కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
నారదుఁడు పారిజాత మహిమను వివరించుట
సీ. జలజాక్షి! యిది పారిజాత ప్రసూనంబు - నరులకు ధరియింప నరిది సూవె!
పౌలోమి పార్వతి పద్మ పద్మజురాణి - యును శిరంబునఁ దాల్తు రనుదినంబు,
హరి బహిః ప్రాణంబ వగుట నేఁ డెఱుఁగంగ - వచ్చె, నీకిపు డిది యిచ్చెఁ గాన,
వెలఁదులు పదియాఱు వేవురలో నెన్న - సరిలేరు సౌభాగ్య గరిమ నీకు,
 
తే. నీవు దాల్చిన కతన నీపూవు నేఁడు
భాగ్యము వహించె నుచితోపయోగ్య లీల
నీప్సితార్థంబు లొడఁ గూర్చు నిది లతాంగి!
దీని మహిమంబు చెప్పెదఁ దెలియ వినుము
58
క. పరిమళము సెడదు, వాడదు,
పరువము తప్పదు, పరాగ భర భరితంబై
నిరతము జగదేక మనో
హర మగు నీ కుసుమరాజ మంబుజ వదనా!
59
మ. అళి నీలాలక! నీవు నీపతి రహస్య క్రీడ వర్తించు వే
ళ లతాంతాయుధ సంగరంబునకు నుల్లాసంబు గల్పించు ను
జ్జ్వల దీపాంకురమై, రతి శ్రమ తనూ సంజాత ధారాళ ఘ
ర్మ లవంబు ల్దొలఁగింపఁగా సురటియై రంజిల్లు, నిచ్ఛాగతిన్‌
60
చ. అడిగిన యంతలోన సరసాన్నములన్‌ సమకూర్చు నాఁకటన్‌
బడలికఁ జెందనీక; యశుభంబులడంచు; జగత్త్రయంబునం
బడయఁగరాని సర్వగుణ భవ్యము సుమ్మిది; దీనిఁ దాల్చి యి
ప్పడఁతులలోఁ గనుంగొను మపార మహా మహిమానుభావముల్‌
61
చ. కువలయ పత్ర నేత్రి! నెఱిగొప్పున నీ కుసుమంబు దాల్చుటన్‌
సవతులు వచ్చి నీచరణ సారస యుగ్మము నాశ్రయింపగా,
ధవుఁ డఱలేని కూర్మి జవదాఁటక నీపలు కాదరింపఁగా,
నవిరళ భోగభాగ్య మహిమాన్వితవై విహరింతు గావుతన్‌
62
క. నెలకొని వేసవిఁ జలువయుఁ,
జలివేళల నుష్ణగుణము, సముచిత భంగిన్‌
గలిగించు నీలతాంతము,
కొలఁదులు చెప్పంగ నిచ్చ క్రొత్తలు సుమ్మీ!
63
క. అలరుంబోఁడుల లోపల
నలరుం బోఁడుములు నీకు నగ్గల మగుచున్‌,
దలపూవాడక యుండుము
తలపూవు ధరించి వికచ తామరసాక్షీ!
64
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )