కావ్యములు మను చరిత్రము పంచమాశ్వాసము
దేవతలు కట్నములు చదివించుట
ఉ. కూరిమి మంత్రితోడ నలకూబరుఁ డేకత మాడి పెద్ద బం
గారపుఁ గోర గల్పవనికాజని కాంతములైన చీరలున్‌
హార విభూషణావళియు నమ్మిథునంబునకుం బ్రియంబుతో
నారదమౌనిచేత నదనం జదివించెఁ గుబేరుపేరుగా\న్‌.
96
క. కలిమి మెఱయంగ మఱియుం
గల బాంధవులొసఁగి రపుడు కాంచన మణి భూ
షలుఁ జీరలు నరపతికిం
బొలఁతికి నుడుగరలు ముదము పొదలఁగ నంత\న్‌.
97
సీ. పొగడపూవంటి కంపుల మదాంబువులును, మధువర్ణ దంతశంబములు మెఱయ
భీకర స్వర చారు బృంహితంబులు ఘనాం, గారకగ్రహ కాంతి కన్నులమర
నిలఁ జుట్టువడు తొండముల మించు పూర్వాంగ, మెత్తరంబై పిఱుం దత్తమిల్లఁ
గటము లుత్కటములై నిటలముల్‌ బటువులై, సిబ్బెంపు మొగముల నుబ్బుమీఱ
 
తే. స్వర్ణ కక్ష్యాంకుశ ప్రాస శరధి శార్ఙ్గ
ఖేట కుథ ఘంటకాద్యలంకృతులఁ జెలువ
మెసఁగు గంభీరవేది భద్రేభ శతము
నల్లునకు నిచ్చె గంధర్వ వల్లభుండు.
98
శా. ఉర్వీజానికి మామ యిచ్చె శిఖిపింఛోద్భాసివర్ణంబుచే
నర్వాచీనఘనాళి రోహితసహస్రాకీర్ణగా మింటఁ బూ
షార్వస్తోమముఁ జిత్రయానముల నూటాడించు గాంధర్వగం
ధర్వవ్యూహము దీప్తిచండమణికాండస్వర్ణసన్నాహము\న్‌.
99
క. తళతళని తరణి మెఱుఁగులఁ
దలతల మను మణుల మెఱసి తలఁచినచోట\న్‌
నిలుచు విమానము ఖేచర
కుల తిలకుఁడు కూర్మి పెండ్లికొడుకున కొసఁగె\న్‌.
100
వ. మఱియు రజత మహారజత శయ్యాసన భాజన డోలా కలాచికా
ఘట కటాహ వీటికాపేటికాది గృహోపకరణంబులును, మరకత
కురువింద పురుషరత్న పురందరమణి మౌక్తికాది మహారత్న
ఘటిత కటక తులాకోటి కంఠి కాంగ దైకావళీ కాంచి కోర్మి
కాది కలాప కలాపంబులును, విచిత్ర పేశల కౌశేయ
చీనాంబర ధట్టంబులం బెట్టినట్టి తెట్టియలును, నమూల్యాగరు
మృగమద సంకుమద కుంకుమ పటీర కర్పూర హిమాంబు
పూరంబులు దట్టుపునుంగు నగరుసత్తును మంచిగందవొడి చాఁ
దుదయ భాస్కరంబు లోనుగాఁగల పరిమళ ద్రవ్య సంభార పరం
పరలును, జవ్వనంపుఁ గ్రొవ్వున నివ్వటిల్లి మవ్వంపువాతెఱలు
వివ్వ నవ్వు నునుసోగ వెన్నెలలంగలసి పిసాళించు చంచల దృగంచల
ప్రభలం బచారించి, మెఱుంగుఁ జన్నులఁ గన్నెతమ్మి మొగ్గల
వన్నె నటమటించి, పెన్నెఱుల మెఱుంగుఁదుమ్మెదవన్నెఁ దటమటించి,
నెన్నడుముల విన్నువెన్నుదన్ని, బటువుమిగిలి విటనికాయంబు
రాయిడింబడి పుట పుటనైన కూలంకషచాటువులమాటకారి
తనంబు మెఱసి నాగరికపుఁ బనుల గరగరికల గళరవచ్ఛలాలాపా
చరణంబుల రవణంబుల మిసమిసలఁ బస గలిగి మేలిమైన
కులుకుల రసికజనంబుల మనంబుల మరులుకొలుపం జాలి సురు
చిరాభరణ భూషితంబగు పరిచారికా సహస్రంబును గూఁతునకు
నరణంబుగా నిచ్చి మఱియును.
101
సీ. అవన తాంగుష్ఠాగ్ర హార్య నిర్య ద్రత్న, ఖని ఘనాంతరిత శృంగాటకములు
ముద ముదావహదివ్య మైరేయ ధౌరేయ, గోత్రభి ద్విటపి నిష్కుట యుతములు
మహిళాకదంబ డింభ గ్రాహ్య గృహచర\న్‌, మృగనాభి సౌరభ్య నిర్భరములు
ప్రఖరాఖు నఖర ధారా విదీర్ణోద్గీర్ణ, సౌవర్ణమృత్కీర్ణ జాంగలములు
 
తే. కోక కలహంస ముఖరితాబ్జాకరములు
సిద్ధ చారణ గంధర్వ సేవితములు
మందర ద్రోణిఁ గొన్ని గ్రామములు కూర్మి
తనయ పసువున కొసఁగె గంధర్వవిభుఁడు.
102
తే. పౌరయాత్రిక సుర సిద్ధ చారణాహి
యక్ష గంధర్వ సాధ్య విద్యాధరులను
నిజపురంబుల కనిచె నిందీవరాక్షుఁ
డుడుగర లొసంగి విభవంబు గడలుకొనఁగ.
103
వ. అనిన విని జైమినిమునీంద్రుండు మీఁదటి వృత్తాంతం బానతీయ వలయు నని యడుగుటయును. 104
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - paMchamAshvAsamu ( telugu andhra )