కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
సత్య కోప గృహ ప్రవేశము
క. అని వగల మిగులఁ బొగులుచు
జనితామర్షమునఁ గోప సదనంబునకున్‌
జనియెను లతాంగి హరిచం
దన కోటరమునకు నాగ తరుణియుఁ బోలెన్‌
98
ఉ. మాసిన చీర గట్టికొని మౌనము తోడ నిరస్త భూషయై
వాసెన కట్టు కట్టి నిడువాలిక కస్తురి పట్టు పెట్టి లో
గాసిలి చీఁకటింటికడఁ గంకటి పై జలదాంత చంద్ర రే
ఖా సదృశాంగియై పొరలె గాఢ మనోజ విషాద వేదనన్‌
99
చ. బిసరుహ పత్ర లోచనకుఁ బెల్లగు మోహము సంఘటిల్లె, వె
క్కసమగు నెవ్వగ ల్వొడమెఁ, గంపము పుట్టెఁ, జెమర్చె మేను, మా
నసమున విన్నఁబాటొదవె, నాటెఁ గడుం బరితాపవేదనల్‌,
మసకపుఁ బాము కాటు గతి మచ్చరమ న్విస మగ్గలింపఁగన్‌
100
చ. వెడ వెడ కన్ను మూయుఁ, గను విచ్చు, నగుం, దలయూఁచుఁ, బాన్పు పైఁ
బడు, నుసురంచు లేచుఁ, దడఁబాటును దత్తఱముం జలంబు లో
నడరఁగఁ గోపవేగమున నగ్గలమైన మనోజుబాధలం
బడి మద హస్తి హస్తగత పద్మినియుం బలె సొంపు పెంపఱన్‌
101
క. ఈ పగిదిన్‌ సాత్రాజితి
కోపోద్వేగమున వగల కుందుచు ఘన సం
తాపంబు పేర్మి నితర
వ్యాపారము మాని యుండె హరియును యటచన్‌
102
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )