కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
పారిజాతాపహరణము - ప్రథమాశ్వాసము
వ. అభ్యుదయ పరంపరాభివృద్ధిగా నాయొనర్పం బూనిన పారిజాతాపహరణం బను
మహాప్రబంధంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన.
34
కావ్యావతారిక
క. జనమేజయ జనవల్లభుఁ
డను దినమును హరికథా సుధాస్వాదనమునం
దనివి సనక వైశం
పాయన మునికిట్లనియెఁ, గౌతుకాయత్త మతిన్‌.
35
సీ. హరివంశ కథ లెల్ల నానుపూర్విగ నిట్టు - విని కృతార్థుఁడ నైతి మునివరేణ్య!
యా దానవారాతి యమరులఁ బ్రోవంగఁ - బూని యా యదువంశమున జనించె
నతఁడు గ్రమ్మఱ వారి కాధార మగు పారి - జాతంబు పుడమి కేరీతిఁ దెచ్చె?
ననుమతి నిచ్చిరో! యా వేల్పు, లొండేని, - బలిమిఁ జేకొనియెనో! పాడి దొఱఁగి,
 
తే. తెలియ నానతి యిమ్ము సందియము దీఱ
వినఁగ వేడుక యయ్యె సవిస్తరముగ
ననిన నా వ్యాసముని శిష్యుఁడతనితోడ
నధిప! విను మని పలికె నత్యాదరమున.
36
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )