కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
స్వరోచి భోగపరత, హంసీచక్రవాకుల విమర్శ
సీ. గంగాతరంగిణీ రంగత్తరంగ శీ, కర శీత సైకతోత్కరములందు
మందార మాకంద మకరంద తుందిలేం, దిందిరానందకృన్నందనములఁ
గాంత నిశాకాంత కాంత వితర్దికా, క్రాంత భూభృద్బృంద కందరముల
మసృణ బిసాహార మాంసల హంసికా, సంసదాసార కాసార తటులఁ
 
తే. దమక తమక ప్రియుం డని తమక మెసఁగఁ-బడఁతు లుప్పొంగఁ గ్రీడించెఁ పద్మినీ ప్ర
భావ ఘటితాన్నపాన భూషా విశేష-మాల్య వస్త్రానులేప సామగ్రిఁ జెంది.
62
మ. అరవిందాక్షులుఁ దాను నిట్లభిమత వ్యాపారముల్‌ సల్పుచు\న్‌
ధరణీశుం డొకచోటఁ గాంచె లఘు శీత స్వచ్ఛ వాఃపూరము\న్‌
వర కీరవ్రజ చంచు పాటిత తట వ్యాకీర్ణ మందార కే
సర మాకంద వినిస్సరత్ఫల రసాసారంబుఁ గాసారము\న్‌.
63
క. కని తత్తటస్థలంబున
ననుమతి విహరించె సవిధ హరిహయ వర నం
దన నందన హరిచందన
వన పవనార్భక వినోద వశగతుఁ డగుచు\న్‌.
64
ఉ. అందొక యంచలేమ గహనానిల సంచల దూర్మి మాలికా
మంద విహార సౌఖ్యమున మత్తిలి దవ్వుల నున్న చక్రవా
కిం దగఁ జేరఁ బిల్చి పరికించితె! యెంతతపం బొనర్చి రీ
యిందునిభాస్యలుం బతియు నేకమతిం గవగూడి యుండఁగా\న్‌.
65
క. మెలఁతకుఁ బతిపై నైనను
మెలఁతుకపైఁ బతికి నైన మేలగు టెందుం
గలయది మెలఁతకుఁ బతికి\న్‌
వలపు సమం బగుట జన్మవాసన చెలియా!
66
ఉ. కావున వీరియందు నధికం బగు కూరిమి గల్గియుండు నీ
భూవలయాధినాథునకుఁ బొల్పుగ నీవిభునందు నగ్గలం
బీ వనజాయతాక్షులకు నిచ్చఁ బ్రియం బది గానఁ బూవునుం
దావియుఁ బోలెఁ జాలఁ బ్రమదం బొనరించిరి నాకు నెచ్చెలీ!
67
వ. అని పలుకు నమ్మరాళలోలనయన పలుకు లాలంబుచేసి చక్రవాకి యిట్లనియె. 68
చ. ముదమున నిమ్మహీశుఁ డొక ముద్దియ చూడఁగ, నొక్కకాంతతో
సదమదమై కడంగి రతి సల్పుట తెల్లమిగా నెఱింగియు\న్‌
మది వివరించి రోయ కభిమానము దక్కిన వీరి కూరుముల్‌
వదలక పెద్ద సేసెదవు వందిగతిం, దగ వీ విచారముల్‌.
69
చ. పలువురయందు నొక్కనికి బ్రాఁతియు నొక్కనియందుఁ జూడ న
గ్గల మగు ప్రేమ పల్వురకుఁ గల్గుట యద్భుత, మట్లుగాన ని
వ్వెలఁదులయందుఁ గూర్మి పస వీనికి నేమియు లేదు వీనియం
దలవడఁ గల్గదీ జలరుహాక్షులకుం బ్రియ మెవ్విధంబునన్‌.
70
క. మనుజేశుఁడు కొలిచిన పరి
జనములతో నిష్టగోష్ఠి సలిపెడిచో నె
ట్లనురాగ మట్ల కూరిమి
వనితలు పెక్కండ్రయం దవశ్యము పతికి\న్‌.
71
క. ఈ నెలఁత లీమహీశు న
హీనగతిం దగిలిరేని నితఁ డొక లేమం
దా నెలమిఁ గూడునెడ నే
మానిని ప్రాణేశుమీఁది మమత మెలంగున్‌?
72
క. కావున దాసీనికరము
కైవసమై సంచరించు క్రమమున విద్యా
ప్రావీణ్యవైభవోన్నతి
చే వచ్చిన వారి వీరిఁ జెప్పకు మింకన్‌.
73
ఆ. తగులు నెవ్వఁడొక్క తరుణికి నొకనికి
మెలఁత వలచు నదియ మే లనంగ
వచ్చుఁ గాని పెక్కు వనితలపైఁ గూర్మి
గలుగు ననుట బొంకు గాదె తరుణి!
74
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )