కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
దశావతార స్తవము
చ. విలయ తమిస్రవేళ నతివేల మహాంబుధి నూర్ధ్వలోక వా
సులు నతులై కనుంగొనెడు చూడ్కుల కౌర్వహుతాశనక్రియా
కలితగతిన్‌ వెలుంగు ఘనకాయవిజృంభణఁ జోఱమీన వై
కలయఁగఁ గ్రాలు నీ వెడఁదకన్నులు ప్రోచు మమున్‌ మురాంతకా!
107
చ. చటుల కృపీట సంస్థిత రసాస్థలి వ్రీలక యుండ గార యి
చ్చుటకునుబోలె శంఖ మణి శుక్తికదంబము నుగ్గుగా విశం
కట చరమాంగ మంథగిరి ఘట్టనఁజేసి ఘరట్టమై కృపా
పటిమ జగంబుఁ బ్రోచు నల ప్రాక్కమఠంబు నినున్‌ భజించెదన్‌.
108
చ. ఉరుతరవిగ్రహస్ఫురణ నుబ్బిన నీ రుపరిచ్ఛిదాముఖాం
తరమునఁ దోరమై యెగయు ధార నజాండము గాజుకుప్పెతో
సరి యనఁగాఁ దలాతలరసాతలసీమలు సించి ధాత్రి ను
ద్ధరణ మొనర్చినట్టి నిను నాదివరాహము నాశ్రయించెదన్‌.
109
మ. కరుణించున్‌ మము నట్టి నీదు భుజయుగ్మం బెద్ది పూనెన్‌ నభోఽం
తరసీమన్‌ దితిజాంత్రసక్త నఖ సంతానంబుతో నో నృకే
సరి! రాత్రించరభీతికై త్రిభువనాస్థానీయవీథిన్‌ విక
స్వర శోణ స్రగలంకృత క్రకచ భాస్వత్తోరణ స్తంభతన్‌.
110
చ. దనుజకులేంద్ర దత్త కరతామరస స్థిత దానధారచే
ననిమిష దైన్య దుఃఖిత మహామునిమండల దృశ్య కశ్యపాం
గన నయనాంబువుల్‌ గడిగి కంజభవాండము మోవ లీల మైఁ
బెనిచిన దంభవామను నుపేంద్రుని నిన్ను సమాశ్రయించెదన్‌.
111
చ. తనదగు సంతతిం గనలి తానె వధించిన పాపముల్‌ చెడన్‌
మునిఁగెడు నాగుణోగ్రకిణముల్‌ మొనయంగ శమంతపంచక
మ్మునఁ బితృతర్పణచ్ఛలన మున్కలువెట్టు భవద్భుజాయుగం
బున కిదె వందనంబు భృగుపుంగవరూప! విహంగవాహనా!
112
మ. పవిధారా పతనంబు గైకొనని యప్పౌలస్త్యు మై సప్తధా
తువులం దూఱు పరిశ్రమంబునకు నుద్యోగించె నా సప్తసా
ల విభేదం బొనరించి నిల్వక సలీలం జన్న యుష్మన్మరు
జ్జవనాస్త్రం బొసఁగున్‌ సిరుల్‌ రఘుకులస్వామీ! రమావల్లభా!
113
క. పెరుఁగు ప్రలంబుని వీఁపునఁ
గరిపై హరివోలె విశద కాంతి నిలిచి త
త్కరణం బారాటముగాఁ
బరిమార్చిన నీదు బలిమిఁ బ్రణుతింతు హరీ!
114
తే. కొలుతుఁ దాదృగ్భవ ద్బాహు కులిశ యష్టి
నెద్ది గిరివోలెఁ గడుపులో వృద్ధిపొందఁ
బగిలి రాకాసి దేహంబు మొగపు ముత్య
మయ్యె ముంగామురారి రంగై మురారి!
115
క. కృతయుగ మేతేర నలం
కృతికై కాశ్మీరపంక మిడి యలుకుక్రియన్‌
క్షితి యెల్ల మ్లేచ్ఛరక్త
ప్లుతముగఁ గావించు రౌతుఁ బొగడెద నిన్నున్‌.
116
వ. అని ప్రస్తుతించినం బ్రసన్నుండయి పాంచజన్యధరుండు వాత్సల్యంబున
వత్సా! వరంబు వేఁడు మనుటయుం బ్రసాదం బని స్వారోచిషుం డిట్లనియె.
117
క. దేవ! భవద్దాస్యసుఖం
బే వేఁడెద దయకుఁ దగుదునే సాలోక్యం
బీవే! యితరము లొల్లన్‌
నావుడు నాతనికిఁ బద్మనాభుం డనియెన్‌.
118
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )