కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు సత్య సౌధమున కరుగుట
మ. ముని నాకిచ్చిన పూవు చందమును నే మున్నాడి యా భోజనం
దన కర్పించిన జాడయున్‌ దెలియ చెంతన్నిల్చి వీక్షించి పో
యిన సాత్రాజితి బోటి నా వలన తా నేమేమి కల్పించెనో
యని ప్రద్యుమ్నుని మౌని దండ నిడి చింతాయత్త చిత్తంబుతోన్‌
103
ద. అరదము నెక్కి కేతన పటాంచల చంచల మైన తాల్మితోన్‌
తురగ జవంబు మున్గడవ త్రోచి కడంగెడు తత్తరంబుతోన్‌
తిరిగెడు బండి కండ్ల పగిదిన్‌ భ్రమియించు మనంబు తోడ శ్రీ
హరి సనుదెంచె సత్య సముదంచిత కాంచన సౌధ వీథికిన్‌
104
తే. వచ్చి యరదంబు డిగ్గి తద్ద్వార సీమ
దారకుని నియమించి తాన యొకడు
కమలనాభుండు కక్ష్యాంతరములు కడచి
యలబలము లేని నగరెల్ల నరసి చూచి
105
సీ. కనక పంజర శారికలకుఁ జక్కెర వెట్టి - చదివింప రేలొకో సకియ లిపుడు!
కరతాళ గతుల మందిర మయూరంబుల - నాడింప రేలొకో యతివ లిపుడు!
క్రొవ్వాఁడి గోళ్ళఁ దంత్రులు మీటి వీణియ - ల్వలికింప రేలొకో భామ లిపుడు!
కలికి రాయంచ బోదల నల్ల నెలయించి - నడిపింప రేలొకో పడఁతు లిపుడు!
 
తే. ఇన్ని దినముల వలె నుండ దేమి నేఁడు!
చిన్నవోయిన దీ మేడ చెన్ను తఱిఁగి;
పద్మ ముఖి తోడ నెవ్వరేఁ బారిజాత
పుష్ప వృత్తాంత మెఱిగింపఁ బోలు నొక్కొ!
106
క. అని యనుమానించుచు నొ
య్యన కోప గృహంబు జేరి యా సత్రాజిత్‌
తనయ ముసుంగిడి యుండగ
ననువు మెఱయ జొచ్చి మాయ యచ్చు పడంగన్‌
107
ఉ. కొందర మంతనంబులను కొందర జంకెన వాడి చూపులన్‌
కొందర చేతి సన్నల దగుల్పడ జేయుచు మీర బోయి మ
ధ్యందిన భాను మండల కరావళి హావళి వాడి యున్న తీ
గందలపించు నమ్మగువ కన్గొని యెంతయు విస్మితాత్ముడై
108
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )