కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
. శ్రీకృష్ణరాయ మనుజేం
ద్రా! కాంతాపంచబాణ! నరసింహ ధరి
త్రీకాంత గర్భ వార్నిధి
రాకాహిమధామ! కర్పర దళ విరామా!
1
వ. అవధరింపుము. శకుంతంబు లబ్బాదరాయణాంతేవాసి కిట్లనియె. నంత నొక్కనాఁడు. 2
మనోరమా స్వరోచుల ప్రథమ రాత్రి
సీ. పాండురప్రభఁ గ్రిందువడిన చీఁకటివోలె- జిగి నొప్పు నీలంపు జగతి మెఱసి
యౌన్నత్యమున మ్రింగినట్టి నింగులు గ్రక్కు- కరణి ధూపము గవాక్షముల వెడల
ధారుణీసతి సుగంధద్రవ్యములు దాఁచు- నరలపేటికవోలెఁ బరిమళముల
నెలవు లై చెలువారు నిలువుల విలసిల్లి- కొణిగఁ బారావత కులము వదరఁ
 
తే. బసిఁడినీట లిఖించిన ప్రతిమ లమర-నీఁగ వాలిన నందంద యెలుఁగు లొసఁగు
నట్టి సకినలమంచము లాదిగాఁగ-మెఱయు పరికరముల నొప్పు మేడమీఁద.
3
క. రమణునికడ కనుప మనో
రమకు\న్‌ మజ్జనము దీర్చి రవరవ కచపిం
ఛమునకుఁ గాలాగురుధూ
పము వెట్టి జవాది నంటు వాపి నిపుణత\న్‌.
4
సీ. చెంగల్వపూదండ సేర్చి పెందుఱుముపై- ఘనసారమున సూసకము ఘటించి
పన్నీటితోఁ గదంబము సేసి మృగనాభిఁ- బూసి కుంకుమ సేస బొట్టు తీర్చి
విశదముక్తాదామ రశనఁ జందురకావి- వలిపపు వలువపై నలవరించి
యఱుత వెన్నెలగాయు హార మొక్కటి వెట్టి- మణుల సొమ్ములు మేన మట్టుపఱిచి
 
తే. కన్నుఁగవ గెల్చి డాకాలఁ గట్టె ననఁగ-ఘల్లుఘల్లునఁ బెండెంబు గండుమీలు
గదల నల్లన నడపించి పొదివి తెచ్చె-నెచ్చెలుల పిండు యువతి నా నృపతికడకు.
5
క. తెచ్చుటయుఁ గేళిభవనముఁ
జొచ్చెనొ చొరదో యనంగ సుదతుల నీడం
జొచ్చి పయిఁ గొప్పు దోఁపఁగ
నచ్చేడియ తలుపుదండ నల్లన నిలిచె\న్‌.
6
క. తదనంతరంబ బోటులు
చదురుల నగవులను బ్రొద్దు జరిగినఁ గేళీ
సదనము నొక్కొక్క పని నెప
మొదవఁగ వెడలుటయుఁ జిత్త మువ్విళ్ళూర\న్‌.
7
సీ. దట్టంబు నీ కట్టినట్టి చెంగావికి- బాగు గా దని కేలఁ బయఁట నిమిరె
గోరంటొ? గోళ్ళనిక్కువపుఁగెంపో యని- చెయి పట్టి నయమున సెజ్జ సేర్చె
నగరుధూపముచేత నయ్యో తనూవల్లి- సెక సోఁకెనని యెదఁ జెయ్యివెట్టె
మృగనాభికా మకరికలఁ గప్రము మించె- నని మూరుకొనుచుఁ జుంబన మొనర్చె
 
తే. హారమణు లిటు సూపు నా యఱుత నున్న-హారమణులకుఁ గాంతి నీ డౌనొ? కావొ?
యనుచు నక్కునఁ గదియించు నా నెపమునఁ-గంపమును బొందు సతిమేను గౌఁగిలించె.
8
వ. అట్లు కవియం దమకించి త్రస్తరులఁ గుస్తరింప నింపు గలిగియు
మునుమున్న మనంబునం బొడమి యుండు నడలప్పుడు తలంపునం
బాఱిన సమర్థుండగు నతనిచే నది తీర్పించుకొనం గల
యదియై నవోఢ గావున మాటలం దేటపడం జెప్ప శంకించి స్త్రీ
స్వభావంబునం దొరఁగు కన్నీరు కంకణక్రేంకృతులు మీఱ గోరఁబాఱ
మీటుచు నూరకయున్నం గనుంగొని యవనిపతిపుంగవుం
డంతరంగంబునం జెంగలించు గౌతుకాంకురంబు కరఁగువడ
వెఱఁగుపడి యుద్వేగ సమన్వితుండై సంభ్రమించుచుఁ జెక్కుటద్దంబులు
నొక్కి కురులు చక్కం ద్రోయుచుం "దోయజాక్షి!
యక్షయానంద సంధాయకం బగు నిట్టి క్రీడాసమయంబున వగపునకుం
గారణంబేమి? నా యెడం గల్ల యేమేనియుం బాటిల్లదుగదా!
యెవ్వరే మప్రియంబు గావించి రెఱింగింపు వారి\న్‌ దండించెద,
నేమి సాధింప వలయుఁ జెప్పుమది వేధచే నున్న సాధించెద
మదీయంబులగు నర్థజీవితంబులు భవదధీనంబు, లుమ్మలిక యింత
యేటి" కనుటయు నబ్బోటి గ్రేఁటుచు నిట్లనియె.
9
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )