కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
సత్యభామ యాగ్రహోదగ్రత
చ. అనవిని వ్రేటు వడ్డ యురగాంగనయుం బలె, నేయి వోయ భ
గ్గున దరి కొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి, హె
చ్చిన కనుదోయి కెంపు తన చెక్కులఁ గుంకుమ పత్ర భంగ సం
జనిత నవీన కాంతి వెదచల్లఁగ గద్గద ఖిన్న కంఠియై
82
శా. ఏమేమీ! కలహాశనుం డచటికై యేతెంచి యిట్లాడెనా!
యామాట ల్చెవియొగ్గి తా వినియెనా యాగోపికావల్లభుం
డేమే మాడెను రుక్మిణీ సతియు? నీ వింకేటికిన్‌ దాఁచెదే!
నీ మోమోటలు మాని నీరజముఖీ! నిక్కం బెఱింగింపవే!
83
చ. అతుల మహానుభావ మని యవ్విరిఁ దానొక పెద్ద సేసి య
చ్యుతునకు నిచ్చకంబొదవ సూడిద యిచ్చిన నిచ్చెఁగాక తా,
నతఁడు ప్రియంబు గల్గునెడ కర్పణ సేసినఁ జేసెఁగాక, యా
మతకరి వేలుపుం దపసి మమ్ముఁ దలంపఁగ నేల యచ్చటన్‌?
84
క. పలు దెఱఁగు ముళ్ళ మాటలు
కలహమె కల్యాణ మని జగంబుల వెంటన్‌
మెలఁగెడు మౌనికి సహజము;
వలదని వారింపవలదె వల్లభుఁ డతనిన్‌?
85
క. ముని యేమి సేయు! రుక్మిణిఁ
గొనఁ గారణ మేమి! ధూర్త గోపాలుఁడు సే
సిన చెయిద మేమి చెప్పుదు!
మన మెరియదె! ప్రాణమైన మగఁడిట్లయినన్‌
86
క. పరికింపరు తమజాడలు,
తరుణుల తగులములు నమ్మఁ దగదండ్రు మదిన్‌
శరదంబుద చలచిత్తులు
పురుషులె పో; వారి నమ్మఁ బోలునె! చెలియా!
87
ఉ. ఇన్ని దినంబులున్‌ సవతు లిందఱలోఁ గడు గారవంబునం
గన్నియ! నన్ను వల్లభుఁడు కన్నులఁ గప్పుకొనంగ నుండి యా
వన్నెయు వాసియుం దొలఁగి వారు ననుం దల లెత్తి చూడఁగా
సన్నలఁ జాయలం బలుక సైఁతునె! ప్రాణము లెంత తీపొకో!
88
ఉ. నామొగ మోటకై వలని నాటకముల్‌ గటియించి, రుక్మిణీ
కామిని మీఁదటం గలుగు గౌరవముం గృపయుం బ్రియంబుఁ దా
నేమియుఁ గాననీక, యిట నిన్ని దినంబులు నన్నుఁ దేల్చెనో
తామరసాక్షి! మెచ్చవలదా! మురదానవ భేది కృత్యముల్‌
89
ఉ. ఓ చెలి! శౌరి కిచ్చెనఁట యొక్కలతాంతముఁ దెచ్చి నారదుం
డా చపలాక్షి కిచ్చెనఁట యాతఁడు నవ్విరి, యిట్టిమాట లా
హా! చెవుల న్వినఁబడియుఁ బ్రాణము దాల్చెద మేన; నింతగా
నోఁచితి, నింక నెట్టివి కనుంగొన నెమ్మెయి నున్న దాననో!
90
క. పూనుకొని మేలు గీళ్ళకు
లోనయి విహరించువారి లోక మెఱుఁగదో!
యా నరకాసుర దమనుఁడు
తా నెఱుఁగఁడొ! భోజకన్య తా నెఱుఁగదొకో!
91
ఉ. ఆ సరసీరుహాక్షి నిలయంబునఁ బంకజనాభుఁ డుండుటం
జేసి యొసంగెఁబో! తగవు సేకొని యొక్క లతాంత, మింతలో
వాసియు వన్నెయుం దగవు వైభవముం జలము న్వివేకమున్‌
బో సవతు ల్భజించుటకుఁబో వెఱఁగయ్యెడు, నేమి సెప్పుదున్‌!
92
క. కలకాల మొక్కగతిఁ బూ
సలలో దారంబు మాడ్కి సతి మదిలోనన్‌
మెలఁగెడు పురుషుఁడు గలుగుట
తొలుజన్మము నోముఫలము తోయజనేత్రా!
93
సీ. కలలోన నైన నవ్వుల కైన నామాట - జవదాఁట వెఱచు నో చంద్రవదన!
యేపదార్థంబు నాయెదుటఁ బెట్టక మున్న - యెవ్వారి కొసఁగఁడో యిగురుఁబోఁడి!
చెలులు నాతో నేమి చెప్పుదురో యని - లంచంబు లిచ్చు నో చంచలాక్షి!
తోడిచేడియలు నాతోడి వంతులకు రా - సయిరింపఁ జాలఁడో సన్నుతాంగి!
 
తే. యరమరలు లేని కూరిమి ననఁగి పెనఁగి
కొదలు తీఱని కోర్కులఁ గూడి మాడి
కపట మెఱుఁగని మమతలఁ గలసి మెలసి
యున్న విభుఁడిట్లు సేయునే యో లతాంగి!
94
సీ. కృతకాద్రి కందరా కేళీ నిగూహన - వేళా పరస్పరాన్వేషణములు,
పోషిత మాధవీ పున్నాగ పరిణయో - త్సవ కల్పితానేక సంభ్రమములు,
చాతురీ నిర్జిత ద్యూత పణాదాన - కలిత చేలంచలాకర్షణములు,
సాయం సమారంభ చక్రవాక ద్వంద్వ - విరహావలోకన విభ్రమములు,
 
తే. సాంద్రతర చంద్రికా కేశి చంక్రమములు,
విధు శిలామయ వేదికా విశ్రమములు,
ఫలక చిత్రిత నిజరూప భావనములు,
మఱచెనో కాక! రుక్మిణి మాయఁ దగిలి
95
క. పతి ప్రాణ సదృశ బంధువు,
పతి దైవం, బేడుగడయుఁ బతి సతులకు, న
ప్పతియ కడు మేర తప్పిన
గతి కులకాంతలకు వేఱు గలదే చెపుమా!
96
క. ధనమిచ్చి పుచ్చుకొన్నను
మనమున నోర్వంగ వచ్చు; మగఁ డింతులకున్‌
జన విచ్చి పుచ్చుకొన్నను
మన వచ్చునె? యింక నేటి మాటలు చెలియా!
97
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )