కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
స్వారోచిషుని భగవన్నుతి
కవిరాజ
విరాజితము.
జయజయ దానవ దారణ కారణ శార్ఙ్గ రథాంగ గదాసి ధరా!
జయజయ చంద్ర దినేంద్రశతాయుత సాంద్ర శరీర మహః ప్రసరా!
జయజయ తామరసోదర సోదర చారుపదోజ్ఘిత గాంగఝరా!
జయజయ కేశవ! కేశినిషూదన! శౌరి! హరీ! దురితాపహరా!
104
సీ. అవ్యయానంత విశ్వాత్మక విశ్వేశ, బ్రహ్మవు నీవ కపర్ది వీవ
యింద్రుండ వీవ వహ్నివి యనిలుఁడ వీవ, వరుణుండ వీవ భాస్కరుఁడ వీవ
యముఁడ వీవ వసూత్కరము నీవ రుద్రులు, నీవ యాదిత్యులు నీవ విశ్వు
లీవ మరుత్తులు నీవ మంత్రములు నోం, కృతి వషట్కృతి శ్రుతి స్మృతులు నీవ
 
తే. వేద్య మీవ యీవచ్చిన విబుధగణము- సర్వమును నీవ యెట్లన్న సర్వగతుఁడ
వగుట మఱి నీవు గానివాఁడనఁగ నెవ్వఁ-డరయఁగను శేషభూతసమస్త! శేషి!
105
మ. పరతత్త్వం బగు నీకు మోడ్పుఁగరముల్‌ పద్మాక్ష! గీర్తించెద\న్‌
బురుషార్థస్థితి నొప్పునిన్నుఁ గరుణాంభోధి\న్‌ భవార్తు\న్‌ జడు\న్‌
శరణార్థి\న్‌ ననుఁ గావఁగాఁ దగుఁ బ్రధానవ్యక్త! కాలాత్మ! యీ
శ్వర! భూతంబుల కీవె కర్తవును బ్రోవ\న్‌ భర్తవు\న్‌ హర్తవు\న్‌.
106
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )