కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
కృష్ణుఁడు పారిజాతమును రుక్మిణి కొసఁగుట
చ. కనుగవఁ బిన్న నవ్వు దొలఁక, న్మునినాథుని కన్ను సన్న ని
చ్చినఁ, దగ భోజనందనయుఁ జేకొని మౌనికి మ్రొక్కి యవ్విరిం
దన నెఱి గొప్పునం జెరివిన న్వలిగుబ్బలి ముద్దుపట్టి లేఁ
త నెల ధరించిన ట్లమరెఁ దద్దయు మోహన కాంతి సంపదన్‌
55
సీ. మగమీల నగఁజాలు తెగఁ గీలుకొను వాలుఁ - గనుఁగవ కొక వింత కాంతి యొదవె,
వలిజక్కువల పెక్కువలు దక్కువగ నిక్కు - చనుదోయి కొక వింతచాయ దోఁచె,
నెల తుమ్మెదల దిమ్ము వెలిఁజిమ్ము చెలువమ్ము - గల వేణి కొక వింత నలుపు మీఱె,
నల చెందొవల విందు చెలువెందు వెద చిందు - మొగమున కొక వింత జిగి దొలంకెఁ,
 
తే. జక్కఁదనమున కొక వింత చక్కఁదనము,
జవ్వనంబున కొక వింత జవ్వనంబు,
విభ్రమంబున కొక వింత విభ్రమంబు
గలిగె నద్దివ్య కుసుమంబు కతన సతికి
56
క. కలకంఠకంఠి యీగతిఁ
బులుగడిగిన ముత్తియంపుఁ బొలుపొందంగా
నెల నవ్వొలయఁగఁ బలికెను
జలజాసను పట్టి కలహ సంభ్రమ పరుఁడై
57
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )