కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన అవతారిక
కృతిపతి కృష్ణదేవరాయల శౌర్య ప్రతాపములు
శా. వీర శ్రీనరసింహశౌరి పిదప న్విశ్వంభరా మండలీ
ధౌరంధర్యమున\న్‌ జనంబు ముదమంద న్నాగమాంబా సుతుం
డారూఢోన్నతిఁ గృష్ణరాయఁడు విభుండై రత్న సింహాసనం
బారోహించె, విరోధులు న్గహన శైలారోహముం జేయఁగ\న్‌.
16
సీ. యాదవత్వమున సింహాసనస్థుఁడు గామి - సింహాసనస్థుఁ డై చెన్ను మెఱయ
గొల్ల యిల్లాండ్రతోఁ గోడిగించుటఁ జేసి - పరకామినీ సహోదరతఁ జూప
మఱి జరాసుతునకై మథుర డించుటఁ జేసి - పరవర్గ దుర్గము ల్బలిమిఁ గొనఁగఁ
బారిజాతము నాసపడి పట్టి తెచ్చుట - నౌదార్యమున దాని నడుగు వఱుపఁ
 
తే. గోరి, తొలుమేనఁ దనకైన కొదువ లెల్ల
మాన్చుకొన వచ్చి భువనైక మాన్యలీల
నవతరించిన కృష్ణుఁడౌ ననఁగ మించె
నరసవిభు కృష్ణరాయ భూనాయకుండు.
17
శా. శ్రీరంగేశ్వర నాభి పంకజ రజశ్శ్రీకంటెఁ, జోళేంద్ర త
న్వీ రాజ త్కుచపాళి కుంకుమముకంటె, న్సహ్యభూభృత్తటీ
నీరంధ్రీకృత గైరిక ద్రవముకంటె, న్వన్నె గావించెఁ గా
వేరీ తోయముఁ గృష్ణరాయఁ డహితోర్వీనాథరక్త ప్రభ\న్‌.
18
సీ. చక్రవర్తి మహా ప్రశస్తి నాఁడును నేఁడు - చెలఁగి ధర్మ క్రమ స్థితి ఘటించె
భూభృదుద్ధరణ విస్ఫూర్తి నాఁడును నేఁడు - గో రక్షణ ఖ్యాతిఁ గుదురు పఱిచె
సాధు బృందావన సరణి నాఁడును నేఁడు - వంశానురాగంబు వదలఁ డయ్యె
సత్యభామా భోగసక్తి నాఁడును నేఁడు - నాకల్ప మవని నింపార నిలిపె
 
తే. నాఁడు నేఁడును యాదవాన్వయమునందు
జనన మందెను వసుదేవ మనుజవిభుని
కృష్ణుఁ డను పేర నరసేంద్రు కృష్ణదేవ
రాయఁ డనుపేర నాదినారాయణుఁడు.
19
చ. అలఫణి భోగ రత్నములు నాదిగిభోత్కట గండ గంధముల్‌
తలఁపునఁ బాఱి నవ్వు వసుధాసతి, దా భుజకీర్తి మౌక్తిక
చ్ఛలమునఁ గృష్ణరాయ నృపచంద్రుని బాహువునందు భూషణో
జ్జ్వలమణుల న్మృగీమదము వాసనయుంగని, ధూర్త లంగనల్‌.
20
చ. మునుకొని కొండవీట నతిమూఢత రుద్రుఁడు కృష్ణనందను\న్‌
మనసిజుని\న్‌ జయించె; నది మానుషమే! నరసేంద్రుకృష్ణరా
య నృపతి కొండవీట శరణాగతుఁడైన ప్రతాపరుద్ర నం
దనుఁడగు వీరభద్రుఁ గదనంబునఁ గాచె జగత్ప్రసిద్ధిగ\న్‌.
21
చ. నెలకొని కృష్ణరాయ ధరణీపతి యుత్కల భూమిపాలుతోఁ
గలన నెదిర్చి హస్తికరకాండ తతు ల్మసకంపుఁ బాములై
మలసినచోటఁ గూడిన సమగ్ర యశోవసనంబు గప్పి తా
వలవఁగ జేసె భూసతిని, వశ్యవిధిజ్ఞుఁడు గాన నేర్పున\న్‌.
22
సీ. ఉదయాద్రి వేగ యత్యుద్ధతి సాధించె, - వినుకొండ మాటమాత్రాన హరించెఁ,
గూటము ల్సెదరంగఁ గొండవీ డగలించె, - బెల్లముకొండ యచ్చెల్లఁ జెఱిచె,
దేవరకొండ యుద్వృత్తి భంగము సేసె, - జల్లి పల్లె సమగ్రశక్తి డులిచెఁ,
గినుక మీఱ ననంతగిరి క్రిందుపడఁ జేసె, - గంబంబుమెట్ట గ్రక్కనఁ గదల్చె
 
తే. బలనికాయము కాలిమట్టులనె యడఁచుఁ
గటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ
డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు
రాజమాత్రుండె! శ్రీకృష్ణరాయవిభుఁడు.
23
సీ. బాహు సౌధ క్రీఁడ బరఁగు పంతవలంతి - తొయ్యలి నిడుద కస్తూరి బొట్టు,
వైరిసైన్యాబ్ధిలో వచ్చు గెల్పుల నావఁ - గడఁ జేర్చు ప్రాఁకుడుఁ గడపుఁ జేయి,
యరి కుంభి కుంభ ముక్తాక్షరాంకిత మగు - జయ రమా కన్యక చదువు పలక,
శత్రురాజులకు నచ్చరల నాకర్షించు - సమరేంద్రజాల పింఛంపుఁ గుంచె
 
తే. మేను సగము యశో మహేశానునకును,
శౌర్యరవిఁ గోరి వచ్చిన చాయలేమ,
నరసవిభు కృష్ణరాయ భూనాథచంద్రు
చేత ననిలోన మించు కౌక్షేయకంబు.
24
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )