కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
తనవలన మృగపక్షి భాషాజ్ఞానము నెఱిగిఁ, తన్ను వివాహ మాడుమని విభావసి కోరుట
క. మును మాదగు వృత్తాంతము
వినిపింపఁగ వలయు నీకు విశ్రుతముగ భూ
వినుత! విను మనుచు నం దొక
వనజేక్షణ పలికె మధుర వాగ్జితశుకియై.
16
తే. అనఘ! మందార విద్యాధరాత్మభవను
నను విభావని యండ్రు గంధర్వవరులు
తెలిసియుండుదు నిమ్మహీతలమునందుఁ
బరఁగు మృగపక్షిజాతుల భాషలెల్ల.
17
క. అమ్మేటివిద్య నాచే
నిమ్ముగ నంతయు నెఱింగి నృప! నన్ను వివా
హ మ్మగు మనవుడు రెండవ
కొమ్మ మదిం బ్రేమ గడలుకొన నిట్లనియెన్‌.
18
ఆ. పారుఁ దనఁగ బరఁగు బ్రహ్మర్షి మా తండ్రి
యతఁడు విద్య లెల్ల నభ్యసించి
తపము నిచ్చఁ జేయఁ దలపోసి కీర భృం
గాళి రమ్యమైన యాశ్రమమున.
19
మ. ఫలమూలచ్ఛదనాంబు భుక్తిఁ బవనాభ్యాసక్రియాయుక్తి ని
ర్దళితాంతర్గత శాత్రవ ప్రకర జాగ్రద్గర్వ సర్వస్వుఁడై
చలికిన్‌ వానకు నెండకున్‌ మన మనుత్సాహంబు గానీక కం
దళితానందమునన్‌ ముకుంద చరణ ధ్యానావధానంబునన్‌.
20
క. అంగుష్ఠము నిల మోపి ప
తంగునిపైఁ జూపు సాఁచి ధగధగ లర్చి
స్తుంగత నింగులు నాకెడు
నింగలములు నాల్గుదెసల నిడుకొని కడఁకన్‌.
21
క. సుర గరుడ యక్ష రాక్షస
నర కిన్నర సిద్ధ సాధ్య నాగోత్కర మి
ట్లరు దనఁగఁ దపమొనర్చెం
బురుహూతుఁడు దాననాత్మఁ బొడమిన భీతిన్‌.
22
క. తనయొద్దఁ బుంజికస్థల
యను నచ్చర లేమ యున్న నమ్మునికడకుం
జనుమని యనిపినఁ బతి శా
సనమున వని కేఁగుదెంచె సంభ్రమలీలన్‌.
23
చ. చిలుకలు ముద్దుఁ బల్కులకుఁ జేరఁగ రా నెఱివేణి కాంతికిన్‌
మలయుచుఁ బై పయిన్‌ మధుపమాలిక వాయక సంచరింపఁగా
నలస విలాస యానమున నమ్మునిపాలికి వచ్చె వేల్పుఁదొ
య్యలి నునుసానఁ బట్టిన యనంగుని మోహనబాణమో యనన్‌.
24
వ. ఆ సమయంబున. 25
చ. అనువగు సుళ్ళ నొప్పు మలయానిలవాహము నెక్కి తేంట్ల న
ల్లిన నిడువాగెఁ బూని లవలీ నవవల్లిక లెమ్మెసొమ్ములై
పనుపడఁ జెట్లు వట్టి మను ప్రాఁతదళమ్ములతోడఁ దోలె నా
మనిదొర మంచురాజు మడిమంచగఁ గోయిలగంట మ్రోయఁగన్‌.
26
సీ. సొన దేఱి పొటమరించి నెఱెవాసినయట్టి-యాకురాలుపు గండ్లయందుఁ దొఱఁగి
యతిబాల కీరచ్ఛదాంకురాకృతిఁ బొల్చి-కరవీర కోరక గతిఁ గ్రమమున
నరుణంపు మొగ్గలై యర విచ్చి పికిలి యీఁ-కల దండలట్లు గుంపు లయి పిదప
రేఖ లేర్పడఁగ వర్ధిలి వెడల్పయి రెమ్మ-పసరువాఱుచు నిక్కఁ బసరు కప్పు
 
తే. పూఁటపూఁటకు నెక్కఁ గప్పునకుఁ దగిన-మెఱుఁగు నానాఁటికిని మీఁద గిఱిగొనంగ
సోగయై యాకు వాలంగ జొంప మగుచుఁ-జిగురు దళుకొత్తెఁ దరులతా శ్రేణులందు.
27
క. హిందోళంబునఁ బాడిరి
బృందారకసతులు విరహి బృందార్తిగఁ ద్రేఁ
చెం దేఁటులు వాసంతిక
విందునఁ బికశిశువు దాది వెడలం దోలెన్‌.
28
సీ. చలిగాలి బొండు మల్లెల పరాగము రేఁచి-నిబిడంబు సేసె వెన్నెలరసంబు
వెన్నెలరస ముబ్బి వెడలించె దీర్ఘికా-మంద సౌగంధిక మధునదంబు
మధునదం బెగఁబోసె మాకందమాలికా-క్రీడానుషంగి భృంగీరవంబు
భృంగీరవం బహంకృతిఁ దీఁగె సాగించెఁ-బ్రోషిత భర్తృకా రోదనముల
 
తే. విపినవీథుల వీతెంచెఁ గుపిత మదన-సమదభుజ నత సుమ ధనుష్టాంకృతములు
సరస మధుపాన నిధువనోత్సవ విలీన-యువతి యువకోటి కోరికల్‌ చివురు లొత్త.
29
క. అత్తఱి మురిపపునడఁ జెలి
కత్తియగమి గొలువ మృదుల కలభాషలఁ ద
ళ్కొత్తెడు వెడనగవులతోఁ
జిత్తభవుం డార్వ ననలు చిదుము నెపమున\న్‌.
30
చ. అలకని జీబులోఁ గుసుమ మద్దినపావడ దోఁపఁ గొప్పు చెం
గలువలవల్పుఁ జన్నుఁగవ కస్తూరితావియుఁ ద్రస్తరింప నం
దెలరొద మీఱఁ బెన్నిధిగతి\న్‌ వ్రతికిం బొడకట్టె వేల్పుఁ దొ
య్యలి చిఱుసానఁ బట్టిన యనంగుని మోహనబాణమో యన\న్‌.
31
తే. అత్తెఱంగున నదిరిపా టారజంపు
వన్నెఁ బొడకట్టి తాఁ బాడు సన్నరవళి
పాట లళిఝంకృతిశ్రుతిఁ బాదుకొనఁగఁ
జూడకయ చూచు చూపుతో సుడియుటయును.
32
చ. తలకొని దాని తమ్ములపుఁ దావియు మోవియుఁ గౌను మేను న
గ్గలపుమెఱంగు లీను తెలిగన్నులుఁ జన్నులు భృంగమాలిక
న్గెలిచిన యారుతీరుఁ దగు నెన్నడలుం దొడలు\న్‌ వివేకముం
గలఁపఁగఁ గాంచి పంచశర కాండ విఖండిత ధైర్యసారుఁడై.
33
క. మేను గరుపాఱఁ దమి న
మ్మౌని జపముఁ దపముఁ దన్ను మఱచి యనంగ
గ్లానిఁ బడి కదిసి వడఁకుచు
హీనస్వర మెసఁగఁ బ్రోవవే న న్ననుచు\న్‌.
34
తే. చెయ్యి పట్టినమాత్రాన శిరసు వంచి
యవశచందానఁ బైవ్రాలు నవ్వధూటిఁ
బర్ణశాలాంతరముఁ జేర్చి బ్రాహ్మణుండు
కెరలు కోర్కులఁ గందర్ప కేళిఁ దేలె.
35
క. తప మంతయుఁ బొలివోవఁగ
నపు డన్నియు నుజ్జగించి యయ్యంగనతోఁ
దపసి మనోజ క్రీడా
విపులైశ్వర్యంబు లనుభవించుచు నుండె\న్‌.
36
క. ఈ రీతిఁ గొంతకాలం
బారామ మహా మహీధరారణ్యములం
దా రామ వలలఁ దగిలి వి
హారము సలుపంగ గర్భమై తఱి యగుడు\న్‌.
37
క. అంత ననుఁగాంచి యది విపి
నాంతరమునఁ బాఱవైచి యరిగెఁ, గృపార్ద్ర
స్వాంతుఁ డగు సంయమీంద్రుఁడుఁ
జింతింపకపోయె నేమి చెప్పుదు నధిపా!
38
వ. అట్లు వైచి చనుటయు నాఁకటం గటకటం బడుచుండి తీండ్రించు
శశిమండలంబున వెడలు శిశిరకిరణప్రణాళికామిళదమృతరసగ్రాసంబునం
జేసి కొన్ని పూఁటలం బుటపుటనైన నన్నుంగనుంగొని
మునీంద్రుండు ప్రియం బంది నిజాశ్రమంబునకుం గొని చని శశి
కళా సంవర్ధిత నగుటంజేసి నాకుం గళావతి యను నామం బిడి
పెనుచుచుండ నేనును జనక సేవాపరతం బ్రవర్తిల్లు చుండునంత.
39
ఉ. ఆ సమయంబునం బొగులు చాఁకటిపెల్లున నంతకంతకు\న్‌
గాసిలి పైపయిన్‌ వదన గహ్వర మెండఁగ నేడ్చి యేడ్చి యే
మాసయుఁ గాన కంతఁ దుహినాంశుఁడు దోఁచినఁ దత్కళారస
గ్రాసవిధి\న్‌ శరీర మమరంగ భజించితి దైవికంబున\న్‌.
40
సీ. ఏ నవ్విధంబున మేను వెంచుచు నుండ-నా చంద మంతయు నాత్మ నెఱిఁగి
కడు సంభ్రమమున నక్కడకు నేతెంచి యిం-పెసఁగ మైనిండిన కసటు దుడిచి
తనయురంబునఁ జేర్చుకొని పోయి యాశ్రమ-స్థలమున నిజపర్ణశాల నునిచి
విధుకళాంశాహార విధి వసించితిఁ గాన-నాకుఁ గళావతీ నామ మొసఁగి
 
తే. నయము మీఱంగఁ బెనుప నానాఁటఁ బెరిఁగి-శైశవము మాని యౌవనోత్సవముఁ జెంది
జనకునేమైన నడుగుచు సంతతంబు-నోపి శుశ్రూషచేయుచు నున్నచోట.
41
క. ఎవ్వరు చూచినఁ జూపులఁ
జివ్వకుఁ బద నడఁగి నడచు సిగ్గున నొఱపై
రవ్వకు మొదలగు పాపపు
జవ్వన మెదిరించె జిగి యెసఁగ నా మేన\న్‌.
42
శా. ఆ వేళం బొడగాంచి ఖేచరుఁ డొకం డాసక్తి దేవాసిసం
జ్ఞావంతుండు సభాంధవుం డగుచు నిశ్శంక\న్‌ నను\న్‌ వేఁడువాఁ
డై వాచంయముఁ డగ్ని కార్యనిరతుండై యున్నచోఁ బర్ణశా
లావాసంబున కేఁగుదెంచి నిజభావాకాంక్ష సూచించిన\న్‌.
43
సీ. శిఖిపించదళ పరిష్కృతములై సేమంతి, విరుల తీరగు శిరో వేష్టనములు
నెఱగంటిచూడ్కిఁ దాయెతుల బాహులు వంచి, నారాజు లల్లార్చు నారజములుఁ
గాదంబరీ గంధగర్భంబులై వల్చు, ఘనసార మిళ దాస్య గంధములును
దరహాసములఁ దోఁచు తాంబూల సేవాంధ, కారితాధర రద క్షతుల యొఱపుఁ
 
తే. జిగులుగందంపుఁ బూఁతలు జిహ్వికలకు-ననుపు నెఱవాది బంటు పంతపుఁ బదరులు
ఘన మగు జుగుప్స వెనుప నజ్జనముఁ జూచి-ఋషి మనంబునఁ గడు నసహ్యించుకొనుచు.
44
శా. ఆహా! ధన్యుఁడ గడు నైతి, మ ద్విమలవంశాచార విద్యా తప
శ్శ్రీ హోమాదులు నేఁడుగా తుది ఫలించె\న్‌, నాగవాసంబు మ
ద్గేహక్షోణికి బిడ్డ వేఁడుటకు నేతేఁ గాంచుట\న్‌ బ్రాహ్మ్య మిం
కోహో! చాలుఁ బొకాలిపోయెదరొ! పోరో! నోటిక్రొవ్వేటికి\న్‌?
45
క. మీ తరమువార లేతఱి
నేతరితనమునఁ దపస్వి గృహకన్యకల\న్‌
వీత భయ వృత్తి వేఁడిరొ
కో! తముఁ దర్కింప కౌర! క్రొవ్వు లటంచున్‌.
46
క. వసుధేశ! ముక్కు డుస్సిన
పసరము క్రియఁ గెరలి తిట్టెఁ బక్కున ఋషి వా
రుసురు మని వెడలిపోయిరి
ముసలి గదా! పుట్టినిల్లు ముఖ్యోష్ణతకు\న్‌.
47
వ. అట్టి యెడం దన మనోరథంబు విఫలం బగుటకుఁ గ్రోధాంధుండై
న న్నభిలషించు గంధర్వుం డిట్లనియె.
48
శా. నీ వైశిష్ట్యము తిట్టుల\న్‌ మెఱయునే నీకంటె నేఁ దక్కువే?
యీవేఁ గన్యక నీవు గాక మఱి మద్వృత్తాన్వయాచారముల్‌
నీవా పేర్కొనుపాటివాఁడ? విలఁ గానీ నిల్తుగా కేమి? పో
పో విప్రాధమ! నిన్నుఁ బోల నిఁక నల్పుల్‌ లేరు దంభవ్రతా!
49
తే. అనుచుఁ బగ చాటి పోయి, నాఁడర్థరాత్ర
సమయమున శస్త్రనిహతి మజ్జనకుఁ జంపె
నట్ల యగుఁ గాక పుడమిఁ గామాంధచిత్తుఁ
డెవ్వరి వధింపఁ? డెటు సేయఁ? డేమి గాఁడు?
50
తే. అపుడు మెడఁగోయ ముని రోఁజు టాలకించి
మేలుకొని దివ్వె యిడి సంభ్రమించి యేడ్చు
నన్నుఁ బొదివిరి పొరుగిండ్ల నున్న తపసు
లా దురాచారుఁడును బాఱె నటకు మునుప.
51
వ. అంతం దెలతెల వేగుటయుఁ బ్రభాతసమయంబున. 52
క. ధారాళ క్షత జోక్షిత
ఘోర జరా ధవళి తోరు కూర్చముగఁ గరా
చూరిని మెడ తెగి యుటజా
గారంబునఁ బడిన మూఁడుగాళ్ళ ముసలికి\న్‌.
53
ఆ. అగ్ని యిచ్చి యకట! యాబాల్యముగ నన్నుఁ
బెనిచెఁ దల్లి వైచి చనిన పిదపఁ
దానె తల్లిమాఱు నై నెమ్మి నట్టి మ
జ్జనకుఁ డీల్గె నేటి మనికి? యనుచు.
54
క. వందురి వగల\న్‌ దేహము
పొం దెడలఁగ జూచు నన్నుఁ బొడగని దివిఁ దా
నెందుల కేఁగుచునో గిరి
నందన దిగి వచ్చి కరుణ నా కిట్లనియె\న్‌.
55
మ. అతిసౌందర్యనిశాంత మీతను వలభ్యం బిట్లు శోకాతురా
న్విత వై దీనిఁ దొఱంగఁగా దగునె తన్వీ! చాలు నీసాహసం
బతిలోకుండు స్వరోచి నీకుఁ బతి యౌ నారాజుఁ జేపట్టి య
ప్రతిమశ్రీవిభవంబుఁ గాంచెదవు నాపల్కొండుగా నేర్చునే?
56
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )