కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
రుక్మిణిపైఁ గృష్ణ ప్రేమాతిశయ ప్రశంస
ఉ. ఇన్ని దినంబులున్‌ సవతు లిందఱలో నల సత్యభామ కన్‌
సన్నలఁ ద్రిమ్మరున్‌ హరి వశంవదుఁడై యన విందుఁ; గాని యో
కన్నియ! నీయెడం గలుగు గారవ మెయ్యెడఁ జూచి కాన; లే
కున్న ననర్ఘ్య కుసుమోత్తమ మేరికినైన నిచ్చెనే?
65
ఉ. చక్కనిదాన నంచు, నెలజవ్వని నంచు, జగంబులోనఁ బే
రెక్కినదాన నంచు, బతి యెంతయు నా కనురక్తుఁడంచుఁ దా
నిక్కుచు విఱ్ఱవీఁగుచు గణింపదు కాంతల సత్య; యింతకున్‌
స్రుక్కక యున్నె! నీ మహిమ సూచిన బోటులు విన్నవించినన్‌
66
క. ధరియించిన మొదలొక వ
త్సర మాత్రము తావకీన ధమ్మిల్లములో
నిరవుకొని మగుడ నివ్విరి
తరుణీ! యల పారిజాత తరువున కరుగున్‌
67
తే. అనుచు నారదుఁ డాడిన యట్టి పలుకు
లచటి వృత్తాంత మంతయు నరసి పోయి
వేఱు వేఱన సఖులు దేవేరులకును
విన్నవించిన వారును జిన్నవోయి
68
ఉ. అందరలోనఁ బెద్ద, మహిమాన్విత రుక్మిణి; గానఁ బూవు గో
విందుఁడు దానికిచ్చెఁ దగవేయని లక్షణ యోర్చె; సైఁచెఁ గా
ళింది; శమించె భద్ర; యవులెమ్మని యూరడిలెన్‌ సుదంత; లోఁ
గుందుట మానె జాంబవతి; కోప మడంచెను మిత్రవిందయున్‌
69
తే. వారిలోపల సౌందర్యవతియు మాన
వతియు మహనీయ సౌభాగ్యవతియు నైన
సత్య యంతట నేమొకో శౌరి కడకుఁ
బోయి రాదయ్యెఁ జెలి, ప్రొద్దువోయె ననుచు
70
మ. తన శృంగార వనంబులో నగరిపొంతం, జక్కఁగా దిద్ది తీ
ర్చిన పూఁదేనియ యేటి కాలువ దరిం, జెంగల్వ పుప్పొళ్ళు నిం
చిన చంద్రోపల వేదిపై సరస గోష్ఠిన్‌ బోటియుందాను న
వ్వనజాతాయత నేత్ర శౌరిగుణముల్‌ వాక్రుచ్చి వర్ణించుచున్‌
71
చ. అలికుల రావముల్‌ కిసలయాకుల కోకిల కాకు కాకలీ
కలకల నాదముల్‌ సెలఁగఁ, గమ్మని తమ్మికొలంకు తెమ్మెరల్‌
వొలయఁగఁ, దొంటి చందమున బుద్ధికి నేమియు నింపు గామికిం
గలఁగుచు సత్యభామ చెలిఁ గన్గొని యించుక సంశయించుచున్‌
72
చ. అకట! యిదేమియో యెఱుఁగ నయ్యెడుఁ దొయ్యలి! దక్షిణాంస చూ
చుక నయన ప్రకంపగుణ సూచన లేమియు వల్లగావు; సా
రెకు మది జాలి వొంది యొక రీతిఁ దలంకెడుఁ; బ్రాణనాయకుం
డొక చపలాక్షిఁ గూడి నను నొల్లని చెయ్దము లేమి చేసెనో!
73
క. అని సత్యభామ తనవిధ
మనుఁగుం దొయ్యలికిఁ జెప్పు నవసరమునఁ జ
య్యన వచ్చి యొక్క నెచ్చెలి
కనుఁగవ నెఱసంజ వొడమఁగా నిట్లనియెన్‌
74
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )