపైఁ బతిదృష్టి పర్వినం
బొడమిన లజ్జఁ బాణియుగమున్‌ వెస వంచియె మౌళిమీఁదికై
పొడవునఁ జల్లె లేనగవు పొల్తుక ఱెప్పల నప్పళించుచున్‌.
85
క. సకల క్ష్మాపతి యిడఁ గొ
మ్మ కచంబులనుండి రాలె మౌక్తికములు సా
త్త్విక జనిత గండ ఘర్మాం
బు కదంబాసార గరిమఁ బునరుక్తములై.
86
క. పతి సతిపై నిడు ముక్తా
వితతి పడం దొడఁగె వడి భవిష్యత్పురుషా
యిత నిర్దయ రతి రభస
చ్యుత సిత కబరీ ప్రసూన సూచక మగుచున్‌.
87
శ. కట్టెన్‌ మంగళసూత్రమున్‌ శరధి శంఖ శ్రీలకున్‌ బొమ్మలం
గట్టం జాలెడు కంఠపీఠి నిఖిల క్ష్మాభర్త శోణద్యుతుల్‌
దట్టంబై నఖకోరకోత్కరము తద్గ్రైవేయ హైమ స్ఫుర
త్పట్ట స్థాపిత పద్మరాగముల పంతంబుల్‌ విడంబింపఁగాన్‌.
88
క. అట్టియెడఁ బెండ్లిపనులన్‌
దిట్ట లగు పురంధ్రు లచట నిలిపిరి వహ్నిం
బెట్టిరి మణిపీఠి సురీ
పట్టముపైఁ బఱచి రందుఁ బతియును సతియున్‌.
89
క. ఆశు ద్విజ హుత హరిత శ
మీ శాఖా శకల నినద మేదుర విశదా
భీశు జ్వాలా జాల హు
తాశ క్రోడమున వేల్చి రాహుతు లెలమిన్‌.
90
తే. తోయజామోద లాజలు దోయిలించి,
ప్రమదమున వేల్వ నొకకొన్ని చెమటనంట
వ్రేళ్ళు గనుపట్టెఁ గెంజాయ వీతిహోత్త్రు
నాలుకలు సాటిరాకున్న నవ్వెననఁగ.
91
తే. స్తనగుళుచ్ఛ వధూ దేహదాడిమీ ల
తామతల్లికపై హోమ ధూమ మడరె
భర్త కభిమత రతిమహా ఫలవిపాక
మగుటఁ గోరి ఘటించుదోహద మనంగ.
92
మ. జగతీనాథవతంస మానతశిరస్సమ్మేళనన్‌ నెయ్యపుం
జగడంబుల్‌ ప్రియమొప్ప మాన్పెడుతఱిం జంచత్కిరీటాగ్ర ర
త్నగణ స్పర్శసహంబు గావలసియో నాఁ గోర్కి దైవాఱ న
మ్మగువం బాదతలంబు వట్టి సనెకల్‌ మట్టించె మోదంబునన్‌.
93
క. కడునవ్వించుచుఁ జెఱఁగులు
ముడివెట్టన్‌ బేరఁటాండ్రు ముదిత కనుబొమల్‌
ముడివెట్టె నాలిసిగ్గున
ముడివెట్టెన్‌ నారి చెఱకు మోసున మరుఁడున్‌.
94
సీ. పరిణమించిరి ధరామరపురంధ్రీహస్త, ఘటిత చేలాంచల గ్రంథికలనఁ
బరిపూర్ణనిష్ఠఁ గొల్చిరి ప్రదక్షిణపూర్వ, వినతి నాలుకలార్చు వేఁడివేల్పు
వీక్షించి రుడువీథి నక్షీణ సుస్థితి, స్థాయిఁ దోషిత రమాధవుని ధ్రువునిఁ
బరిణయప్రాప్త సప్తర్షి ప్రియాప్రేక్ష్య, సాక్షా దరుంధతీ సతి కెరఁగిరి
 
తే. సకల సంయమిగణ నమస్కరణ కృత్య
మాచరించి తదీయ హస్తాభిమంత్రి
తాక్షితలు మౌళిఁ దాల్చి రత్యాదరమున
దంపతులు బంధుకోటి కుత్సవ మెలర్ప.
95
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - paMchamAshvAsamu ( telugu andhra )