కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
స్వరోచికి వైరాగ్యోదయము
క. ఈ కరణిఁ దూఱ నాడిన
యా కృష్ణమృగంబు పల్కు లట మున్నుగ న
క్కోకసతి యన్న మాటలు
నేకంబై తన మనంబు నెరియం జేయన్‌.
82
ఉ. అరయ నిట్టిరోఁతలకు నాలయముల్‌ జలజాక్షు లేటికిన్‌
వీరలతోడిసంగ మిఁక వీడెద నంచుఁ దలంచి తోన దు
ర్వారములైన కోరికల వంక వివేకము చొప్పు దక్కి యిం
పారఁగ నాఱునూఱు సురహాయనముల్‌ చరియించెఁ గ్రమ్మఱన్‌.
83
వ. తదనంతరంబ క్రమక్రమంబున మనోరమయందు విజయుండును
విభావసియందు మేరునందనుండును, కళావతియందు విభావసుండును
నను నందనులం గాంచి పద్మినీ విద్యాప్రభావంబునం బాకశాసన
దిశాముఖంబున విజయునకు విజయాఖ్యపురంబును, గిన్నరేశ్వర
హరిదంతంబున మేరునందనునకు గంధవతి యను పుట
భేదనంబును, దక్షిణంబున విభావసునకు ధారాహ్వయోదార మహా
నగరంబునుం గల్పించి యనల్ప విభవంబున నక్కుమారుల
నప్పట్టణంబులకుఁ బట్టంబుగట్టి కృతార్థుండై యొక్కనాఁడు.
84
ఉ. శాసితశత్రుఁ డానృపతిచంద్రుఁడు తూణధరుండు సజ్య బా
ణాసన పాణిపంకజుఁడు నై మృగసంఘములెల్లఁ బెల్లు సం
త్రాసము నొందఁ గ్రూరత నరణ్యమునన్‌ మృగయా కుతూహలో
ల్లాసమునం జరించెఁ జల లక్ష్యవిభేద విధావధానుఁడై.
85
వ. ఆసమయంబున. 86
క. కుటిల కృశ సాంధ్య రజనీ
విట కోరక కోమల చ్ఛవి స్ఫుటదంష్ట్రో
ద్భట పోత్ర ఖనిత్రాగ్ర
స్ఫుటితవనీధాత్రి నొక్క పోత్రిం గనియెన్‌.
87
సీ. జంభారిభిదుర సంరంభంబు వీక్షించి, జరుగు నంజన మహాశైల మనఁగ
ఝంఝా ప్రభంజ నాస్ఫాలనంబున కుల్కి, యరుగు సంవర్త కాలాభ్ర మనఁగఁ
గఠిన కంఠేకాలకంఠమూలము వాసి, వెస వచ్చు నుజ్జ్వల క్ష్వేళ మనఁగఁ
గలుష ధూర్వహ ఖలోత్కరముపైఁ బఱతెంచు, దండధర క్రూర దండ మనఁగ
 
తే. ఘుర్ఘురారావ సంఘాత ఘూర్ణమాన-సప్త పాథోధి పాథః ప్రచండ నక్ర
తిమి తిమింగిల మగుచు నభ్రమును మహియుఁ-గ్రమ్ముకొని వచ్చు నొక యేకలమ్ముఁ గనియె.
88
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )