కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ప్రథమాశ్వాసము
శ్రీకృష్ణుఁడు సత్యభామ ననునయించుట
ఉ. ఈ లలితాంగి చంద మొక యించుక జూచెద నంచు ధూర్త గో
పాలుడు తాలవృంత భామిని సత్య పిఱుంద నుండి మం
దాలస లీలమై విసరె నాదట గైకొని వీచె తద్వపుః
కీలిత పంచశాయక శిఖిం దరి కొల్పుచు నున్న కైవడిన్‌
109
ఉ. అంతట పారిజాత కుసుమాగత నూతన దివ్య వాసనల్‌
వింతలు సేయ తావి యిది విస్మయమంచు ముసుంగు త్రోచి యే
కాంత గృహంబు నల్గడలు కన్గొని సంభృతతాలవృంతునిం
కాంతుని జూచి బాష్ప కళికా తరళీకృత లోచనాంతయై
110
క. తలవాంచి మగుడ ముసుఁగిడెఁ
గొలకుల డిగజాఱి జాలుకొను బాష్పంబుల్‌
పలుచని చెక్కుల లవలీ
దళ పతిత మరంద బిందు తతి పురుడింపన్‌
111
ఉ. ఓర్పొకయింత లేని వికచోత్పల లోచన చిత్త వీథిఁ జ
ల్లార్పఁగ నీల నీరద శుభాంగుఁడు వే చనుదెంచె నంచుఁ గం
దర్ప హుతాశను న్వెలికిఁ దార్చు సఖుండును బోలె వేఁడి ని
ట్టూర్పు దళంబుగా నిగిడె నున్నమితావరణాంశు కాంతమై
112
చ. వనిత కుచద్వయంబు పయి వ్రాసిన కుంకుమ పత్ర భంగముల్‌
జనిత నితాంత ఘర్మ కణజాలముచేతఁ గరంగి మెల్ల మె
ల్లన వెలిపట్టు పయ్యెద కెలంకుల జాఱుట యొప్పె మానసం
బున నెలకొన్న క్రోధరసము న్వడవెట్టుచు నున్న కైవడిన్‌
113
క. మానవతి ఇట్లు మానని
మాన క్రోధములచే కుమారిలి చింతా
ధీన గతి నుండ మదిలో
నూనిన ప్రేమమున నంబుజోదరుఁడనియెన్‌
114
ఉ. ఇందునిభాస్య! మైతొడవులేల ధరింపవు సన్న కావులీ
వెందును మాన లేవు తెలుపేటికి కట్టితి వీటికా రుచుల్‌
కెందలిరాకు మోవి తులకింపగ జేయక నున్కి యేమి నీ
చందము వింత యయ్యెడు నిజంబుగ నా కెఱుఁగంగఁ జెప్పుమా
115
చ. మనమరయం దలంచి యొక మార్గము పన్నితొ నవ్వులాటకో
నను వెరపించెదో యకట నా యెడ నిక్కము తప్పు గల్గెనో
వనజ దళాయతాక్షి పగ వాడనె నన్నిటులేల జూడ వొ
క్క నిమిషమైన నీవు దయ కన్గొన కుండిన నిల్వ నేర్తునే?
116
చ. పలుకులఁ దేనె లుట్టిపడఁ బల్కవు నేఁ డిదియేమి? వాలుఁ గ
న్నుల నునుసిగ్గు నూల్కొనఁ గనుంగొన వేల? యురః స్థలంబుఁ జ
న్నుల నెదురొత్తి మక్కువ ననుం బిగికౌఁగిటఁ జేర్ప వేటికే?
చిలకల కొల్కి! యెవ్వ రెడ సేసిరి? నీకిటు లేల చింతిలన్‌
117
చ. మనమున మాటలం గ్రియల మన్నన లీ నొకనాఁడు నెట్టి కా
మినులకు, గారవంబు మెఱమెచ్చులకై పచరింతుఁ గాని, పా
యని యనురక్తి నీ యెడనె యగ్గలమై కనుపట్టు నాకు నీ
పనిచిన పంపు చేయుటయ ప్రాభవమౌటది నీవెఱుంగవే ?
118
మ. పడఁతీ నీ మధురాధరామృతము నీ బహా పరీరంభమున్‌
పడయన్‌ ధన్యుడ కాక యుండిన ననున్‌ పాటించి యొక్కింత నీ
నిడువాలున్‌ కడకంట చూడుమనుచున్‌ నిల్వోపమిం పైచెఱం
గొడియం చేవిరి దమ్మి వ్రేయుటకునై యుంకించి జంకించినన్‌
119
ఉ. పాటలగంధి చిత్తమున పాటిలు కోప భరంబు దీర్ప నె
ప్పాటును పాటు గామి మృదు పల్లవ కోమల తత్పద ద్వయీ
పాటల కాంతి మౌళి మణి పంక్తికి వన్నియ వెట్టఁ నా జగ
న్నాటక సూత్ర ధారి యదు నందను డర్మిలి మ్రొక్కె మ్రొక్కినన్‌
120
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )