| కావ్యములు | మను చరిత్రము | షష్ఠాశ్వాసము |
| హరిణీ రూపమున వచ్చిన వనదేవత స్వరోచిని బ్రసన్నుని జేసికొనుట | ||
| మ. |
కని మౌర్వీ నినదంబు సేయుచు భుజంగ క్రూర నారాచముం దన దోర్దండ కృతాంతదండనిభ కోదండంబునం గూర్చి బో రన నేయం దమకించుచుండ నొక సారంగాంగనారత్న మ జ్జన నాథాగ్రణిఁ జేరి పంచజన భాషాప్రౌఢిమై నిట్లనున్. |
89 |
| క. |
నృప! యీ క్రోడము నీకే యపకారము సేసె? దీని కలుగఁగ నేలా? కృప మదిఁ జొనుపక నాపై నిపు డీ శర మేసి నిగ్రహించుట యొప్పున్. |
90 |
| క. |
అని పలుక నతఁడు నీ వీ తనువుపయిన్ రోయ నేల? తద్దయు గృశమై యునికియుఁ గాదు గదా! చెపు మనవుడు నా హరిణి పల్కె నవనీపతికిన్. |
91 |
| ఆ. |
అన్యసతులయందు నాసక్తుఁ డగువానిఁ దమక మొదవి కూఁడ దలఁచుకంటె మరణ మైన మేలు మది వితర్కింపంగ ననుచుఁ బలుకుటయును నవనివిభుఁడు. |
92 |
| క. |
తావకహృదయం బెవ్వని పై వదలక నిలిచె నీదు భావము తెలియం గా వలయుఁ జెప్పు మన్న ధ రావల్లభుతోడ హరిణి క్రమ్మఱ ననియెన్. |
93 |
| చ. |
చెదరక నామనంబు నృపశేఖర! నీ యెడ నిల్చి మన్మథ ప్రదర పరంపరా విహతి పాల్పడి వ్రేఁగెడు నట్లుగాన నా యద టడఁగింపు మన్న హరిణాంగన వీవు నరుండ నే ముదం బొదవఁగ నీకు నాకు మిథునోచితకృత్యము లెట్లు చేకుఱు\న్. |
94 |
| క. |
నావుడు నను నాలింగన మీ వనురాగమునఁ జేయు మింతియ చాలు\న్ భూవర! యన్నఁ గృపార్ద్రుఁడు గావున నా నృపతి హరిణిఁ గౌఁగిటఁ జేర్చెన్. |
95 |