కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుని సంసార విభూతి
చ. హరి నరకాసురుం గెలిచి యద్దనుజేంద్రుని యింట నున్న య
చ్చరల కొలంబు వారి, నెఱజవ్వనముం బొలివోని వారిఁ, ద
న్వరునిఁగఁ గోరు వారి, లలనామణులం బదియాఱు వేవురం
బరిణయ మయ్యె నారదుని పంపున సౌఖ్య రసైక లోలుఁడై.
37
తే. మఱియు రుక్మిణి, సత్య, జాంబవతి, మిత్ర
వింద, భద్ర, సుదంత, కాళింది, లక్ష
ణ యనఁగా మున్న కల రబ్జనాభునకును
మహిషు లెనమండ్రు సమతాభిమానవతులు.
38
ఉ. ఆ రమణీ లలామముల నందఱఁ గూడి యదూద్వహుండు త
ద్ద్వారవతీ పురోపవన వాటికలం, గృతకాద్రి సీమల
న్వారిధి తీర కుంజ సదనంబులఁ, గేళి తరంగిణీ తటీ
కైరవిణీ సహాయ మణికల్పిత సౌధముల న్వసించుచున్‌.
39
శా. ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా
నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి, యే
చాయం జూచినఁ దానయై మెలఁగుచున్‌ సౌఖ్యాబ్ధి నోలాడు భో
గాయత్తుండయి పెక్కు రూపముల మాయా కల్పనా చాతురిన్‌.
40
క. హరి యిట్లు సతుల నందఱ
సరిగాఁ జూచియును, భోజ జనపాల సుతం
దరుణీమణి సాత్రాజితి
నిరువుర మన్నించి మిగుల నిచ్చుం జనవుల్‌.
41
చ. కులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునీ
వల నల రుక్మిణీ రమణి వాసిఁ జెలంగఁగ, సత్యభామయుం
గులమును రూపము న్మగని కూరిమియుం గలదాన నంచునా
వలఁ బచరింపఁగా, రవరవ ల్వొడమె న్మది వారి కెంతయున్‌
42
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )